శ్రీలంకలో ఈస్టర్ సండే పేలుళ్లపై ముందస్తు సమాచారం ఉన్నా... ఆపడంలో విఫలం చెందినట్లు పేర్కొన్నారు ఆ దేశ ప్రధాని రనిల్ విక్రమసింఘే. భద్రతా వ్యవస్థను పటిష్ఠ పరిచే విధంగా మార్పులు చేస్తున్నట్లు తెలిపారు.
పేలుళ్ల కేసు ఛేదించేందుకు లంక పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎందరో అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తూ.. పురోగతి కనబర్చారన్నారు. దాడికి పాల్పడిన బాంబర్లు విదేశాలకు వెళ్లి వచ్చిన ఆధారాలు దర్యాప్తు సంస్థలు సేకరించినట్లు తెలిపారు.
న్యూజిలాండ్ క్రెస్ట్చర్చ్ దాడికి ప్రతీకారంగా.. శ్రీలంకలో పేలుళ్లు జరిగి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రధాని విక్రమసింఘే.
ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, ఐక్యరాజ్యసమితి, ఇంటర్పోల్ సాయంతో ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి కలిసి పనిచేస్తామని చెప్పారు.