శ్రీలంక ఉగ్రదాడి మృతుల సంఖ్య 310 శ్రీలంకలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి బలైన వారి సంఖ్య 310కి చేరింది. మృతుల ఆత్మశాంతి కోసం శ్రీలంక ప్రభుత్వం నేడు సంతాపదినంగా ప్రకటించింది. జాతీయ పతాకాన్ని అవనతం చేసింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.30 గంటలకు, దేశ ప్రజలందరూ 3 నిమిషాలు మౌనం పాటించి మృతులకు అశ్రునివాళి అర్పించారు.
"ఈ రోజు (ప్రభుత్వం) మేము జాతీయ సంతాపదినంగా ప్రకటించాం. మృతుల గౌరవార్థం తెల్లజెండాలు ఎగురవేయాలని ప్రజలను కోరాము."-కమల్ పద్మసిరి, హోంశాఖ కార్యదర్శి
పార్లమెంట్ ప్రత్యేక సమావేశం..
ప్రస్తుత పరిస్థితులను సమీక్షించేందుకు ఈ రోజు సాయంత్రం శ్రీలంక పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మహింద రాజపక్సే దాడులపై ప్రకటనలు చేస్తారు.
అత్యవసర పరిస్థితి..
ఉగ్రదాడుల నేపథ్యంలో లంక ప్రభుత్వం ఇప్పటికే జాతీయ అత్యవసర పరిస్థితి విధించింది. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై రేపు పార్లమెంట్ మరోసారి సమావేశం కానుంది. నిన్న సాయంత్రం 8 గంటలకు విధించిన కర్ఫ్యూ ఈ రోజు ఉదయం 4 గంటలకు ఎత్తివేశారు.
ఊహించలేదు..
దాడులు జరుగుతాయన్న సమాచారం ఉన్నప్పటికీ, ఉగ్రవాదులు ఇంత పెద్ద స్థాయిలో దాడులు జరుపుతారని శ్రీలంక ప్రభుత్వం ఊహించలేదని రక్షణశాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో తెలిపారు.
"శ్రీలంక ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ అత్యవసర చట్టం పనిచేయదు. అందువల్ల నేను చేయగలిగింది తక్కువ. దాడులు జరుగుతాయన్న సమాచారం మందే ఉన్నప్పటికీ, ఇంత పెద్ద సంఖ్యలో చర్చిలకు రక్షణ కల్పించడం అసాధ్యం." - హేమసిరి ఫెర్నాండో, రక్షణశాఖ కార్యదర్శి
ఇదీ జరిగింది...
ఆదివారం ఈస్టర్ వేడుకల వేళ ఇస్లామిక్ ఉగ్రవాదులు రద్దీగా ఉండే చర్చ్‌లు, హోటళ్లే లక్ష్యంగా 8 వరుస బాంబు పేలుళ్లకు, ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో సుమారు 310 మంది మరణించగా, 500 మంది వరకు గాయాలపాలయ్యారు. వీరిలో 10 మంది భారతీయులు.
ఈ వరుస బాంబు పేలుళ్లకు పాల్పడింది 'నేషనల్ తౌవీద్ జమాత్' (ఎన్టీజే) ఉగ్రవాద సంస్థకు చెందిన ఏడుగురు ఆత్మాహుతి దళ సభ్యులు అని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు 24 మంది ఎస్ఐజే సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు.
ఇదీ చూడండి: లంకలో అత్యయిక స్థితి.. సైన్యానికి విస్తృతాధికారాలు