తెలంగాణ

telangana

ETV Bharat / international

తమిళ భాషలోని జాతీయ గీతానికి శ్రీలంక నో! - శ్రీలంక తమిళ జాతీయ గీతం

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తమిళ భాషలోని జాతీయ గీతాన్ని ఆలపించలేదు శ్రీలంక. 2016 నుంచి సింహళ, తమిళ భాషల్లో జాతీయ గీతాన్ని ఆలపిస్తుండగా మంగళవారం జరిగిన వేడుకల్లో కేవలం సింహళంలోనే ఆలపించారు. దీంతో మైనారిటీల పట్ల గొటబాయ ప్రభుత్వం అనుసరించే వైఖరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Sri Lanka drops Tamil version of national anthem from Independence Day celebrations
తమిళ భాషలోని జాతీయ గీతానికి శ్రీలంక నో

By

Published : Feb 5, 2020, 10:48 AM IST

Updated : Feb 29, 2020, 6:12 AM IST

శ్రీలంక తన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తమిళ భాషలోని జాతీయ గీతాన్ని తొలగించింది. 2016 నుంచి సింహళ, తమిళ భాషల్లో జాతీయ గీతాన్ని ఆలపిస్తుండగా... తాజాగా జరిగిన వేడుకల్లో కేవలం సింహళంలోనే జాతీయ గీతం ఆలపించారు. దీంతో ఎల్​టీటీఈతో యుద్ధం ముగిసిన తర్వాత జాతీయ సయోధ్య కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

2015లో..

దేశంలోని మైనారిటీ తమిళులు, మెజారిటీ బౌద్ధుల మధ్య సయోధ్య కోసం తమిళ భాషలోని జాతీయ గీతాన్ని ఆలపించడానికి 2015లో ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దేశంలోని రాజ్యంగం సైతం సింహళ, తమిళ భాషల్లో గీతాలాపన చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. 2016 నుంచి శ్రీలంక జాతీయ దినోత్సవం రోజున రెండు భాషల్లో జాతీయ గీతం పాడుతున్నారు. 2016 తర్వాత తమిళ జాతీయ గీతం పాడకుండా ఉండటం ఇదే తొలిసారి.

'వివక్ష ఉండబోదు'

శ్రీలంక 72వ జాతీయ దినోత్సవం సందర్భంగా అధ్యక్షుడిగా తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించిన గొటబాయ రాజపక్స... దేశంలో వివక్ష ఉండబోదని వ్యాఖ్యానించారు. 'అధ్యక్షుడిగా జాతి, మతం, పార్టీలకు అతీతంగా శ్రీలంక మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తా'నంటూ పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛా హక్కులను కాపాడతానని తెలిపారు.

గతేడాది నవంబర్​లో శ్రీలంక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు గొటబాయ రాజపక్స. శ్రీలంకలోని మెజారీటీ ప్రజలైన బౌద్ధుల మద్దతుదారుడిగా ఆయనకు పేరుంది. దేశంలో అధిక సంఖ్యలో ఉన్న బౌద్ధులకు ప్రాధాన్యం ఇస్తూనే అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడతానని ప్రమాణ స్వీకార ప్రసంగంలో స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు తనకు మద్దతిచ్చిన బౌద్ధ మతాధికారులకు, సింహళ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

గొటబాయ వైఖరి కారణంగా ఇప్పటికే శ్రీలంకలోని మైనారిటీల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మహీంద హయాంలో మాదిరిగానే నియంతృత్వ పాలన మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి: జోరుమీదున్న కోహ్లీసేన.. గెలుపు కోసం కివీస్

Last Updated : Feb 29, 2020, 6:12 AM IST

ABOUT THE AUTHOR

...view details