తెలంగాణ

telangana

ETV Bharat / international

Afghanistan Hero: ఆయనంటే తాలిబన్ల వెన్నులో వణుకు..!

అఫ్గానిస్థాన్​ మొత్తాన్నీ.. హస్తగతం చేసుకున్న తాలిబన్లు అదే దేశంలోని ఒక ప్రాంతంలో మాత్రం అడుగుపెట్టలేకపోతున్నారు. ఆ ప్రాంతాన్ని చేజిక్కించుకోవాలని 20ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నా.. ఇప్పటివరకు టచ్​ చేయలేకపోయారు. ఆ ప్రాంత నాయకుడు(Afghanistan Hero) అంటే భయంతో వణికిపోతున్నారు తాలిబన్లు. ఇంతకీ ఎవరాయన? ఆ ప్రాంతం ఏంటి?

Afghanistan Hero
అఫ్గాన్ హీరో

By

Published : Aug 20, 2021, 8:15 AM IST

Updated : Aug 20, 2021, 11:59 AM IST

అఫ్గానిస్థాన్‌ను కొన్ని రోజుల వ్యవధిలోనే మెరుపు వేగంతో ఆక్రమించేసిన తాలిబన్లు ఒక ప్రాంతంలో మాత్రం కాలు పెట్టలేకపోతున్నారు. దేశాన్నంతటినీ ఆక్రమించామన్న విజయ గర్వంతో ఊగిపోతున్న తాలిబన్‌ ఫైటర్లు ఎలాగైనా అక్కడ అడుగు పెట్టాలని ఇరవయ్యేళ్లకు పైగా విశ్వప్రయత్నాలు చేసినా కనీసం టచ్‌ చేయలేకపోయారు. ఆ ప్రాంతానికి చెందిన ఓ నేత(Afghanistan Hero) పేరు వింటేనే వారి వెన్నులో వణుకు పుడుతోంది.

ఇప్పుడు ఆ ప్రాంతమే అఫ్గానిస్థాన్‌ రాజకీయ వ్యూహాలకు కేంద్ర బిందువుగా మారింది. తాలిబన్ల దురాక్రమణపై సింహంలా గర్జిస్తున్న ఆ ప్రాంతమే పంజ్‌షిర్‌. ఆ నాయకుడే ఒకప్పుడు అక్కడ గెరిల్లా పోరాటంలో కీలకంగా వ్యవహరించిన అహ్మద్‌ షా మసూద్‌‌. అసలు తాలిబన్లకు తలవంచని పంజ్‌షిర్‌ ప్రత్యేకత ఏమిటి? రాక్షసత్వానికి మారుపేరైన తాలిబన్లకు అహ్మద్‌ షా మసూద్‌ అంటే ఎందుకంత భయపడేవారు?

అహ్మద్‌ షా మసూద్‌‌

పంజ్‌షిర్‌ ఎక్కడుంది?

హిందూకుష్‌ పర్వత శ్రేణులకు సమీపంలో కాబుల్‌కు ఉత్తరాన 150 కి.మీల దూరంలో పంజ్‌షిర్‌ ప్రావిన్స్‌ ఉంది. దాదాపు లక్షకు పైగా జనాభా కలిగిన ఈ ప్రాంతంలో తజిక్‌ జాతికి చెందిన ప్రజలే అత్యధికం. పంజ్‌షిర్‌ అంటే సంస్కృతంలో ఐదు సింహాలు అని అర్థం. ఈ ప్రాంతానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే 11వ శతాబ్దపు చరిత్ర ఆనవాళ్లోకి వెళ్లాల్సిందే. అప్పట్లో వరద నీటిని అడ్డుకొనేందుకు ఐదుగురు సోదరులు ప్రయత్నించారట. మహ్మద్‌ గజనీకి వారు ఓ ఆనకట్టను నిర్మించినట్టు అక్కడి స్థానిక చరిత్రలు పేర్కొంటున్నాయి. అక్కడి ప్రజల్లో పోరాట పటిమకు తోడు అడవులు ఆ ప్రాంతానికి కోటలా రక్షణగా నిలవడం అదనపు బలంగా చెప్పుకోవచ్చు.

పేరుకు తగ్గట్టే.. సింహంలా గర్జన!

కొన్ని శతాబ్దాల కాలంగా పంజ్‌షిర్‌ ఓ ప్రతిఘటన ప్రాంతంగా ఉండటంతో అటు విదేశీ బలగాలు గానీ, ఇటు తాలిబన్లు గానీ కాలుపెట్టలేకపోతున్నాయి. పంజ్‌షిర్‌ పేరుకు తగ్గట్టే అక్కడి ప్రజల్లో తెగింపు చాలా ఎక్కువ. అనేక తిరుగుబాట్లకు ఈ ప్రాంతమే వేదికగా నిలిచింది. గతంలో తాలిబన్ల పాలనను తుదముట్టించడంలోనూ ఈ ప్రాంతానిదే కీలక పాత్ర. అక్కడి ప్రజల్లో ఉన్న ఉద్యమ స్ఫూర్తిని మరింతగా రగిలించి వారిని మార్గదర్శకత్వం చేసిన వారిలో తాలిబన్‌ వ్యతిరేక నాయకుడు అహ్మద్‌ షా మసూద్‌. ఆయన తాలిబన్ల అంతానికి అహర్నిశలు కృషిచేశారు. 1970-80లలో సోవియట్‌ రష్యా దండయాత్రను తిప్పికొట్టడంతో పాటు 1996-2001లో తాలిబన్ల రాక్షస పాలనపై అవిశ్రాంత పోరాటం జరిపిన యోధుల్లో ఆయన పాత్ర కీలకం.

రాజకీయ వ్యూహాలకు కేంద్రబిందువుగా

తాలిబన్లను తరిమికొట్టి.. పంజ్‌షిర్‌ సింహంగా ప్రజల మనస్సుల్లో నిలిచి..

అహ్మద్‌ షా మసూద్‌.. కేవలం రాజకీయ నేత మాత్రమే కాదు.. మిలటరీ కమాండర్‌. సోవియట్‌ యూనియన్‌ 1979-1989 దండయాత్రను శక్తివంతమైన గెరిల్లా కమాండర్‌గా ప్రతిఘటించారు. 1990లలో ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రభుత్వ సైనిక విభాగానికి నాయకత్వం వహించారు. ఆ తర్వాత తాలిబన్‌ స్వాధీనంలోకి అఫ్గన్‌ వెళ్లాక వారి దుష్ట పాలనకు వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్ష కమాండర్‌గా తన చివరి శ్వాస వరకు పోరాడారు. ఉత్తర కూటమిని ఏర్పాటు చేశారు. 2001లో ఆయన యూరప్‌ను సందర్శించి తాలిబాన్లకు పాకిస్థాన్‌ మద్దతు లేకుండా ఒత్తిడి చేయాలంటూ యూరోపియన్ పార్లమెంట్ నేతలను కోరారు. తాలిబన్‌ పాలనలో అఫ్గాన్‌ ప్రజలు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, మానవతా దృక్పథంతో సాయం చేయాలని కూడా అభ్యర్థించారు.

తాలిబన్లు, ఆల్‌ఖైదాలు కలిసి నకిలీ విలేకరుల వేషాల్లో మీడియా ఇంటర్వ్యూ చేస్తూ 2001 సెప్టెంబర్‌ 9న జరిపిన ఆత్మాహుతి దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత రెండు రోజులకే అమెరికాపై ఆల్‌ఖైదా దాడులు చేయడం యావత్‌ ప్రపంచాన్నిఆందోళనకు గురిచేసింది. ఇదే చివరకు నాటో దళాలు అఫ్గాన్‌పై దాడి చేయడం, మసూద్‌ దళాలతో ఆ బలగాల స్నేహానికి దారితీసింది. ఆ తర్వాత ఉత్తర కూటమి తాలిబన్ల రాక్షస పాలనకు వ్యతిరేకంగా రెండు నెలల పాటు సుదీర్ఘ పోరాటం జరిపింది. డిసెంబర్‌ 2001 డిసెంబర్‌ నాటికి తాలిబన్ల పాలనను అంతం చేసి విజయం సాధించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన హమీద్‌ కర్జాయ్‌.. అహ్మద్‌ షా మసూద్‌ను నేషనల్‌ హీరో (మరణానంతరం) ప్రకటించటంతో పాటు ఆయన మరణం రోజును సెలవు దినంగా నిర్ణయించారు.

తాలిబన్లకు సవాళ్లు ఇక్కడి నుంచే..!

ప్రస్తుతం పంజ్‌షిర్‌ ప్రాంతమే రాజకీయ వ్యూహాలకు కేంద్రబిందువుగా మారుతోంది. అఫ్గాన్‌ జాతీయ ప్రతిఘటనకు వేదికగా నిలుస్తోంది. ఈ ప్రాంతానికి చెందిన అహ్మద్‌ షా మసూద్‌ తనయుడు అహ్మద్‌ మసూద్‌, ఇప్పటి వరకు అఫ్గన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్న అమ్రుల్లా సలేహ్‌, బిస్మిల్లాఖాన్‌ మొహమ్మది తదితర కీలక నేతలు తాలిబన్ల దురాక్రమణను సవాల్‌ చేస్తున్నారు. ఆ దిశగా వారు సన్నాహాలు జరుపుతుండటం చర్చనీయాంశంగామారింది. తాలిబన్లు కాబుల్‌ను కైవసం చేసుకున్న మరుక్షణమే ఆ దేశ అధ్యక్షుడిగా ఉన్న అష్రఫ్‌ ఘనీ ప్రాణభయంతో భారీగా డబ్బుతో యూఏఈకి పారిపోయి తలదాచుకోగా.. ఆ దేశ తొలి ఉపాధ్యక్షుడిగా ఉన్న అమ్రుల్లా సలేహ్‌ మాత్రం తాలిబన్లకు తలవంచేది లేదని ధైర్యంగా ప్రకటించారు.

ప్రస్తుతం దేశం లోపలే ఉన్నానని, ఆపద్ధర్మ దేశ అధ్యక్షుడిని కూడా తానేనని ప్రకటించుకున్నారు. మరోవైపు, అహ్మద్‌ మసూద్‌ కూడా తన తండ్రి మార్గంలోనే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. తాలిబన్‌ ఫైటర్లపై పోరాటానికి పశ్చిమ దేశాల మద్దతును కోరుతున్నారు.

ఇవీ చదవండి:

'మేడపై శబ్దం ఏంటా అని వెళితే.. ఆ ఇద్దరూ వీరేనని తెలిసింది!'

ఎటు చూసినా తుపాకులే... కాబుల్​లో ప్రస్తుత పరిస్థితి ఇలా...

Last Updated : Aug 20, 2021, 11:59 AM IST

ABOUT THE AUTHOR

...view details