కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు పలు దేశాలు ఇప్పటికే ప్రజలకు టీకా ఇవ్వడం ప్రారంభించాయి. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా-కొవిషీల్డ్, భారత్ బయోటెక్-కొవాగ్జిన్ టీకాల అత్యవసర వినియోగానికి ఇటీవలే భారత్ అనుమతించింది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ త్వరలో మొదలుకానుంది. అయితేే భారత్ సహా అన్నీ దేశాలకు వ్యాక్సిన్ను అత్యంత వేగంగా పంపిణీ చేయడం అతిపెద్ద సవాల్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థలోని కీలక భారత శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 45 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో, మరో 156 టీకాలు ప్రీ క్లినికల్ దశలో ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ ముఖ్య శాస్త్రవేత్తలు డా.సౌమ్య స్వామినాథన్, సలహాదారు డా.హంసధ్వాని కుగనాంథమ్ వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరా, కరోనా చికిత్స కోసం డబ్ల్యూహెచ్ఓ ఏర్పాటు చేసిన కోవాక్స్ ద్వారా 2021 చివరి నాటికి 200 కోట్ల టీకాలను అన్ని దేశాలకు అందించనున్నట్లు డబ్ల్యూహెచ్ఓ శాస్త్రవేత్తలు మనోరమ ఇయర్ బుక్ ఆర్టికల్లో తెలిపారు. పేద, ధనిక తారతమ్యం లేకుండా అన్ని దేశాల ప్రజలకు టీకా అందించడం కోసం సెపి, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహాకారంతో కోవాక్స్ను ఏర్పాటు చేశారు.