ప్రపంచంలోనే తొలుత సూర్యోదయాన్ని చూసే న్యూజిలాండ్‌లోని హామిల్టన్‌లో అదో మధ్యతరగతి కుటుంబం. ఆ కుటుంబానికి పెద్ద రోజ్ ఆర్డెర్న్. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నతోద్యోగి. అతని భార్య లారెల్. వీరికి లూయీస్ ఆర్డెర్న్, జసిండా ఆర్డెర్న్‌లు సంతానం. మగపిల్లలు లేని ఆ కుటుంబంలో జసిండా టామ్ బాయ్‌లా పెరిగింది. ఫామ్ హౌస్‌లోని ఆపిల్ తోట నిర్వహణలో చురుగ్గా పాల్గొనడం సహా వారాంతాల్లో ట్రాక్టర్ నడపడం నేర్చుకుని పనుల్లో తండ్రికి సాయపడేది.
ఆమె ప్రభావం వల్లే..
అలా పెరిగిన జసిండాపై మేనత్త మేరీ ఆర్డర్న్ ప్రభావం ఎంతో ఉంది. ఆమె లేబర్ పార్టీ కార్యకర్త. అందుకేనేమో 'నువ్వేమవుతావు' అని జసిండాను టీచర్ అడిగితే 'పొలిటీషియన్' అని ఠక్కున బదులిచ్చిందట. ఆ సమాధానానికి ఆశ్చర్యపోవడం టీచర్ వంతైంది. 'అలాంటి సబ్జెక్టుకు సంబంధించి చేయడానికి ప్రాజెక్టులేం ఉండవుగా' అని టీచర్ అనడం వల్ల.. 'ఎందుకు లేదూ... ఎంపీ మారలిన్ వారిన్‌ను ఇంటర్వ్యూ చేసి ప్రాజెక్టు చేస్తా. ఆమె హేతువాది, స్త్రీవాది, రచయిత్రి, మానవహక్కుల కార్యకర్త, పర్యావరణ ఉద్యమకారిణి...' అని గడగడా చెప్పేస్తుంటే టీచర్‌కే ముచ్చటేసిందట. ఎనిమిదేళ్ల వయసులో జసిండా అలా మాట్లాడటమే కాదు మారలిన్ అపాయింట్‌మెంట్ కూడా తీసుకుని ఇంటర్వ్యూ చేసి ప్రాజెక్టును చకచకా పూర్తి చేసేసింది.
మారలిన్ స్ఫూర్తితో..
కళ్లెదుట తప్పు జరిగితే అగ్ని కణికలా భగభగ మండిపోయే జసిండా.. మారలిన్ స్ఫూర్తితో మానవహక్కుల సంఘంలో సభ్యురాలై చుట్టుపక్కల జరిగే అన్యాయాలను కమిషన్ దృష్టికి తీసుకెళుతూ అందరి చేతా శభాష్ అనిపించుకునేది. మరోవైపు చేపల చిరుతిళ్లు అమ్మే 'ఫిష్ అండ్ చిప్' అనే చెయిన్ రెస్టరెంట్‌లో గ్రాడ్యుయేషన్ అయ్యేవరకూ సేల్స్‌గాళ్‌గా పని చేసింది. కాలేజీలో కూడా విద్యార్థి నాయకురాలిగా ఉండి వారి సమస్యల్ని పరిష్కరించడంలో ముందుండేది.
నవతరం నాయకి...
టీనేజీ అంటే ఎవరికైనా ఓ స్వీట్ నథింగ్. సరదాలూ, సంతోషాలకూ ఓ కేరాఫ్ అడ్రస్. అయితే జసిండా మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. అలాంటి వాటికి ఎప్పుడూ దూరంగా ఉంటూనే పదిహేడేళ్ల వయసులోనే లేబర్‌పార్టీలో చేరి హుందాతనాన్ని ఆభరణంగా చేసుకున్నారు. మేనత్తతో కలిసి పార్టీ ప్రచారాలకు వెళ్లి లేబర్‌పార్టీ తరపున గళం విప్పేది. అంత చిన్న వయసులోనే ఓ పార్టీలో క్రియాశీల వ్యక్తిగా మారడానికి కారణం పెద్దపెద్ద పదవుల్ని ఆశించడమో, హోదా పేరూ వంటివి కోరుకోవడమో కాదు. సమాజానికి తనవంతుగా ఏదైనా చేయాలనే సంకల్పమే జసిండాను రాజకీయాల దిశగా మళ్లించింది. అందుకే వైకాటో యూనివర్సిటీలో పీజీ అయ్యాక న్యూయార్క్ వెళ్లి అక్కడ నిరుపేదలకూ, ఇళ్లులేని వారికి 'సూప్ కిచెన్' పేరుతో అన్నదానం చేసే కేంద్రాల్లో వాలంటీరుగా చేశారు.
28 ఏళ్లకే ఎంపీ..
కొన్నాళ్లకి అక్కడి నుంచి తిరిగొచ్చి రాజకీయాల్లో ఉంటూనే ఓ కార్పొరేట్ సంస్థలో చేరారు. కొంత కాలం పనిచేశాక తన 28వ ఏట అంటే- 2008లో మౌంట్ ఆల్బర్త్ నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పట్నుంచీ 2017లో ప్రధాని అయ్యేవరకూ ఆ విజయ పరంపరను కొనసాగించారామె. చాలా తక్కువ కాలంలోనే ప్రజల మనసు గెలుచుకున్న జసిండా గాడి తప్పిన లేబర్ పార్టీ భవిష్యత్తుని మార్చగలరని నమ్మి అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని ఆమెకు అవకాశం ఇచ్చారు మాజీ అధ్యక్షుడు.
దేవుణ్నే కాదనుకుని...
ఒక బిడ్డకు తల్లయిన జసిండా అవివాహితురాలు. ప్రధాని పీఠమెక్కిన ఐదునెలల తరవాత ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టారు. 2012లో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన క్లార్క్ గేఫోర్డ్‌తో ఆమె కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారు. మోడల్‌గా, ఓ ప్రముఖ ఛానల్‌లో టీవీ ప్రజెంటర్‌గా పనిచేస్తోన్న క్లార్క్‌తో గతేడాదే జసిండాకు నిశ్చితార్థం అయింది. చాలా సింపుల్‌గా ఉండటానికి ఇష్టపడే జసిండా ప్రధాని అయ్యే వరకూ ఓ చిన్న అపార్ట్‌మెంట్‌లో ఉండేవారు. సెలెబ్రిటీ స్టేటస్ కూడా నచ్చదు. ఈ మధ్య ఓ హోటల్‌కి వెళితే అక్కడ ఖాళీలేనందున దాదాపు అరగంటపైనే బయట ఎదురు చూసి ఖాళీ అయ్యాకనే లోపలికి వెళ్లి భోంచేసి వచ్చారు.
ప్రసవం రోజూ ఆఫీస్‌కు..
ఆర్యోగం విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా ఉండే జసిండా డెలివరీ రోజున కూడా ఆఫీసుకు వెళ్లారు. నొప్పులు మొదలవడం వల్ల ఆసుపత్రిలో చేరి ఓ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. తన బిడ్డకు పాలు పట్టాలనే ఉద్దేశంతో ఆరునెలల మాతృత్వపు సెలవు తీసుకుని ఆఫీసుకు దూరంగా ఉన్నా విధులకు మాత్రం దగ్గరగానే ఉన్నారు. నెల్సన్‌మండేలా శాంతి సమావేశంలో భాగంగా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి సమావేశానికి మూడు నెలల కూతుర్ని కూడా తీసుకెళ్లారు. అలా పసిపాపతో కలిసి ఓ మహిళా దేశాధినేత ఐక్యరాజ్యసమితి అసెంబ్లీ హాల్‌లోకి అడుగుపెట్టడం అదే తొలిసారి. ఆ సందర్భంగా దేశవిదేశాల నుంచీ హాజరైన సభ్యులంతా మరోసారి మహిళా శక్తికి తలవంచి వందనం చేశారు. అలానే జసిండా గురించి మరో విషయం చెప్పుకోవాలి. గే హక్కులను నిరాకరించే తన మతాన్ని విడిచిపెట్టేశారు.