కరోనా: దక్షిణ కొరియాకూ చైనా దుస్థితే! దక్షిణ కొరియాపై ప్రాణాంతక కరోనా వైరస్ పంజా విసురుతోంది. వైరస్‌కు కేంద్రబిందువైన చైనాలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంటే... దక్షిణ కొరియాలో మాత్రం అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మహమ్మారి తీవ్రతను అత్యధిక ప్రమాదకర స్థాయిగా ప్రకటించారు ఆ దేశాధ్యక్షుడు మూన్ జే ఇన్.
దక్షిణ కొరియాలో ఒక్క ఆదివారమే 123 కేసులు నమోదయ్యాయి. దీని వల్ల వైరస్ సోకిన వారి సంఖ్య 556కు చేరింది. ఇప్పటి వరకు మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
సభలకు, ప్రార్థనలకు వెళ్లకూడదని కొరియా ప్రజలకు అక్కడి ప్రభుత్వం సూచించింది.
ఇటలీ, ఇరాన్...
ఇటలీ, ఇరాన్లో వైరస్‌పై ఆందోళనలు తారస్థాయికి చేరాయి. మహమ్మారిపై పోరాటానికి చైనా తరహాలో ఆయా దేశాలు చర్యలు చేపడుతున్నాయి.
వైరస్‌కు కేంద్రబిందువైన వుహాన్ నగరాన్ని చైనా మూసివేసింది. అదే విధంగా ఉత్తర ఇటలీలో డజనుకుపైగా పట్టణాల్లోని ప్రజలను ఇళ్లకే పరిమితమవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఆయా ప్రాంతాల్లో 50వేలకుపైగా జనాభా నివాసముంటోంది.
కరోనా వల్ల ఇటలీలో శుక్రవారం ఒకరు మరణించారు. ఐరోపావ్యాప్తంగా ఇది తొలి మరణం.
ఇరాన్లో ప్రాణాంతక వైరస్ వల్ల ఇప్పటి వరకు ఐదుగురు మృతిచెందారు. ఆసియా, పశ్చిమాసియా తర్వాత మృతుల సంఖ్య ఇరాన్‌లోనే అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. 14 రాష్ట్రాల్లోని పాఠశాలలు, వర్శిటీలు, సాంస్కృతిక కేంద్రాలను మూసివేశారు. జాతీయ స్థాయి వేడుకలను నిలిపివేశారు.
ఆఫ్రికా...
ఓవైపు కరోనాపై పోరాడటానికి ప్రపంచ దేశాలు ముమ్మర చర్యలు చేపడుతుంటే... ఆఫ్రికా మాత్రం చతికిలపడింది. వైరస్‌ను ఎదుర్కొనడానికి ఆఫ్రికా చేపట్టిన చర్యలు పేలవంగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) మండిపడింది.
జపాన్ నౌక...
జపాన్ డైమండ్ ప్రిన్సెస్ నౌకలో.. క్షుణ్నంగా పరీక్షలు జరిపిన అనంతరం విడుదలై నివాసానికి వెళ్లిన ఓ మహిళలకు వైరస్ సోకింది. నిర్బంధ కాలం పూర్తయి ఇంటికి చేరుకున్న తర్వాత వైరస్ సోకినట్టు తేలడం.. నౌకలో జరుగుతున్న పరీక్షలపై అనుమానాలు రేకెతిస్తున్నాయి.
ఇదీ చూడండి:-జపాన్ నౌకలో మరో నలుగురు భారతీయులకు కరోనా