మాస్కులు నిత్యజీవితంలో భాగమై పోయాయి. ఇప్పుడంతా మాస్కులు(masks) లేకుండా స్వేచ్ఛగా తిరిగే రోజుల కోసం వేచిచూస్తున్నారు. కానీ, మహమ్మారి (pandemic) అంతమయ్యే వరకు మాస్కులు లేకుంటే ప్రమాదం పక్కనున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, అత్యధిక మందికి టీకాలు అందజేసిన అమెరికా(america)లో మాత్రం పరిస్థితులు కాస్త మెరుగయ్యాయి. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు మాస్కులు లేకుండానే తిరిగేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతించింది. ఇదే జాబితాలో చేరేందుకు తాజాగా దక్షిణ కొరియా(korea) సైతం ఊవ్విళ్లూరుతోంది.
కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నా.. జులై నుంచి మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని దక్షిణ కొరియా ప్రధాని కిమ్ బూ క్యుమ్ ప్రకటించారు. అక్టోబర్ నాటికి 70 శాతం మందికి టీకాలు అందుతాయని.. అప్పటి నుంచి క్వారంటైన్ నిబంధనల్ని సైతం సవరిస్తామని వెల్లడించారు. 60-74 ఏళ్ల మధ్య వయసు వారిలో 60 శాతం మంది ఇప్పటికే వ్యాక్సిన్ల(vaccine) కోసం రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు.