అమెరికా, దక్షిణ కొరియా.. ఈ రెండు దేశాల్లోనూ ఒకే రోజున(జనవరి 21) కొవిడ్-19 కేసులు బయటపడ్డాయి. దాదాపు 3 నెలల తర్వాత అగ్రరాజ్యంలో మొత్తం కేసులు 7 లక్షల పైమాటే. ద.కొరియాలో కేవలం 10,635 కేసులే నమోదయ్యాయి. అమెరికాలో 37 వేల మందికి పైగా చనిపోతే దక్షిణ కొరియా మరణాలను 230కే పరిమితం చేయగలిగింది.. ఇక్కడ కేసుల సంఖ్య ఈనెల 3న 10 వేలు దాటగా.. గత రెండు వారాల్లో నమోదైన కొత్త కేసులు 573 మాత్రమే. అంటే సగటున రోజుకు నమోదవుతున్న కొత్త కేసులు 41 లోపే. ఇంతలా కరోనా మహమ్మారి కొమ్ములు వంచడంలో సఫలీకృతమైన ఈ దేశం పోరాడుతున్న తీరు ఆదర్శనీయం.
ఒక్క నెలలో ఎంత మార్పు
నెల రోజుల క్రితం(మార్చి 17 నాటికి) దక్షిణ కొరియాలో 8 వేలకు పైగా కేసులు.. ప్రపంచంలో ఆరో స్థానం. ఇటలీ, ఇరాన్, చైనా, స్పెయిన్, జర్మనీ తప్ప మరే దేశంలోనూ దక్షిణ కొరియాలో నమోదైనన్ని కేసుల్లేవు. అప్పటికి అమెరికాలో 6,346 కేసులే నమోదయ్యాయి. సరిగ్గా నెల రోజుల తర్వాత(అంటే ఏప్రిల్ 17 నాటికి) - ద.కొరియాలో 2,315 కేసులే పెరిగాయి. ఈ దేశం 23వ స్థానానికి తగ్గింది. మొత్తం 7,829 మంది రోగులు కోలుకున్నారు. అగ్రరాజ్యంలో మాత్రం ఏకంగా 7 లక్షల కేసులు పెరిగాయి. కరోనాను దక్షిణ కొరియా ఎంతగా కట్టడి చేస్తోందో ఈ గణాంకాలే చెబుతున్నాయి.
నాలుగు 'టీ'లు
వేగంగా స్పందించడం దక్షిణ కొరియా విజయాల్లో ఒకటి. ఇక్కడి ప్రభుత్వం 4 'టీ'లతో ముందుకెళుతోంది. అవి.. ముందుగానే పరీక్షలు జరపడం(టెస్టింగ్), సరైన దిశ(ట్రాకింగ్), కేసులు గుర్తించడం(ట్రేసింగ్), చికిత్సలు అందించడం(ట్రీటింగ్). జనవరి 27 నాటికి కేసుల సంఖ్య 4కి చేరగా.. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం త్వరితగతిన టెస్ట్‌కిట్లను తయారు చేయడానికి 20 కంపెనీలను రంగంలోకి దించింది. దాదాపు 3 వారాల్లోనే 46,127 మందికి పరీక్షలు నిర్వహించారు. అప్పటికి అమెరికాలో కేవలం 426 మందికే పరీక్షలు జరపడం గమనార్హం. అగ్రరాజ్యంలో అప్పటికి 68 కేసులే ఉండగా దక్షిణ కొరియాలో 3,150 కేసులు బయటపడ్డాయి.
కొవిడ్ పరీక్షలు కీలకం..
దాదాపు 5.16 కోట్ల జనాభా ఉన్న దక్షిణ కొరియాలో ఇంతవరకు 5.46 లక్షల మందికి పైగా పరీక్షలు చేశారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 633 కేంద్రాలను తెరిచారు. రోజుకు 20,000 మందికి పరీక్షలు జరిపేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 6 గంటల్లోనే ఫలితాలు వచ్చేస్తాయి. ఇక్కడ పరీక్షలు చేయించుకోవడం ఎంత సులువంటే - దేశ రాజధాని సియోల్‌లోని ఓ వ్యక్తి తనకు కొద్దిగా జ్వరంగా అనిపిస్తే వెంటనే ఇంటి నుంచి బయల్దేరి పరీక్షలు జరిపే కేంద్రానికి వెళ్లి, నమూనాలను ఇచ్చి తిరిగి 2 గంటల్లోనే ఇంటికి చేరుకోవచ్చు.
సరిహద్దుల నియంత్రణ
కొత్త కేసుల్లో సగం విదేశాల నుంచి వచ్చినవాళ్లే ఉంటున్నట్లు గుర్తించిన ప్రభుత్వం.. ఇలా వచ్చిన వారందరికీ పరీక్షలు, క్వారంటైన్ తప్పనిసరి చేసింది. వారంతా ప్రభుత్వ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీనిద్వారా వారు ఎక్కడకు వెళ్లినా తెలిసిపోతుంది. విదేశాల నుంచి వచ్చినవారు కొరియన్లు అయినా, వారికి నెగెటివ్ వచ్చినా సరే 2వారాలపాటు స్వీయ ఏకాంతంలో ఉండాల్సిందే. ఉల్లంఘిస్తే వెంటనే యాప్ ద్వారా తెలిసిపోతుంది.