South Korea covid cases: దక్షిణ కొరియాలో ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కేసులు ఊహించనిస్థాయిలో నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 6,21,328 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఒక్క రోజులోనే కేసుల సంఖ్య ఏకంగా 55శాతం పెరిగినట్లు.. కొరియా వ్యాధి నియంత్రణ, నివారణ సంస్థ కేడీసీఏ వెల్లడించింది. దీంతో దేశంలో.. మొత్తం కేసుల సంఖ్య 82లక్షలకు చేరింది.
ఈ ఏడాది జనవరి చివరివారంలో దక్షిణ కొరియాలో తొలిసారి ఐదంకెల కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి వైరస్ ఉద్ధృతి క్రమంగా పెరుగుతూనే ఉంది. మార్చి 9న తొలిసారిగా కేసుల సంఖ్య 3లక్షల మార్కు దాటగా వారం రోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది. ఇదే సమయంలో మరణాలు కూడా భారీగానే నమోదవుతున్నాయి. తాజాగా 429 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఒక్క రోజులో ఈ స్థాయిలో మరణాలు నమోదవ్వడం ఇదే తొలిసారని కేడీసీఏ అధికారులు తెలిపారు.
కరోనా టెస్ట్‌లు చేస్తున్న వైద్య సిబ్బంది టెస్టుల కోసం క్యూ కట్టిన ప్రజలు దక్షిణ కొరియాలో కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో పాటు.. దేశంలో కరోనా ఆంక్షల సడలింపే కారణం. వైరస్ ఉద్ధృతి పెరుగుతున్నా కొరియాలో మరోసారి కఠిన ఆంక్షలు విధించే అవకాశాలు కన్పించడం లేదు. మరోవైపు ఉన్న వాటిని మరింత సడలించాలని కొరియా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి బృందాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని ఆంక్షలను ఎత్తివేసే అంశంపై ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కొవిడ్ విజృంభణను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని.. దక్షిణ కొరియా ప్రధాని కిమ్ బూ క్యుమ్.. వైద్య అధికారులను ఆదేశించారు.
కరోనా టెస్ట్ చేయించుకుంటున్న దక్షిణ కొరియా వాసి ప్రస్తుతం దక్షిణ కొరియాలో రాత్రి 11 గంటల తర్వాత బిజినెస్ కర్ఫ్యూ అమలులో ఉంది. దీంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో ప్రైవేటు కార్యక్రమాల్లో ఆరుగురు కంటే ఎక్కువ మంది పాల్గొనకూడదనే ఆంక్షలు అమల్లో ఉన్నాయి. వీటిని కూడా సడలిస్తే పరిస్థితి మరింత దారణంగా తయారయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి:భారీగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. ఎక్కడంటే?