తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా పంజా - ఆ దేశాల్లో మళ్లీ ఆంక్షలు - ఇరాక్​లో కొవిడ్​ కేసులు

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. యూఏఈ రాజధాని అబుదాబిలో రాత్రి లాక్​డౌన్​ విధించారు. దక్షిణ కొరియాలో నైట్​క్లబ్స్​, చర్చిలు మూసివేశారు. జనసంచారంపై ఆంక్షలు విధించారు. మరోవైపు.. ఇరాక్​లోని ఆసుపత్రిలో అగ్నిప్రమాదం తర్వాత కరోనా సంక్షోభం మరింత తీవ్రమైనట్లు అక్కడి వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Corona delta variant
కరోనా డెల్టా వేరియంట్​

By

Published : Jul 16, 2021, 8:45 PM IST

ప్రపంచంపై కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. డెల్టా వేరియంట్​ వ్యాప్తి అధికంగా ఉండటం వల్ల పలు దేశాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. డెల్టా విజృంభణతో ఇరాక్​లో మూడో దశ ముప్పు అధికంగా ఉంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రోగులతో ఆసుపత్రులు నిండిపోయాయి. బాధితుల్లో చాలా మంది యువతే ఉండటం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది.

ఆసుపత్రుల్లో పడకలు లేవు, ఔషధాల కొరత, వార్డులు అగ్ని ప్రమాదాలకు నెలవుగా మారాయని ఓ వైద్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఔషధాలు, ఆక్సిజన్​ సిలిండర్లు విరాళంగా అందించాలని ఆన్​లైన్​ ద్వారా డాక్టర్లు అర్థిస్తున్న తీరు కన్నీరు పెట్టిస్తోంది. ఇటీవల ఓ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగి 80 మందికిపైగా మరణించిన ఘటనతో.. కొవిడ్​ సంక్షోభం మరింత తీవ్రమైనట్లు వైద్యులు తెలిపారు. ఐసోలేషన్​ వార్డుల్లో పని చేసేందుకు వైద్యులు భయపడుతున్నారు. గత బుధవారం ఒక్కరోజే.. 9,600 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కరోజు కేసుల్లో ఇదే అత్యధికం కావటం గమనార్హం. ఇప్పటి వరకు 17,600 మంది ప్రాణాలు కోల్పోయారు.

యూఏఈలో రాత్రి లాక్​డౌన్​

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​ రాజధాని అబుదాబిలో రాత్రి లాక్​డౌన్​ విధించింది అక్కడి ప్రభుత్వం. సోమవారం నుంచి ప్రతి రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కొనసాగనుంది. ఈద్​ అల్​-ఆదా సెలవులు ప్రారంభమవుతున్న క్రమంలో లాక్​డౌన్​ విధించటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు.. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎలాంటి ఆంక్షలు లేవు.

దక్షిణ కొరియాలో కఠిన ఆంక్షలు..

కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ కొరియా రాజధాని సియోల్​తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ కఠిన ఆంక్షలు విధిస్తోంది అక్కడి ప్రభుత్వం. సాయంత్రం 6 గంటల తర్వాత నలుగురికి మించి తిరగకుండా ఆంక్షలు విధించాలని స్థానికి ప్రభుత్వాలను ఆదేశించారు ప్రధాని క్యూమ్​. నైట్​క్లబ్స్​, చర్చిలను మూసివేశారు. ఆసుపత్రులు, నర్సింగ్​ హోమ్​లను సందర్శించటాన్ని నిషేధించారు.

ఇదీ చూడండి:డెల్టా ముప్పు- మళ్లీ కర్ఫ్యూ దిశగా ఆ దేశం!

ABOUT THE AUTHOR

...view details