తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనాకు సాంకేతిక కళ్లెం వేయడంలో.. ఆ దేశాలు విజయం! - How to control the Covid-19

విశ్వవ్యాప్త మానవాళిని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని కట్టడిచేయడంలో సాంకేతిక పరిజ్ఞానం పైచేయి సాధించింది. ఈ విషయంలో దక్షిణ కొరియా, తైవావ్​, చైనాలు సఫలమయ్యాయి. వైరస్​ సోకిన బాధితులు ఎవరెక్కడ తిరుగుతున్నారో ఓ వెబ్​సైట్​ ద్వారా పసిగడుతూ.. కరోనా అధికంగా కనిపించినచోట్లకు వెళ్లకుండా ప్రజలు జాగ్రత్త పడుతున్నారు. ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ కూర్చోవడానికి బదులు ఏయే ప్రాంతాలతో, వ్యక్తులతో సామాజికంగా ఎడం పాటించాలో తెలుసుకుని మసలుకొంటున్నారు. వైద్య చికిత్స యంత్రాంగం చప్పున రంగంలోకి దిగడానికి ఈ సమాచారం తోడ్పడుతోంది.

SK, Taiwan, China countries are won to control Corona virus with technology
కరోనాకు సాంకేతిక కళ్లెం వేయడంలో.. ఆ దేశాలు విజయం!

By

Published : Mar 23, 2020, 9:48 AM IST

కృత్రిమ మేధ, స్మార్ట్‌ఫోన్‌, బిగ్‌ డేటాలను ఉపయోగించి కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో దక్షిణ కొరియా, తైవాన్‌, చైనాలు విజయం సాధించాయి. ఈ దేశాల అనుభవం నుంచి మిగతా ప్రపంచం నేర్చుకోవలసింది ఎంతో ఉంది. మొదట్లో చైనా తరవాత ఎక్కువ కరోనా కేసులు దక్షిణ కొరియాలో నమోదైనా, అక్కడ మరణాల నమోదు చాలాచాలా తక్కువ. చైనాకు అతి సమీపంలోని తైవాన్‌లోనైతే ఇంకా తక్కువ. దక్షిణ కొరియాలో కరోనా రోగులు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకొంటున్నవారి సంఖ్య, బాధితులు నివసించిన సంచరించిన ప్రాంతాలు, వారి లింగ వయో వర్గాలు, మరణాల సంఖ్య వంటి వివరాలను ప్రతిరోజూ బిగ్‌ డేటా సాయంతో ప్రకటిస్తున్నారు. బాధితులు ఒక్కొక్కరికి ఒక్కో సంఖ్య ఇచ్చి వారి పేర్లు, వ్యక్తిగత వివరాలను మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు.

ఎవరెక్కడ తిరిగినా ఇట్టే పసిగట్టే వెబ్​సైట్​..

దక్షిణ కొరియా వెల్లడిస్తున్న సమాచారం మచ్చుకు ఇలా ఉంటుంది. ‘102వ నంబరు రోగి, ఆమె స్నేహితురాలు ఫలానా తేదీన ఫలానా థియేటర్‌లో కె1, కె2 సీట్లలో కూర్చుని సినిమా చూశారు. థియేటర్‌కు ఫలానా నంబరు ట్యాక్సీలో ఫలానా మార్గంలో వచ్చారు. 151వ నంబరు రోగి ఫలానా తేదీ రాత్రి ఎనిమిది గంటలకు ఒక రెస్టారెంట్‌లో భోజనం చేశారు. 587వ నంబరు రోగి లోకల్‌ రైలు ఎక్కి విందుకు వెళ్లారు. అక్కడ 20మందితో కాలక్షేపం చేశారు.’ రోగులు ఏయే థియేటర్లు, రెస్టారెంట్లు, సమావేశ స్థలాలకు, బంధుమిత్రుల ఇళ్లకు ఎప్పుడెప్పుడు వెళ్లారో తెలిపే వెబ్‌సైట్‌ ఒకటి రంగంలో ఉంది. ప్రభుత్వమిచ్చే సమాచారంతో అది నడుస్తోంది. దీని సాయంతో కరోనా అధికంగా కనిపించినచోట్లకు వెళ్లకుండా ప్రజలు జాగ్రత్త పడుతున్నారు. ట్విటర్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ సందేశాలను, సెల్‌ ఫోన్‌ కాల్‌డేటా, జీపీఎస్‌ సమాచారాలతో యాప్‌లు రూపొందించి, వాటి సాయంతో వ్యాధి విస్తరించిన ప్రాంతాలను, రోగుల కదలికలను గుర్తిస్తున్నారు. దీనివల్ల ప్రజలు బయట ఏం జరుగుతోందో తెలుసుకోగలుగుతున్నారు. ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ కూర్చోవడానికి బదులు ఏయే ప్రాంతాలతో, వ్యక్తులతో సామాజికంగా ఎడం పాటించాలో తెలుసుకుని మసలుకొంటున్నారు. వైద్య చికిత్స యంత్రాంగం చప్పున రంగంలోకి దిగడానికి ఈ సమాచారం తోడ్పడుతోంది.

స్ఫూర్తిదాయక చర్యలు..

చైనాలో కరోనా కేసులు బయటపడిన వెంటనే తైవాన్‌ జాతీయ ఆరోగ్య నియంత్రణ కేంద్రాన్ని ఏర్పరచింది. విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో రాకపోకలపై నియంత్రణ విధించి, బిగ్‌ డేటాతో కరోనా బారినపడినవారిని గుర్తించసాగారు. తప్పుడు వార్తల ప్రచారాన్ని కట్టడి చేస్తూ, పాఠశాలలు, వ్యాపారాలకు నియంత్రణలు విధించారు. జాతీయ ఆరోగ్య బీమా, వలస, కస్టమ్స్‌, వ్యక్తుల ఆస్పత్రి సందర్శనలు, రోగ లక్షణాలు, విమాన టికెట్ల క్యూఆర్‌ కోడ్‌, విమాన ప్రయాణ మార్గాలు తదితర సమాచారాలను మేళవించి డేటా బేస్‌ రూపొందించారు. ‘కృత్రిమ మేధ అల్గొరిథమ్స్‌’ ఉపయోగించి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. దీనివల్ల వైద్యులు తమ వద్దకు వచ్చే రోగుల ప్రయాణ సమాచారాన్ని తెలుసుకుని తక్షణం తగు చర్యలు తీసుకోవడం సులువైంది. బిగ్‌ డేటా సాయంతో ఫలానా వ్యక్తి ఆరోగ్యంగానే ఉన్నాడని నిర్ధారించే సంక్షిప్త సందేశాన్ని సరిహద్దు అధికారులకు పంపడం వీలైంది. ఈ సందేశం ఒక పాస్‌గా ఉపయోగపడుతోంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రోగలక్షణాలున్న వ్యక్తులను క్వారంటైన్‌ చేయడానికి, వారి కదలికలను పసిగట్టడానికి వారి మొబైల్‌ ఫోన్లను ట్రాక్‌ చేశారు. జాతీయ ఆరోగ్య కమాండ్‌ ముఖమాస్క్‌ల ఉత్పత్తిని పెంచి, వాటిని నిర్దిష్టమైన ధరకే అమ్మేట్లు చూసింది. ఏ ఫార్మసీలో ఎన్నెన్ని మాస్క్‌లు ఉన్నాయో తెలిపే మ్యాప్‌ను అంతర్జాలం ద్వారా అందించింది.

స్మార్ట్​ఫోన్​ల సాయంతో..

చైనాలో కరోనా బారిన పడినవారి కదలికలను వారి స్మార్ట్‌ఫోన్ల సాయంతో ఎప్పటికప్పుడు పసిగట్టి ఇతర ప్రాంతాలకు వ్యాధి పాకకుండా జాగ్రత్త పడ్డారు. ఇందుకు కృత్రిమ మేధ అల్గొరిథమ్స్‌ తోడ్పడ్డాయి. దేశంలో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌ అయిన చైనా మొబైల్‌ సంస్థ డేటా బేస్‌ సాయంతో రోగులు ఏ రైలు ఎక్కిందీ, ఏ సూపర్‌ మార్కెట్‌కు వెళ్లిందీ కనిపెట్టగలిగారు. అలీబాబా, బైదు, హువావై వంటి భారీ కంపెనీలతోపాటు అనేక టెక్‌ అంకుర సంస్థలు కరోనాపై హోరాహోరీ పోరాటం సాగిస్తున్నాయి. సాంకేతికత సాయంతో వైద్యులు, ఆస్పత్రులు, పరిశోధకులు, ప్రభుత్వ యంత్రాంగం చేయీచేయీ కలిపి ముందుకుసాగుతున్నారు. కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించి కరోనా వైరస్‌ జాడను సెకన్లలో కనిపెట్టే రోగ నిర్ధారణ సంవిధానాన్ని అలీబాబా రూపొందించింది. అది వైరస్‌ వ్యాప్తిని 96 శాతం కచ్చితంగా కనిపెడుతోంది. కరోనా పరీక్షల భారం మితిమీరి మీద పడటంతో సతమతమవుతున్న ఆస్పత్రులు, లేబరేటరీలు, వైద్యులకు అలీబాబా సంవిధానం ఎంతో ఉపయోగకరంగా ఉంది.

ముందుగా హెచ్చరించిన కెనడా..

కరోనా వ్యాధి విరుచుకుపడనుందని అందరికన్నా ముందుగా హెచ్చరించిన సంస్థ కెనడాకు చెందిన బ్లూ డాట్‌. ఆ సంస్థ రూపొందించిన ఏఐ సిస్టమ్‌ ప్రతిరోజూ 65 భాషల్లో ప్రచురితమయ్యే లక్ష బ్లాగులు, వార్తలు, వ్యాసాలను జల్లెడ పడుతుంది. 2003లో మానవులతో చెలగాటమాడిన సార్స్‌ వ్యాధిని పోలిన న్యుమోనియా వంటిది చైనాలోని వుహాన్‌లో విరుచుకుపడనుందని గతేడాది డిసెంబరు 31నే హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్నా తొమ్మిది రోజుల ముందే ఈ హెచ్చరిక వెలువడటం విశేషం. వుహాన్‌లో 27మంది న్యూమోనియాతో బాధపడుతున్నారని, దానికి కారణం కచ్చితంగా తెలియదు కాని, వారందరూ వుహాన్‌ మాంసం మార్కెట్‌కు వెళ్లివచ్చినవారేనని చైనా భాష మాండరిన్‌లో వెలువడిన వ్యాసాన్ని బ్లూడాట్‌ సిస్టమ్‌ పసిగట్టి అధికారులను ముందే హెచ్చరించింది. బ్లూడాట్‌లోని 40 మంది ఉద్యోగుల్లో వైద్యులు, పశువైద్యులు, అంటు వ్యాధి నిపుణులు, డేటా సైంటిస్టులు, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లు ఉన్నారు. వీరంతా న్యాచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ (ఎన్‌ఎల్‌పీ), మెషీన్‌ లెర్నింగ్‌లను ఉపయోగించి 65 భాషల్లో వెలువడే వార్తలు, వ్యాసాలను అల్గొరిథమ్‌ల సాయంతో విశ్లేషిస్తారు. 150 వ్యాధులకు సంబంధించిన ముందస్తు సంకేతాలు ఉంటే తక్షణం అప్రమత్తమవుతారు. 2016లో బ్రెజిల్‌ నుంచి జికా వైరస్‌ అమెరికాకు వస్తుందని కూడా హెచ్చరించిన ఘనత బ్లూడాట్‌దే.

‘యాప్‌’లతో ఆరా..

చైనాలో 80 శాతం లావాదేవీలు అలీ పే, వియ్‌ చాట్‌ వంటి చరవాణి యాప్‌ల ద్వారా నగదు రహితంగా నడుస్తున్నాయి. వీటి సాయంతో ఖాతాదారుల కదలికలు, లావాదావీలపై నిఘా వేస్తూ, వారు రోగ ప్రమాద మండలాలకు వెళ్లినదీ లేనిదీ వెంటనే పసిగడుతూ, తగు చర్యలు తీసుకుంటున్నారు. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం విస్తృత పౌర నిఘాకు కెమేరాలను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ముఖ గుర్తింపు కెమేరాలకు వ్యక్తుల దేహ ఉష్ణోగ్రతలను పసిగట్టే థర్మల్‌ సెన్సర్లను జోడిస్తున్నారు. ఈ కెమేరాలకు సాఫ్ట్‌వేర్‌ను ‘సెన్స్‌ టైమ్‌’ సంస్థ అందిస్తోంది. సిచువాన్‌ రాష్ట్రంలో పోలీసులు, అధికారులకు థర్మల్‌ సెన్సర్లను అమర్చిన స్మార్ట్‌ హెల్మెట్లను అందించారు. ఇలాంటి అధునాతన పరికరాలను, బిగ్‌ డేటా, ఏఐలను ఉపయోగించి చైనా ప్రభుత్వం హెల్త్‌కోడ్‌ అనే విస్తృత నిఘా వ్యవస్థను నిర్మించింది. ప్రతి వ్యక్తి ప్రయాణాల చరిత్ర, వైరస్‌ వ్యాపించిన ప్రాంతాల్లో అతడు ఎంత కాలం గడిపింది, కరోనా బాధితులతో సంపర్కం వంటి వివరాలను చప్పున తెలుసుకోవడానికి హెల్త్‌ కోడ్‌ తోడ్పడుతోంది. తాము బహిరంగంగా తిరగవచ్చా లేక క్వారంటైన్‌కు వెళ్లక తప్పదా అన్నది ప్రజలు తమంతటతాము తెలుసుకోవడానికి అలీపే, వియ్‌ చాట్‌ యాప్‌లు తోడ్పడుతున్నాయి. వాటిలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ కోడ్‌లు ఏర్పరచారు. పౌరులు తాము ఏ రంగు కోడ్‌ కిందకు వచ్చేదీ తెలుసుకుని క్వారంటైన్‌లో చేరాలా వద్దా అన్నది తామే తేల్చుకోవచ్చు.

వియ్​చాట్​ ద్వారా..

టెన్సెంట్‌ సంస్థకు చెందిన వియ్‌ చాట్‌ ద్వారా ప్రజలకు ఆరోగ్య సమాచారాన్నీ అందిస్తున్నారు. పర్యాటక, ప్రయాణ రంగంలో చాట్‌ బాట్‌లను ఉపయోగిస్తూ ప్రయాణికులకు ఏయే ప్రయాణాలు కొనసాగుతున్నాయో, ఏవి నిలిచిపోయాయో తెలుపుతున్నారు. హువావై, టెన్సెంట్‌, డిడి సంస్థలకు చెందిన సూపర్‌ కంప్యూటర్లు కరోనా వ్యాక్సిన్‌ తయారీలో పరిశోధకులకు చేదోడు వాదోడుగా ఉన్నాయి. హాంకాంగ్‌ నుంచి ఇజ్రాయెల్‌ వరకు, అక్కడి నుంచి అమెరికా వరకు అనేక దేశాల్లో కరోనా నిరోధక వ్యాక్సిన్‌ తయారీకి కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ ప్రయోగాలు విజయవంతమైనా, ప్రజలకు వ్యాక్సిన్‌ అందడానికి ఎంత లేదన్నా సంవత్సర కాలం పడుతుంది. ఈలోగా ఇజ్రాయెల్‌ నుంచి కొన్ని శుభ శకునాలు వెలువడుతున్నాయి. ఆ దేశంలో మిగల్‌ అనే సంస్థ కోళ్లకు వచ్చే శ్వాసకోశ వ్యాధికి వ్యాక్సిన్‌ తయారీకి నాలుగేళ్లుగా ప్రయోగాలు జరుపుతోంది. వాటికి ఒక తరహా కరోనా వైరస్‌ను ప్రాతిపదికగా తీసుకుంది. సదరు నమూనా వైరస్‌ డీఎన్‌ఏ, కొవిడ్‌ 19 జన్యుక్రమాన్ని పోలి ఉంది. తమ ప్రయోగాలు ఫలిస్తే మూడు నెలల్లోనే కొత్త వ్యాక్సిన్‌ను మార్కెట్‌కు విడుదల చేయగలమని ఆ సంస్థ ప్రకటించింది. ఆ శుభ సమయం కోసం ప్రపంచమంతా ఆత్రంగా ఎదురుచూస్తోంది.

డ్రోన్ల ద్వారా మందుల చేరవేత..

డ్రోన్ల ద్వారా మందుల చేరవేత..

కరోనా నిర్ధారణకు చైనా ఆస్పత్రులు రోజుకు కనీసం 1,000 సీటీ ఇమేజింగ్‌ పరీక్షలు చేయవలసి వస్తోంది. ఇది వైద్యులు, ల్యాబ్‌ సిబ్బంది తలకు మించిన భారమే. ఈ పరీక్షల ఫలితాలను శీఘ్రంగా వెలువరించడానికి చైనీస్‌ కంపెనీ ఇన్ఫర్‌ విజన్‌ కంపెనీ ఏఐ సొల్యూషన్స్‌ తోడ్పడుతోంది. ఆరోగ్య బీమా చెల్లింపులను వేగంగా పరిష్కరించే ‘బ్లాక్‌ చైన్‌’ వేదికను అలీబాబా గ్రూపునకు చెందిన ‘యాంట్‌ ఫైనాన్షియల్స్‌’ అందిస్తోంది. దీనివల్ల ఆస్పత్రి సిబ్బందికి, రోగులు వారి బంధువులకు మధ్య ముఖాముఖి సంప్రతింపుల సమయం బాగా తగ్గిపోయి, కరోనా వ్యాప్తిని అరికట్టడం వీలవుతోంది. రోబోలకు వైరస్‌ సోకదు కాబట్టి వాటిని ఉపయోగించి భవనాలను శుభ్రపరచి, బ్యాక్టీరియా నాశకాలను చల్లుతున్నారు. చైనా కంపెనీ ‘పుడు టెక్నాలజీ’ తయారుచేసిన ఈ రోబోలు ఆహారం, మందులనూ రోగులకు అందిస్తున్నాయి. టెర్రా కంపెనీ డ్రోన్లు కరోనా రోగ పరీక్ష నమూనాలు, క్వారంటైన్‌ సామగ్రిని చేరవేస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువమంది జనం గుమికూడకుండా, క్వారంటైన్‌ నియమాలను ఎవరూ ఉల్లంఘించకుండా నిఘా వేస్తున్నాయి.

- వర ప్రసాద్‌, రచయిత

ఇదీ చదవండి:ఒక్కరి కోసం అందరు- అందరి కోసం అందరూ!

ABOUT THE AUTHOR

...view details