తెలంగాణ

telangana

By

Published : Apr 26, 2020, 9:07 AM IST

ETV Bharat / international

భారత్​ పొరుగు దేశాల్లోనూ కరోనా పొగే

ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా మహమ్మారి ఆసియా దేశాలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. భారత్​ పొరుగున ఉన్న దేశాల పరిస్థితీ అగమ్యగోచరంగా ఉంది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో వైరస్ తీవ్రంగా మారుతోంది. నేపాల్‌, మయన్మార్‌ల పరిస్థితిలను దయానీయంగా మారింది. పరీక్షలు నిర్వహించడానికి కూడా డబ్బులు లేక నేపాల్ సతమతమవుతోంది. శ్రీలంక, భూటాన్‌ మాత్రం కరోనాను కట్టడి చేయడంలో కాస్త ముందున్నాయి. సత్వరమే స్పందించి తగిన చర్యలు తీసుకోవడం వల్ల వైరస్​ను సమర్థవంతంగా నియంత్రించగలుగుతున్నాయి.

corona
భారత్​ పొరుగు దేశాల్లోనూ కరోనా పొగే

కరోనాను కట్టడి చేయడానికి భారతదేశం నెల రోజులుగా లాక్‌డౌన్‌ను అమలుచేస్తోంది. కరోనా పుట్టుకకు కేంద్రమైన మన పొరుగుదేశం చైనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడంలో చాలావరకు సఫలీకృతమైంది. మరి ఇతర పొరుగుదేశాలైన పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, నేపాల్‌, భూటాన్‌, మయన్మార్‌లు ఏం చేస్తున్నాయి? అక్కడ కొవిడ్‌ ప్రభావం ఎలా ఉంది? ప్రభుత్వాల నిర్ణయాలు ఎలా ఉన్నాయి? ప్రజలు ఎలాంటి కష్టాల్ని ఎదుర్కొంటున్నారు? అసలే వెనుకబడిన ఈ దేశాల్లో ఆర్థిక పరిస్థితి ఏమిటి? వైద్యపరమైన జాగ్రత్తలేమిటి? అనేవి ఆసక్తికర విషయాలు.

భారత్​ పొరుగు దేశాల్లోనూ కరోనా పొగే

అఫ్గానిస్థాన్‌

పీడిస్తున్న మౌలిక సదుపాయాల కొరత

తాలిబన్‌ పీడిత దేశమైన అఫ్గానిస్థాన్‌ సైతం కరోనాతో విలవిల్లాడుతోంది. ఇప్పటికే పేదరికం, మౌలిక సదుపాయాల కొరత వేధిస్తుండగా.. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి చేపట్టిన లాక్‌డౌన్‌, ఇతర చర్యలతో దేశ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. వేలాది స్వయం ఉపాధి యూనిట్లు మూతపడ్డాయి. లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం... చైనా, పాకిస్థాన్‌, ఇరాన్‌, ఉజ్బెకిస్థాన్‌, భారత్‌లపై పూర్తిగా ఆధారపడింది. పాకిస్థాన్‌, ఇరాన్‌ల నుంచి తిరిగొస్తున్న లక్షల మంది అఫ్గన్‌లతో కొత్త సమస్యలు మొదలయ్యాయి. ఇరాన్‌ నుంచి వచ్చిన వారితో దేశంలో ఫిబ్రవరి 24న మొదటి కేసు నమోదవగా.. మార్చి 22న తొలి మరణం సంభవించింది. క్వారంటైన్‌ నుంచి వైరస్‌ బాధితులు పారిపోతుండటం, మహమ్మారి వ్యాప్తి పెరుగుతుండటంతో దేశంలోని ప్రావిన్సులు మార్చి 24 నుంచి ఒక్కొక్కటిగా లాక్‌డౌన్‌లు ప్రకటించడం ప్రారంభించాయి. తాలిబన్‌ గ్రూపులు సైతం లాక్‌డౌన్‌కు సహకరిస్తున్నాయి.

పాకిస్థాన్‌

గుప్త వాహకులతో సామాజిక వ్యాప్తి

దేశ జనాభాలో 25% మంది పేదరికంలోనే మగ్గుతున్న పాకిస్థాన్‌పై కరోనా పిడుగు ప్రభావం ఊహించనంతగా పడింది. లాక్‌డౌన్‌ కారణంగా ఇక్కడ ఏకంగా 1.87 కోట్ల మంది ఉపాధి కోల్పోతారని అంచనా. ఇరాన్‌ వెళ్లొచ్చిన ఇద్దరు విద్యార్థులకు వైరస్‌ సోకినట్లు ఫిబ్రవరి 26న తొలిసారి గుర్తించారు. మార్చి 30న మొదటి మరణం నమోదైంది. లాహోర్‌లో మార్చి 10-12 తేదీల మధ్య నిర్వహించిన తబ్లిగీ జమాత్‌... సూపర్‌ స్ప్రెడర్లను తయారు చేసింది. ప్రభుత్వం వారించినా వినకుండా 40 దేశాల ప్రతినిధులు, స్థానికులూ కలిపి మొత్తం లక్ష మందిపైగా దీనికి హాజరయ్యారు. దీంతో వైరస్‌ విరివిగా వ్యాపించింది. కేసులు పెరగడంతో అధికారులు 20 వేల మంది తబ్లిగీలను క్వారంటైన్‌ చేశారు. మార్చి 15 నుంచే రాష్ట్రాలు ఒక్కొక్కటిగా లాక్‌డౌన్‌లు ప్రకటించాయి. అయినా... మొత్తం కేసుల్లో 79% సామాజిక వ్యాప్తి కారణంగా నమోదవుతుండటంతో ఆంక్షల్ని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 30 వరకు పొడిగించింది. ఇప్పుడిప్పుడే ఆంక్షల్ని కొద్దిగా సడలిస్తున్నారు.

దేశంలోని దాదాపు 8 కోట్ల మంది పేదలకు రూ.11 వేల వంతున ఉచితంగా అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయినా లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఇంకోవైపు వైరస్‌ వ్యాప్తి జరుగుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నా..రంజాన్‌ ప్రార్థనలకు మసీదులను తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పరీక్షల్లో వేగం లేకపోవడంతోనే కేసులు భారీగా బయటపడటం లేదని, గుప్తవాహకులతో ప్రమాదం పొంచి ఉందనే హెచ్చరికలు ఉన్నాయి. అధికారులు 1.18 లక్షల పడకలను సిద్ధంచేశారు.

నేపాల్‌

పరీక్షలకూ పైసలు లేవు

జనవరి 23న వుహాన్‌ నుంచి నేపాల్‌కు తిరిగొచ్చిన యువకుడిలో కరోనా లక్షణాలు కనిపించాయి. అతన్ని పరీక్షించడానికి కిట్లు అందుబాటులో లేవు. ఒక పరీక్షకు నేపాలీ కరెన్సీలో రూ.17 వేలు ఖర్చు అవుతాయి. దాంతో నమూనాలను సింగపుర్‌ పంపించారు. అది పాజిటివ్‌గా తేలడంతో అతన్ని క్వారంటైన్‌ చేశారు. 9రోజులు కాగానే ఇంట్లోనే ఉండాలని సూచిస్తూ వదిలేశారు. క్రమంగా కేసులు పెరుగుతుండటంతో తొలిదశలో 100 పరీక్షలు చేయడానికి సరిపడా కిట్లు కొన్నారు. ఇది నేపాల్‌ దయనీయ పరిస్థితికి అద్దం పట్టే ఉదాహరణ. భారత్‌, చైనాలతో సరిహద్దును పంచుకుంటున్న నేపాల్‌ కరోనా విజృంభణతో కుదేలైంది. ఈ దేశ ప్రధాన ఆదాయ వనరు పర్యాటక రంగమే. ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించడానికి, దేశంలోని ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి విదేశీ పర్యటకులు నిత్యం తరలివస్తుంటారు. కరోనా కారణంగా పర్యటక వీసాలను నేపాల్‌ రద్దుచేసింది. భారత్‌, చైనా సరిహద్దులనూ మూసేసింది. మార్చి 24 నుంచి లాక్‌డౌన్‌ అమలులో ఉంది. ఫలితంగా లక్షల మంది ఉపాధి ప్రమాదంలో పడ్డాయి. పర్వతారోహకులు పనిలేకుండా ఉన్నారు. అత్యవసర మందులనూ భారత ప్రభుత్వమే సరఫరా చేస్తోంది.

భూటాన్‌

సత్వర స్పందనతో ఊరట

భూటాన్‌లో తొలి కరోనా కేసు మార్చిన 6న నమోదైంది. అమెరికాకు చెందిన 79 ఏళ్ల పర్యాటకుడికి కరోనా సోకినట్లు తేలడంతో ఆయన భార్యతోపాటు మరో 70 మందిని ఐసోలేట్‌ చేశారు. అదేనెల 13న అమెరికన్‌ తన దేశానికి వెళ్లిపోగా అతని భార్య, డ్రైవర్‌ భూటాన్‌లోనే ఉండిపోయారు. భారత్‌లోనూ వైరస్‌ వ్యాప్తి తెలుసుకున్న దేశ రాజు మొత్తం సరిహద్దును మూసేశారు. వివిధ రకాల వస్తువుల దిగుమతులనూ నిషేధించారు. భారత్‌, మాల్దీవులు, శ్రీలంకల్లో చదువుకుంటున్న, ఉద్యోగాలు చేస్తున్న తమ వారిని వెనక్కి తీసుకొచ్చి దేశ రాజధాని థింపూలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. వారికి బాగైన తర్వాతే ఇంటికి పంపించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది.

బంగ్లాదేశ్‌

కడు పేదరికం.. ఆపై రొహింగ్యాల భారం

బంగ్లాదేశ్‌ జనాభా 16 కోట్లు అయితే.. ఇక్కడ అందుబాటులో ఉన్న ఐసీయూ పడకలు 1,169. అంటే ప్రతి లక్ష మందికి ఒక బెడ్‌ కంటే తక్కువన్న మాట! నెలాఖరుకు మరో 150 పెంచనున్నారు. 1,155% పెరుగుదల రేటుతో కరోనా వైరస్‌ దేశంలో అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతోంది. ఇది ఆసియాలోనే అత్యధిక రేటు. మార్చి 8న తొలి కొవిడ్‌ కేసు, 18న తొలి మరణం నమోదయ్యాయి. ప్రభుత్వం మార్చి నుంచే లాక్‌డౌన్‌ అమలు చేస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలక ఆధారమైన వస్త్ర పరిశ్రమను ఆంక్షల నుంచి మినహాయించింది. ఇప్పటివరకు 50 వేల లోపే పరీక్షలు చేశారని, మరణాలను తక్కువచేసి చూపుతున్నారనే ఆరోపణలున్నాయి. మరోవైపు 10 లక్షల మంది రొహింగ్యా శరణార్థుల శిబిరాలు కరోనా సూపర్‌ స్ప్రెడర్లుగా మారతాయనే ఆందోళన మొదలైంది.

మయన్మార్‌

పరిస్థితి గుంభనం

ఒకవైపు చైనా, మరోవైపు థాయిలాండ్‌లలో కరోనా కేసులు లెక్కకు మిక్కిలిగా ఉన్నా... మయన్మార్‌లో మాత్రం తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కావాలనే పరీక్షలు చేయడంలేదని, కేసుల సంఖ్యనూ తక్కువగా చూపుతోందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే... ప్రభుత్వం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. తమ ప్రజల జీవన విధానమే కరోనా నుంచి కాపాడుతోందని, తాము కరచాలనం, కౌగిలింతలు చేయమని, కరెన్సీ నోట్లకు నాలుకతో తడి అంటించమని గుర్తుచేసింది. మయన్మార్‌లో తొలి కేసు మార్చి 23న నమోదవడంతో స్థానిక ప్రభుత్వం అక్కడ లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. మిగతా ప్రాంతాల్లో ప్రజలు భౌతిక దూరం పాటించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

శ్రీలంక

మేలు కోరి... మేల్కొని!

ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో ప్రపంచానికి శ్రీలంక చేసి చూపింది. తమ ప్రజల హితం కోరి... వెంటనే మేల్కొనడంతో దేశానికి మేలు జరిగింది. తొలుత వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న దేశాల్లో 16వ ర్యాంకు పొందిన శ్రీలంక... తాజాగా కరోనాను సమర్థంగా కట్టడి చేస్తున్న జాబితాలో 9వ స్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనం. డబ్ల్యూహెచ్‌ అప్రమత్తం చేయగానే విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. జనవరి 27న చైనా నుంచి వచ్చిన మహిళకు కరోనా లక్షణాలు బయటపడటంతో క్వారంటైన్‌కు పంపించింది. వుహాన్‌లోని తమ దేశానికి చెందిన విద్యార్థులను తీసుకొచ్చి, క్వారంటైన్‌ చేసిన తర్వాతే ఇంటికి పంపించింది. ఇటలీ పర్యాటకుల నుంచి శ్రీలంకలో టూరిస్టు గైడుకు మార్చి 10న వైరస్‌ సోకడంతో తొలి కేసు నమోదైంది. అదేనెల 14 నుంచి కర్ఫ్యూ, లాక్‌డౌన్‌లను అమలుచేస్తోంది.

ఇదీ చదవండి:దేశంలో 25 వేలకు చేరువైన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details