భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన పరిష్కారానికి మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని చైనా ఉద్ఘాటించింది. విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునే సరిహద్దు-సమాచార వ్యవస్థ, సామర్థ్యం ఇరుదేశాలకు ఉందని స్పష్టం చేసింది.
సరిహద్దుపై చైనా స్థానం స్థిరంగా, నిలకడగా ఉందని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఝావో లీజియన్ పేర్కొన్నారు. నేతల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాలను ఇరు దేశాలు అమలు చేశాయని తెలిపారు. సరిహద్దు అంశమై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జరిపిన ఫోన్ సంభాషణ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఝావో.
"భారత్-చైనా సరిహద్దు వెంబడి పరిస్థితులు నిలకడగా, నియంత్రణలోనే ఉన్నాయి. సమస్యను పరిష్కరించుకునే సామర్థ్యం ఇరు దేశాలకు ఉంది. చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటాం. మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు."