భారత సంతతికి చెందిన మలేసియా వాసి నాగేంద్రన్ ధర్మలింగానికి మాదక ద్రవ్యాల రవాణా కేసులో సింగపూర్ కోర్టు మరణశిక్ష విధించింది. బుధవారం మరణదండన అమలు కావాల్సి ఉంది. ఇదే సమయంలో తన మానసిక స్థితి బాగా లేనందున మరణశిక్ష నిలిపివేయాలంటూ అతని తరఫు న్యాయవాదులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు వేశారు. వాటిని తోసిపుచ్చిన న్యాయస్థానం అప్పీలుకు వెళ్లేందుకు ఒకరోజు అనుమతి ఇచ్చింది. మంగళవారం మలేసియా హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో నాగేంద్రన్‌కు కొవిడ్-19 నిర్ధారణ అయినట్లు జైలు అధికారులు తెలపటంతో బుధవారం అమలు చేయాల్సిన ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.
ముద్దాయికి కొవిడ్-19 నిర్ధారణ కావడాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు మరణశిక్ష గడియలు దగ్గరపడిన సమయంలో ఇది నిజంగా ఊహించని పరిణామమని అభిప్రాయపడింది. ముద్దాయికి కరోనా సోకినట్లయితే మరణశిక్ష అమలు చేయలేమని ఇలాంటి సమయాల్లో మానవత్వాన్ని ప్రదర్శించాల్సిన అవసరముందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆండ్రూ ఫాంగ్ పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యేవరకు మరణశిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కేసు విచారణను వాయిదావేశారు. దీంతో నాగేంద్రన్‌కు మరికొన్ని రోజులు ఊరట లభించింది.