సింగపూర్ వైరస్‌తో మూడో దశ కరోనా ముప్పు పొంచి ఉందంటూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను సింగపూర్ తోసిపుచ్చింది. ఈ వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. సింగపూర్ వైరస్ అన్నదే లేదని స్పష్టం చేసింది.
ఇటీవల కాలంలో కరోనా కేసుల్లో బయటపడిన రకం బి.1.617.2 అని తెలిపింది. అది భారత్‌లోనే పుట్టిందని సింగపూర్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
సింగపూర్‌లో బడులు బంద్!
భారత్‌లో కనిపించిన కొవిడ్ లక్షణాలు తమ దేశంలోనూ కనిపించటం వల్ల.. బుధవారం నుంచి బడుల్ని మూసివేయాలని సింగపూర్ నిర్ణయించింది.
"మా దేశంలోని కొవిడ్ కేసుల్లో కనిపిస్తున్న కొత్త వైరస్ రకాలు.. పిల్లలను దెబ్బతీసేలా ఉన్నాయి. అందుకే ఈ నెల 28 దాకా బడులు మూసేస్తున్నాం. పాఠాలు ఆన్లైన్లో సాగుతాయి."
-సింగపూర్ ఆరోగ్య శాఖ
సింగపూర్‌లో తాజాగా 38 కేసులు వెలుగుచూశాయి. గత 8 నెలల్లో ఇదే అత్యధిక సంఖ్యగా చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది పిల్లలే. అయితే ఎవరికీ పరిస్థితి విషమించలేదు. కొవిడ్ ఆరంభం నుంచి సింగపూర్‌లో 61 వేల పాజిటివ్ కేసులు(51లక్షల జనాభా) నమోదు కాగా.. 31 మంది మరణించారు. మరోవైపు తైవాన్ కూడా తమ రాజధాని తైపేలో విస్తరిస్తున్న కొవిడ్‌ను కట్టడి చేయడానికి పాఠశాలను మూసివేయాలని నిర్ణయించింది.
ఇదీ చూడండి:పిల్లలకు కొవాగ్జిన్ 2,3 దశ ట్రయల్స్ ఎప్పుడంటే?