మద్యం సేవించి వాహనాలను నడిపేవారిని గుర్తించడానికి పోలీసులు శ్వాస పరీక్ష నిర్వహిస్తుంటారు. అదేరీతిలో ఒక్క నిమిషంలోనే కొవిడ్-19ను గుర్తించే ఓ వినూత్న సాధనాన్ని సింగపూర్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది ఒక వ్యక్తి శ్వాసను విశ్లేషించి, కరోనా ఆనవాళ్లను పట్టేస్తుంది. ఈ పరీక్షకు సింగపూర్ ప్రభుత్వం సోమవారం తాత్కాలిక అనుమతి మంజూరు చేసింది.
బ్రీతోనిక్స్..
ఈ సాధనాన్ని అభివృద్ధి చేసిన బృందంలో భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ టి.వెంకీ వెంకటేశన్ కూడా ఉన్నారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్(ఎన్‌యూఎస్)కు అనుబంధంగా ఏర్పడ్డ 'బ్రీతోనిక్స్' అనే అంకుర సంస్థ ఈ సాధనాన్ని రూపొందించింది. వెంకటేశన్‌తో కలిసి ఎన్‌యూఎస్ గ్రాడ్యుయేట్లు జియా ఝునాన్, డు ఫాంగ్, వేన్ వీలు దీన్ని ఏర్పాటు చేశారు.
బ్రెఫెన్స్ గో కొవిడ్-19 టెస్ట్
ఈ శ్వాస పరీక్ష సాధనానికి బ్రెఫెన్స్ గో కొవిడ్-19 టెస్ట్ అని పేరు పెట్టారు. దీన్ని ప్రస్తుతం సింగపూర్‌లో ఒక చెక్‌పోస్టు వద్ద ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. కొవిడ్ నిర్ధారణకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష ఫలితం రావడానికి దాదాపు అర గంట పడుతుంది. దీన్ని క్షేత్రస్థాయిలోనే నిర్వహించొచ్చు. ప్రామాణిక పరీక్షగా గుర్తింపుపొందిన పీసీఆర్ ద్వారా ఫలితాన్ని రాబట్టడానికి కొన్ని గంటలు పడుతుంది. పైగా దీన్ని అక్కడికక్కడ విశ్లేషించడం కుదరదు. శాంపిళ్లను ల్యాబ్‌లకు తరలించాల్సి ఉంటుంది. సింగపూర్ పరిశోధకులు అభివృద్ధి చేసిన బ్రీత్ ఎనలైజర్ వల్ల ఈ ఇబ్బందులు దూరమవుతాయి.
ఎలా పనిచేస్తుంది?
ఇందులో.. ఒక్కసారి వాడిపారేసే మౌత్ పీస్‌లోకి శ్వాసను వదలాల్సి ఉంటుంది. మౌత్ పీస్‌కు అత్యంత కచ్చితత్వంతో కూడిన బ్రెత్ శాంపిలర్ సంధానమై ఉంటుంది. ఇందులోకి వచ్చిన శ్వాస నమూనా ఆ తర్వాత మాస్ స్పెక్ట్రోమీటర్‌లోకి వెళుతుంది. ఆ సాధనం. శ్వాసలోని వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (వీవోసీ)ను విశ్లేషిస్తుంది. వాటి ఆధారంగా నిమిషం కన్నా తక్కువ సమయంలోనే ఫలితాన్ని అందిస్తుంది. ప్రస్తుతం ఈ సాధనం ద్వారా కొవిడ్ పాజిటివ్‌గా తేలిన వ్యక్తికి పీసీఆర్ పరీక్ష కూడా చేసి, ఇన్‌ఫెక్షన్‌ను నిర్ధారిస్తున్నారు.
ఈ శ్వాస పరీక్ష కోసం ముక్కు, గొంతులోకి ఎలాంటి సాధనాలను పంపాల్సిన అవసరంలేదని, అందువల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని బ్రీతోనిక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియా చెప్పారు.
ఇదీ చదవండి :వృద్ధుడిని కొమ్ములతో గుద్ది చంపిన ఎద్దు