తెలంగాణ

telangana

ETV Bharat / international

Amrullah Saleh: నన్ను కాల్చి చంపండి.. కానీ తాలిబన్లకు తలొగ్గేదే లేదు! - అమ్రుల్లా సలేహ్‌ వార్తలు

తాలిబన్లకు లొంగిపోయే ప్రసక్తి లేదని అఫ్గాన్‌ తాత్కాలిక అధ్యక్షుడు, పంజ్‌షేర్‌లో తిరుగుబాటు దళాలకు సారథ్యం వహిస్తున్న అమ్రుల్లా సలేహ్‌ పేర్కొన్నారు. ఈ పోరాటంలో గాయపడి ప్రాణాలతో ఉంటే తనను కాల్చి చంపాలని సైనికాధికారికి సూచించినట్లు చెప్పుకొచ్చారు.

amrullah saleh
అమ్రుల్లా సలేహ్‌

By

Published : Sep 6, 2021, 5:09 AM IST

Updated : Sep 6, 2021, 9:59 AM IST

తాలిబన్లతో జరుగుతున్న పోరాటంలో గాయపడి ప్రాణాలతో ఉంటే తనను కాల్చి చంపాలని సైనికాధికారికి సూచించినట్లు అఫ్గాన్‌ తాత్కాలిక అధ్యక్షుడు, పంజ్‌షేర్‌లో తిరుగుబాటు దళాలకు సారథ్యం వహిస్తున్న అమ్రుల్లా సలేహ్‌ పేర్కొన్నారు. పోరాటంలో అమరుడినైనా అవుతానని.. కానీ తాలిబన్లకు లొంగిపోయే ప్రసక్తి లేదని ఆయన తెలిపారు. కాబుల్‌ తాలిబన్ల వశం ఎలా అయ్యిందో పేర్కొంటూ అమ్రుల్లా సలేహ్‌ పలు అంశాలను వెల్లడించారు.

'కాబుల్‌లో ప్రభుత్వ పతనానికి ముందు రోజు రాత్రి పోలీస్‌ చీఫ్‌ నాకు ఫోన్‌ చేసి జైల్లో తాలిబన్‌ ఖైదీలు తిరుగుబాటు చేస్తున్నారని, పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. దీంతో తాలిబన్‌ వ్యతిరేక ఖైదీలతో నేను ఓ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేశాను. వారిని సమావేశపరిచి తిరుగుబాటును అణచివేయాలని ఆదేశించాను. అయితే ఆగస్టు 15 ఉదయం రక్షణ మంత్రి, హోంమంత్రికి ఫోన్ చేసినా వారు స్పందించలేదు. చివరకు రాష్ట్రపతి భవన్‌ను సంప్రదించినా కూడా ఫలితం లేకుండాపోయింది. నగరంలో ఎక్కడా కూడా అఫ్గాన్‌ పోలీసు దళాలు కనిపించలేదు. దీంతో నేను పోలీసు చీఫ్‌కు ఫోన్ చేశా. కాగా అప్పటికే కాబుల్‌లోని పలు ప్రాంతాలను తాలిబన్లు ఆక్రమించుకున్నారు. కాబుల్‌లోకి తాలిబన్లు మరింతగా చొచ్చుకురాకుండా ఉండేందుకు కమాండోలను పంపించాలని పోలీసు చీఫ్‌ నా సహాయం కోరాడు. అయితే నేను అతనికి సహాయం చేయలేకపోయాను. ఆ సమయంలో పోలీసు దళాలు అందుబాటులో లేవు. దీంతో అతడు చర్యలు చేపట్టాలని జాతీయ భద్రతా సలహాదారును సంప్రదించినా ఎలాంటి స్పందన రాలేదు. ఈక్రమంలో ఆగస్టు 15వ తేదీన ఉదయం 9 గంటల ప్రాంతంలో కాబుల్‌ భయంతో వణికిపోయింది' అని అమ్రుల్లా వివరించారు.

ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకపోవడంతోనే తాను పంజ్‌షేర్‌ నాయకుడు అహ్మద్‌ మసూద్‌ను సంప్రదించినట్లు అమ్రుల్లా తెలిపారు. 'ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడంతో నా గురువు, అహ్మద్‌ షా మసూద్‌ తనయుడు అహ్మద్‌ మసూద్‌కు సమాచారం అందించా. ఎక్కడున్నావని అడిగితే కాబుల్‌లోనే ఉన్నానని చెప్పాడు. దీంతో నేనూ నీతో కలిసి వస్తా' అని ఆయనతో చెప్పినట్లు సలేహ్‌ తెలిపారు.

కాబుల్‌ను విడిచి వెళ్లేముందు తన ఇంటికి వెళ్లి తన భార్య, పిల్లల ఫొటోలు కనిపించకుండా చేసి.. సైనికాధికారితో కలిసి పంజ్‌షేర్‌కు పయనమైనట్లు ఆయన వివరించారు. తన కంప్యూటర్‌తోపాటు మరికొంత సామగ్రితో పంజ్‌షేర్‌కు బయలుదేరినట్లు తెలిపారు. కలిసి పోరాటం చేద్దామని ఆ సైనికాధికారితో చెప్పానని.. ఒకవేళ ఈ పోరాటంలో తాను గాయపడితే ఏ మాత్రం ఆలోచించకుండా తన తలలో రెండుసార్లు తుపాకీతో కాల్చి చంపాలని ఆయనకు సూచించినట్లు అమ్రుల్లా తెలిపారు.

ఇదీ చూడండి:Taliban Panjshir: తాలిబన్లపై షేర్​ 'పంజా'- 700 మంది హతం!

Last Updated : Sep 6, 2021, 9:59 AM IST

ABOUT THE AUTHOR

...view details