పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ విషయంలో కీలక ప్రకటన చేసింది ఆ దేశ ప్రభుత్వం. చికిత్సకోసం లండన్ వెళ్లిన షరీఫ్ కోర్టుకు ఎలాంటి ఆధారాలు సమర్పించనందున ఆయన పరారీలో ఉన్నట్లు పేర్కొంది.
పనామా పత్రాల కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న షరీఫ్ చికిత్స కోసం బెయిల్‌పై లండన్ వెళ్లారు. ఈ క్రమంలో చికిత్సకు సంబంధించిన వైద్య నివేదికను సమర్పించాలని లాహోర్ కోర్టు ఆదేశించగా.. గడువులోగా షరీఫ్ సమర్పించలేదు. దీన్ని తీవ్రంగా పరిగణించిన పాక్ సర్కారు షరీఫ్ పారిపోయినట్లు ప్రకటించింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన జరిగిన ఫెడరల్ కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేసు నుంచి తప్పించుకునేందుకే..
షరీఫ్ కేసు నుంచి తప్పించుకునేందుకే లండన్ వెళ్లారని, చికిత్స కోసమే వెళ్లుంటే ఇప్పటికే వైద్య నివేదికను న్యాయస్థానానికి సమర్పించేవారని అభిప్రాయపడిన ప్రభుత్వం ఆయన్ను 'అబ్స్కాండర్'గా ప్రకటించింది. అంతేకాకుండా అతనికి మంజూరు చేసిన బెయిల్ కూడా పొడిగించకూడదని నిర్ణయించింది. ప్రస్తుతం అతను దేశానికి తిరిగి రానట్లయితే నేరస్థుడిగా ప్రకటిస్తామని హెచ్చరించింది.
షరీఫ్ వైద్యుడు ఏమన్నాడంటే..
నవాజ్ షరీఫ్ గుండెపోటుతో పాటు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారని, ఆయన రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య గణనీయంగా పడిపోతోందని షరీఫ్ వైద్యుడు తెలిపారు. త్వరలో షరీఫ్‌కు ఓ శస్త్రచికిత్స జరగనున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి:కరోనా: చైనాలో 2,715కు చేరిన మృతుల సంఖ్య