తాలిబన్ ఆక్రమిత అఫ్గానిస్థాన్‌లో(Afghan News) పరిస్థితులు రోజురోజుకు మరింత ఆందోళకరంగా మారుతున్నాయి. అమెరికా దళాల ఉపసంహరణకు గడువు దగ్గరపడుతున్న క్రమంలో సోమవారం .. కాబుల్ విమానాశ్రయం(Kabul airport blast) సమీప ప్రాంతంలో రాకెట్ దాడులు జరగడం కలకలం సృష్టించింది. అయితే.. ఈ క్షిపణులను ఎవరు ప్రయోగించరాన్నది ఇంకా తెలియరాలేదు.
కాబుల్‌కు సమీపంలోని సలీమ్ కార్వాన్ ప్రాంతంపై సోమవారం ఉదయం ఈ రాకెట్ దాడులు జరిగాయని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. మూడు సార్లు పేలుడు శబ్దాలు వినిపించాయని.. ఆ వెంటనే ఆకాశంలో ఈ రాకెట్లు కనిపించాయని చెప్పారు. ఈ పరిణామంతో ప్రజలంతా భయంతో పరుగురు తీశారని వెల్లడించారు.
ఈ రాకెట్ దాడుల కారణంగా అమెరికా తరలింపు ప్రక్రియకు కాసేపు ఆటంకం ఎదురైంది. దీనిపై ఆ దేశం వెంటనే స్పందించలేదు. ఈ రాకెట్ దాడుల గురించి, అధ్యక్షుడు జో బైడెన్‌కు అధికారులు తెలియజేశారని శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేసింది. బలగాల తరలింపు కోసం మోహరింపును పెంచాలని బైడెన్ సూచించారని చెప్పింది. రాకెట్ దాడుల తర్వాత తిరిగి యథావిధిగా తరలింపు ప్రక్రియను అమెరికా కొనసాగించినట్లు పేర్కొంది.