తెలంగాణ

telangana

ETV Bharat / international

పాకిస్థాన్‌లో భారీ భూకంపం- 26 మంది మృతి - పాకిస్థాన్‌లో భారీ భూకంపం

పాకిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) తో పాటు పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి.  భూకంపం ధాటికి 26 మంది మృతి చెందగా.. 300 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో చిన్నారులు, మహిళలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

పాకిస్థాన్‌లో భారీ భూకంపం- 26 మంది మృతి

By

Published : Sep 25, 2019, 5:16 AM IST

Updated : Oct 1, 2019, 10:23 PM IST

పాకిస్థాన్‌లో భారీ భూకంపం

రిక్టర్‌ స్కేల్‌పై 5.8 తీవ్రతతో సంభవించిన భూకంపానికి పాకిస్థాన్​లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికిపైగా గాయాలయ్యాయి. లాహోర్‌, రావల్పిండి, పెషావర్‌, ఇస్లామాబాద్‌ నగరాలతో పాటు సియోల్‌కోట్‌, సర్గోదా, మన్‌సెహ్రా, చిత్రాల్‌, మాల్‌కండ్‌, ముల్తాన్‌, షంగ్లా, బజౌర్‌ ప్రాంతాల్లో భూమి కంపించింది.

తీవ్ర భయాందోళన...

భూ ప్రకంపనల సమయంలో ఇళ్లు, కార్యాలయాల్లో ఉన్నవారు తీవ్ర భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. పలుచోట్ల రోడ్లపై పెద్ద పెద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. కార్లు, ఇతర వాహనాలు ఆ పగుళ్లలోనే దిగబడ్డాయి. వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

పాక్‌లో భూమి కంపించడం వల్ల భారత్​లోని సరిహద్దు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి. పీవోకే, జమ్మూకశ్మీర్‌లో పలుచోట్ల ఈ ప్రభావం కనిపించింది.

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భూకంపం ధాటికి ఓ భవంతి కుప్పకూలడం వల్ల చిన్నారులు, మహిళలు తీవ్రంగా గాయపడినట్టు పాక్‌ సైన్యం వెల్లడించింది. క్షతగాత్రులను మిర్‌పుర్‌లోని ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

రోడ్లపై భారీ చీలికలు...

భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మసీదులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల రోడ్లపై భారీ చీలికలు ఏర్పడ్డాయి. కొన్ని వాహనాలు తిరగబడ్డ దృశ్యాలను స్థానిక మీడియా ప్రసారం చేసింది. అంతేకాక పీవోకేలోని అన్ని ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.

జలవిద్యుత్​ కేంద్రం...

భూకంపం ధాటికి మిర్‌పుర్ సమీపంలోని మంగళ డ్యామ్‌ జలవిద్యుత్‌ కేంద్రాన్ని మూసివేశారు. ఈ పరిణామంతో 900 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. జలాశయానికి ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. ఎగువన జీలం కాలువకు గండిపడటం వల్ల అనేక గ్రామాలను వరద ముంచెత్తింది.

సహాయకచర్యలు...

పీవోకేలో తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖామర్‌ జావెద్‌ బజ్వా దళాలను ఆదేశించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు సైనికులు హెలికాప్టర్లలో భూకంప ప్రభావిత ప్రాంతాలకు బయలుదేరినట్లు పాక్‌ ఆర్మీ ట్వీట్‌ చేసింది. అమెరికాలో ఉన్న పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

పంజాబ్‌ ప్రావిన్స్‌లోని జెహ్లమ్‌ నగరంలో రిక్టర్​ స్కేలుపై 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని పాకిస్థాన్‌ వాతావరణ కేంద్రంలోని భూకంపాల విభాగం వెల్లడించింది. అయితే భూకంప తీవ్రత 7.1గా ఉందని శాస్త్ర సాంకేతికశాఖ మంత్రి ఫావద్‌ చౌదరి చెప్పారు.

Last Updated : Oct 1, 2019, 10:23 PM IST

ABOUT THE AUTHOR

...view details