దేశాన్ని ఆక్రమించుకున్న తాలిబన్లపై గొంతెత్తి పోరాడుతున్నారు అఫ్గానిస్థాన్ పౌరులు. తాలిబన్ల పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. వరుసగా రెండో రోజూ వీధుల్లోకి వచ్చి తాలిబన్లపై ధిక్కార స్వరం వినిపించారు. భారీ తుపాకులు చేతబట్టి సాయుధులు పహారా కాస్తున్నప్పటికీ.. వెనక్కి తగ్గడం లేదు. అఫ్గాన్ జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ ఆందోళన చేస్తున్నారు. గురువారం కాబుల్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వద్ద అఫ్గాన్ జాతీయ పతాక గౌరవార్థం మూడు రంగుల బ్యానర్లు ప్రదర్శించారు.
మరోవైపు, నిరసనకారులపై ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తున్నారు తాలిబన్లు. ప్రజలకు క్షమాభిక్ష పెట్టినట్లు చేసిన సొంత ప్రకటనను తుంగలో తొక్కుతూ.. రాక్షస పాలనకు మళ్లీ బీజం వేస్తున్నారు. ఆగస్టు 19న అఫ్గాన్ ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా గురువారం జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించిన పౌరులపై.. ముష్కర మూకలు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో అనేకమంది చనిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
అసదాబాద్‌లో ముష్కరమూకల దండు జరిపిన కాల్పుల్లో.. పలువురు అఫ్గాన్ పౌరులు అసువులుబాసారు. నంగర్హార్ రాష్ట్రంలోనూ నిరసనకారులపై తాలిబన్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. తూటా గాయంతో ఓ పౌరుడు విలవిల్లాడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు.
కర్ఫ్యూ
ఖోస్త్ రాష్ట్రంలో హింసాత్మక నిరసనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇక్కడ 24 గంటల కర్ఫ్యూ విధించారు తాలిబన్లు. నిరసనలు, కర్ఫ్యూపై తాలిబన్లు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, అక్కడి పరిస్థితిని పరిశీలిస్తున్న జర్నలిస్టులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కునార్ రాష్ట్రంలోనూ నిరసనలు భగ్గుమన్నాయి.