అమెరికాపై ఒత్తిడి పెంచాలని చూస్తున్న కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా.. ఉద్రిక్తతలకు పాల్పడుతోంది. ఇటీవలే స్వల్ప శ్రేణి లక్ష్యాలను ఛేదించే క్షిపణులను పరీక్షించగా... తాజాగా దక్షిణ కొరియా జలాల్లోకి రెండు గుర్తు తెలియని ప్రొజెక్టైల్స్(తుపాకీ నుంచి ప్రయోగించే క్షిపణులు)ను విసిరేసింది.
తూర్పు తీరంలోని సముద్ర జలాల్లోకి ఈ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా సంయుక్త చీఫ్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. వాటిని అమెరికా అధికారులతో కలిసి పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
అవి బాలిస్టిక్ ఆయుధాలా? అన్న విషయంపై స్పష్టత లేదు. ఎంత దూరంలో పడ్డాయనే అంశంపై అధికారులు వివరణ ఇవ్వలేదు. ఉత్తర కొరియా తమ తూర్పు తీరం నుంచే వీటిని ప్రయోగించినట్లు తెలిపారు.