క్షిపణుల ప్రయోగాలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే ఉత్తర కొరియా.. ఈసారి మరో అడుగు ముందుకేసినట్లు తెలుస్తోంది. సముద్ర గర్భం నుంచి ప్రయోగించే తొలి బాలిస్టిక్ క్షిపణిని త్వరలోనే పరీక్షించనుందని దక్షిణ కొరియా సైనికాధికారి ఒకరు వెల్లడించారు. ఏడాదిలోపే ఈ పరీక్ష చేపట్టే అవకాశం ఉందన్నారు. అమెరికాతో అణ్వాయుధ చర్చలు నిలిచిపోయిన క్రమంలో దూకుడు పెంచుతోందన్నారు.
ఈ అంశాన్ని చట్టసభ్యులకు రాతపూర్వకంగా తెలియజేశారు దక్షిణ కొరియా సంయుక్త చీఫ్ ఆఫ్ స్టాఫ్ నామినీ వాన్ ఇన్ చౌల్.
"ఇటీవల తుపాను ధాటికి ధ్వంసమైన జలాంతర్గాములను తయారు చేసే సిన్పో షిప్‌యార్డ్‌ను ఉత్తరకొరియా బాగుచేస్తోంది. దానిని పూర్తిస్థాయిలో బాగుచేసిన వెనువెంటనే జలాంతర్గాముల నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించే అవకాశం ఉంది. అక్కడి పరిణామాలను దక్షిణకొరియా సైన్యం ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తోంది."