Russia Ukraine crisis: నొవిచోక్.. రష్యాలోని 'ది స్టేట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూ్ట్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ టెక్నాలజీ' కనుగొన్న విషం..! మెదడు, కళ్లు, గుండె, ఊపిరి తిత్తులు, జీర్ణాశయం,కండరాలు, చర్మం ఇలా శరీరంలో ప్రతిభాగాన్ని పిప్పి చేసేస్తుంది. ఆ దేశంలో కొన్ని వేల టన్నుల మిలటరీ గ్రేడ్ నొవిచోక్ ఇప్పటికీ ఉన్నట్లు 2014లో అమెరికాకు చెందిన న్యూక్లియర్ థ్రెట్ ఇనీషియేటివ్ సంస్థ నివేదికలో పేర్కొంది. రష్యా పాలకులు తమ వ్యతిరేకులను.. సమస్యాత్మకంగా మారిన వారిని అంతం చేయడానికి విషపూరిత.. రేడియో ధార్మిక ఆయుధాలను వినియోగించడం పరిపాటిగా వస్తోంది. రష్యా పాలనలో విషప్రయోగాలు.. ఓ భాగమే..! ప్రపంచంలో చాలా దేశాలు రసాయన, విషపూరిత ఆయుధాల వినియోగం ఆపేసినా.. రష్యా మాత్రం వాటిని కొనసాగిస్తోంది. రష్యాలో కాలకూటాల అభివృద్ధికి ఏకంగా ప్రత్యేక ప్రయోగశాలలే ఉన్నాయి. వీటిల్లో ఏం చేస్తారో మూడో కంటికీ తెలియదు.
Russia secret Weapon
ఏమిటీ 'ఛాంబర్'..?
రష్యా రాజధాని మాస్కో శివార్లలో సైంటిఫిక్ రిసెర్చి ఇన్‌స్టిట్యూట్ నెం.2 భవనం ఉంది. కేజీబీ మాజీ అధికారులు, రష్యా నుంచి పారిపోయిన సీనియర్ గవర్నమెంట్ అధికారులు ఆ భవనం గురించి భయంకరమైన కథను ప్రపంచానికి వెల్లడించారు. ఇది క్రెమ్లిన్ కాలకూట విషాల తయారీ ఫ్యాక్టరీ అని పేర్కొన్నారు. సోవియట్ యూనియన్ జమానాలో నాటి నాయకుడు వ్లాదిమిర్ లెనిన్‌పై విషపూరిత తూటాలతో దాడి జరిగింది. ఆ తర్వాత 1921లో లెనిన్ ఆదేశాల మేరకు ‘స్పెషల్ ఆఫీస్’ పేరిట దీనిని ప్రారంభించారు. వాస్తవానికి యుద్ధాల్లో సామూహిక హనన ఆయుధాలు దీనిలో అభివృద్ధి చేస్తున్నట్లు పశ్చిమ దేశాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. సోవియట్, రష్యాల్లో తిరుగుబాట్ల అణచివేతకు వాడిన చరిత్ర ఉంది. ఈ ప్రయోగశాలను ‘ల్యాబ్‌ఎక్స్’, కమెరా(ఇంగ్లిష్‌లో ఛాంబర్ అని అర్థం), ల్యాబ్-12 వంటి పలు పేర్లతో వ్యవహరిస్తారు. రష్యాలో ఇలాంటి పలు ప్రయోగశాలలు ఇప్పటికీ సచేతనంగానే నిర్వహిస్తున్నారని పశ్చిమదేశాలు బలంగా నమ్ముతున్నాయి.
అత్యున్నత శ్రేణి అధికారులు మాత్రమే దీనిలో అడుగుపెట్టగలరు. ఇక్కడ తయారు చేసిన పదార్థాలను లుబియాంకా అనే ప్రదేశంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో రాజకీయ ఖైదీలపై వినియోగించినట్లు 1954లో కేజీబీ నుంచి బయటకు వచ్చిన వారు వెల్లడించారు.
చేతికి మట్టి అంటకుండా మట్టుబెట్టేందుకు..
రష్యా విష ప్రయోగాలను ‘రహస్య తూటాలు’గా భావిస్తుంది. ఎటువంటి ఆధారాలు ఉండవు.. కొత్తకొత్త విషాలు పుట్టుకొచ్చేకొద్దీ దర్యాప్తులు ముందుకు సాగవు. కొన్ని సందర్భాల్లో వాడిన ఆయుధమేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంటుంది. ముఖ్యంగా విదేశాల్లో రష్యా ఏజెంట్లు నేరుగా దాడులకు దిగితే దౌత్యపరంగా తలనొప్పులు వస్తాయి. అలాంటి సందర్భాల్లో విషప్రయోగం చేసి.. ఏజెంట్లు తాపీగా తప్పించుకోవచ్చు. ఇలాంటి కారణాలతోనే రష్యా సైలెంట్‌గా పని ముగించడానికి వీటిని వాడుతుంది.
ఉక్రెయిన్ రాజకీయ చరిత్రపై విషపు మరక..!
2004 ఉక్రెయిన్ ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ బలపర్చిన అభ్యర్థి విక్టర్ యాంకోవిచ్‌ను గెలిపించేందుకు క్రెమ్లిన్ ‘ఛాంబర్’ నుంచి తెప్పించిన ఆయుధాన్ని ప్రత్యర్థి విక్టర్ యష్చెంకోపై వాడినట్లు ఆరోపణలున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన సెప్టెంబర్ 5న ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ ఛైర్మన్ ఇగోర్, డిప్యూటీ వ్లాదిమిర్ సట్‌స్యోక్‌లతో కలిసి పార్టీ చేసుకున్నట్లు 2005లో వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. ఆ డిన్నర్ తర్వాత యష్చెంకో తన భార్య కత్రినాను కిస్ చేయగా.. ఆమెకు అతని పెదవుల నుంచి ఏదో విచిత్రమైన మెటాలిక్ వాసన వచ్చింది. ఆ తర్వాత రోజు ఉదయం నుంచి యష్చెంకో అనారోగ్యం బారిన పడ్డారు. ఆస్ట్రియాలో ఆయనకు చికిత్స చేస్తున్న సమయంలో అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ల బృందం యష్చెంకోపై ‘టెట్రాక్లోరోడిబెంజో-పి-డయాక్సిన్’ వాడినట్లు గుర్తించారు. కొన్ని నెలల చికిత్స తర్వాత కోలుకొన్నారు. కానీ, ఆ విషపు ప్రభావం ఆయన ముఖంపై, శరీరంపై తీవ్రంగా చూపించింది. ఈ విషాన్ని కొన్నేళ్ల ముందే రష్యా ల్యాబ్‌లో పరీక్షించారు.