యుద్ధ సన్నద్ధంగా ఉండాలని చైనా సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్. దేశ సమగ్రతను కాపాడేందుకు సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్లీనరీ సమావేశం సందర్భంగా జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అత్యంత ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని శిక్షణ కార్యక్రమాలు, యుద్ధ సన్నద్ధతను పెంచాలన్నారు జిన్‌పింగ్. క్లిష్ట సమయాల్లోనూ దేశ భద్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడే విధంగా సిద్ధమవ్వాలని పేర్కొన్నారు.
గత కొన్ని రోజులుగా భారత్- చైనా సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో జిన్‌పింగ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు వివాదాస్పద చైనా సముద్రం, తైవాన్ జలసంధిలో అమెరికా నావికా దళం గస్తీ నౌకలను దించడం కూడా ఈ వ్యాఖ్యలకు కారణమని తెలుస్తోంది.
సరిహద్దుల్లో తరచూ ఘర్షణలకు దిగడం ద్వారా కంటిమీద కునుకు లేకుండా చేసి, భారత్‌ను అస్థిర పరచాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అధికార దాహంతో తపించిపోతున్న డ్రాగన్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, సైనిక రంగాల్లో దుందుడుగ్గా ప్రవర్తిస్తోంది. లద్దాఖ్ సెక్టార్‌లో భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చి గొడవపడే విషయంలో చైనాకు కరోనా మహమ్మారి సమస్యా అడ్డంకి కావడం లేదు. చైనా సకాలంలో స్పందించి, విదేశాలకు వెళ్లే విమానాలను గత ఏడాది డిసెంబరు నుంచే నిలిపివేసి ఉంటే, ప్రాణాంతక వైరస్ కార్చిచ్చులా వ్యాపించి ఉండేది కాదు. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజారోగ్య వ్యవస్థలు విఫలమయ్యేవీ కావు.