తెలంగాణ

telangana

ETV Bharat / international

కిమ్ 'ట్రైన్'​ అక్కడ ఎందుకుంది? ఆయన ఎలా ఉన్నారు? - ఆరోగ్యం

ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్​ ఉన్​ ఆరోగ్యంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గుండెకు శస్త్రచికిత్స అనంతరం... ఆయన ఆరోగ్యం విషమించిందని వార్తలొస్తున్నాయి. ఈ తరుణంలో.. కిమ్​కు చెందినదిగా చెప్పుకొనే రైలు ఒకటి దేశ తూర్పు తీరంలో వారం రోజులుగా ఉంటుందట. ఓ వెబ్​సైట్​ విడుదల చేసిన శాటిలైట్​ ఫొటోలు.. ఆయన అక్కడే ఉండొచ్చన్న సంకేతాలకు బలం చేకూరుస్తున్నాయి.

Satellite imagery finds likely Kim train amid health rumours
కిమ్ 'ట్రైన్'​ అక్కడ ఎందుకుంది

By

Published : Apr 26, 2020, 12:29 PM IST

కిమ్​ జోంగ్​ ఉన్​..ఉత్తర కొరియా అధినేత. ఓ వైపు ప్రపంచమంతా కరోనాతో అల్లాడుతుంటే.. మరోవైపు ఈ దేశాధినేత ఆరోగ్యం చర్చనీయాంశమైంది. కారణం.. గత కొద్ది రోజులుగా ఆయన కనిపించకపోవడమే. అవును.. గుండె శస్త్రచికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం క్షీణించిందని, కొందరైతే కోమాలోకి వెళ్లారని అంటున్నారు. అయితే.. ఈ ఊహాగానాలకు తెరదించుతూ దేశంలోని 38 నార్త్​ అనే ఓ వెబ్​సైట్​ కొన్ని శాటిలైట్​ చిత్రాలను విడుదల చేసింది.

శాటిలైట్​ చిత్రాలు
శాటిలైట్​ చిత్రాలు
శాటిలైట్​ చిత్రాలు

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌కు చెందినదిగా చెప్పుకునే ఓ రైలు.. ఏప్రిల్​ 21 నుంచి ఉత్తర కొరియా వాన్సాన్ లీడర్​షిప్​ రైల్వే స్టేషన్ దగ్గరే ఉందట. ఈ మేరకు శాటిలైట్​ ఫొటోల ద్వారా స్పష్టమైంది. అయితే.. కిమ్​ ఆరోగ్యంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని ఈ వెబ్​సైట్...​ ఆయన రాజధాని ప్యాంగ్​యాంగ్​ వెలుపల అక్కడే ఉండొచ్చని సంకేతాలిచ్చింది.

సుమారు 250 మీటర్ల పొడవైన ఈ రైలు... ఏప్రిల్​ 15న కనిపించకపోయినప్పటికీ.. ఏప్రిల్​ 21, 23 తేదీల్లో మాత్రం అక్కడే ఉందని స్పష్టం చేసిందా వెబ్​సైట్​.

శాటిలైట్​ చిత్రాలు
శాటిలైట్​ చిత్రాలు
శాటిలైట్​ చిత్రాలు

'' రైలు.. అక్కడ ఉండటం వల్ల ఉత్తర కొరియా అధినేతకు ఆరోగ్య సమస్యలు లేవని మేం చెప్పలేం. అయితే.. కిమ్​ మాత్రం దేశ ఈశాన్య తీరంలోని ఈ ముఖ్య ప్రాంతంలోనే ఉండే అవకాశముంది.''

-38 నార్త్​ వెబ్​సైట్​ నివేదిక

ఈ ప్రాంతంలో కిమ్‌కు అత్యంత ఎక్కువ భద్రత, రక్షణ ఉంటుంది. అందువల్ల ఆయన అక్కడే ఉండి ఉంటారనే అనుమానాలు కలుగుతున్నాయి.

శాటిలైట్​ చిత్రాలు

అప్పటి నుంచి అనుమానాలు..

ఏప్రిల్ 15న తన తాత, కొరియా జాతిపిత... రెండో కిమ్ సంగ్ 108వ జయంతి వేడుకలకు కిమ్ జోంగ్ ఉన్ రాలేదు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించిదన్న వాదన బలంగా వినిపిస్తోంది.

అవే భయాలు..

లక్షలాది మంది దైవంగా భావించే కిమ్​ ఆరోగ్యంగా ఉండటం ఉత్తర కొరియాకు ఎంతో కీలకం. ఒకవేళ ఆయన అనారోగ్యం బారిన పడటం, చనిపోవడం జరిగితే ఈ అణ్వాయుధ దేశంలో అస్థిరత నెలకొంటుదన్న భయాలు అలుముకున్నాయి.

కిమ్​కు ఏం కాలేదు...

కిమ్​ ఆరోగ్యంపై ఎవరెన్ని ప్రచారాలు చేసినా... దక్షిణ కొరియా మాత్రం అవి వదంతులేనని చెప్పుకుంటూ వస్తోంది. కిమ్​కు అసాధారణ ఆరోగ్య సమస్యలు ఏమీ లేవని ఉద్ఘాటించింది. అయితే.. ఒకవేళ కిమ్​కు ఏమైనా అయితే దేశంలో తక్షణమే క్లిష్ట పరిస్థితులు నెలకొనే అవకాశాలు లేవని అంటున్నారు ఎందరో రాజకీయ నిపుణులు.

కిమ్​లాగే ఎంతో ప్రభావవంతమైన మహిళ, ఆయన సోదరి కిమ్​ యో జోంగ్​ వెంటనే పగ్గాలు చేపడతారని.. ఫలితంగా ఉత్తర కొరియా సుదీర్ఘ రాజకీయ భవితవ్యం ఆమె చేతుల్లోనే ఉండనుందని విశ్లేషిస్తున్నారు.

జపాన్​ ఏమంటోందంటే...

కిమ్​కు ఏం కాలేదని పక్క దేశం అంటుంటే.. జపాన్​ మాత్రం వేరే వాదనలు వినిపిస్తోంది. ఊహించినదానికంటే కిమ్​ ఆరోగ్యం తీవ్రంగా ఉందని, ఆయన అచేతన స్థితిలో ఉన్నారని నివేదించింది జపాన్​ మీడియా.

కిమ్​ ఆరోగ్యంపై సలహాలు ఇవ్వడానికి, వైద్య సాయం చేయడానికి ఉత్తర కొరియాకు.. చైనా ఓ వైద్య బృందాన్ని పంపించిందని వార్తలు వస్తున్నాయి.

మౌనమేల..?

ఉత్తర కొరియాలో నిబంధనలు కఠినంగా ఉంటాయి. అధికారికంగా ఎలాంటి ముఖ్య వార్తలు బయటకు రావాలన్నా అధినేత కిమ్ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే కిమ్​కు సంబంధించిన వార్తలపైనా మీడియా మౌనం వహిస్తోంది. అందుకే ఆయన ఆరోగ్యం ఎలా ఉందన్నది ప్రపంచానికి తెలియట్లేదు.

ABOUT THE AUTHOR

...view details