నటాన్జ్ అణుకేంద్రంలో నూతన నిర్మాణాన్ని ప్రారంభించింది ఇరాన్. తాజాగా విడుదలైన ఉపగ్రహ చిత్రాలను చూస్తే ఇది స్పష్టంగా తెలుస్తోంది. ఐకరాజ్యసమితి అణు సంస్థ కూడా దీనిని ధ్రువీకరించింది. భూగర్భంలో అధునాతన సెంట్రిఫ్యూజ్ అసెంబ్లీ ప్లాంట్‌ను టెహ్రాన్ నిర్మిస్తోందని తెలిపింది. గతేడాది వేసవిలో జరిగిన దాడిలో ధ్వంసమైన ప్లాంట్ స్థానంలో ఈ నూతన నిర్మాణాన్ని ఇరాన్ చేపట్టి ఉంటుందని ఐరాస అణు సంస్థ భావిస్తోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్మాణాన్ని ప్రారంభించింది. అణు కార్యకలాపాలను విరమించుకోవాలని ఇరాన్‌పై ఇదివరకే ఒత్తిడి తీసుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఆయనతో విబేధించిన అనంతరం అణు కార్యకలాపాలపై పరిమితులను ఇరాన్ పూర్తిగా ఎత్తివేసింది. అయితే తాము అధికారంలోకి వస్తే అణుఒప్పందాన్ని పునరుద్దరించే విషయంపై ఆలోచిస్తామని జో బైడెన్ ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం ఇరాన్‌తో అమెరికా ఏ విధంగా ముందుకు సాగుతుందనే విషయంపై స్పష్టత రానుంది.