తెలంగాణ

telangana

ETV Bharat / international

లాలాజల పరీక్షతో వేగంగా కొవిడ్ నిర్ధరణ! - కరోనా వేగవంతమైన పరీక్ష జపాన్ పరిశోధన

లక్షణాలు కనిపించని కరోనా బాధితులను సాధ్యమైనంత త్వరగా గుర్తించేందుకు జపాన్​లోని ఓ యూనివర్సిటీ నూతన విధానం రూపొందించింది. ఇందులో భాగంగా స్వాబ్ ద్వారా తీసుకున్న శాంపిళ్లతో పాటు, లాలాజలం నమూనాలను శాస్త్రవేత్తలు పరీక్షించారు. స్వాబ్‌ శాంపిళ్లలో 77 నుంచి 93శాతం.. లాలాజలం శాంపిళ్లలో 83-97శాతం వైరస్‌ను గుర్తిస్తున్నట్లు కనుగొన్నారు. పీసీఆర్ పరీక్షతో పోలిస్తే వీటి కచ్చితత్వం కాస్త తక్కువే అయినప్పటికీ.. ఫలితాలు త్వరగా రాబట్టవచ్చని తెలిపారు.

Saliva tests could quickly detect asymptomatic COVID-19 cases, study says
లక్షణాలు లేని కరోనా నిర్ధరణకు లాలాజలం పరీక్ష భేష్!

By

Published : Sep 29, 2020, 5:38 PM IST

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఎక్కువమంది కేవలం లక్షణాలు ఉన్నవారు, లేదా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయిన వారితో సన్నిహితంగా మెలిగినవారే కొవిడ్‌ పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే, లక్షణాలు కనిపించని వారిలోనే ఎక్కువగా కేసులు బయటపడుతున్నాయి. ఇలాంటి వారిని సాధ్యమైనంత త్వరగా గుర్తించే పనిలో భాగంగా తాజా విధానాన్ని రూపొందించామని జపాన్‌లోని హొక్కైడో యూనివర్సిటీకి చెందిన టకనోరీ టెషిమా తెలిపారు. ఇందుకోసం సేకరించిన నమూనాలను పీసీఆర్‌ పరీక్షతోపాటు అరుదుగా ఉపయోగించే ఆర్‌టీ-ల్యాంప్‌(ఆర్​టీ-ఎల్​ఏఎంపీ) విధానంలో పరీక్షించారు.

వేగంగా ఫలితం!

స్వాబ్‌ ద్వారా తీసుకున్న శాంపిళ్లలో 77 నుంచి 93శాతం వైరస్‌ను గుర్తించగా, లాలాజలం శాంపిళ్లలో 83-97శాతం వైరస్‌ను గుర్తిస్తున్నట్లు కనుగొన్నారు. రెండు విధానాల్లో చేసిన అన్ని శాంపిళ్లలో దాదాపు ఒకే విధమైన ఫలితాలు వచ్చాయని వెల్లడించారు. అంతేకాకుండా ఈ రెండు విధానాల్లో వైరస్‌ సోకని వారిని 99.9శాతం కచ్చితత్వంతో గుర్తించగలుగుతున్నట్లు పరిశోధకులు తెలిపారు.

"గొంతు, ముక్కు ద్వారా నమూనాలను సేకరించే విధానం కన్నా లాలాజలం ద్వారా సులువుగా నమూనాలను తీసుకోవచ్చు. చాలా సులువైన, చౌకైన విధానం. శాంపిళ్లు సేకరించే వారికి వైరస్‌ బారినపడే ప్రమాదం కూడా ఉండదు" అని స్పష్టంచేస్తున్నారు పరిశోధకులు. పీసీఆర్ పరీక్షతో పోలిస్తే వీటి కచ్చితత్వం కాస్త తక్కువే అయినప్పటికీ.. ఫలితం తొందరగా అవసరమయ్యే క్రీడా వేదికలు, విమానాశ్రయాల్లో కొవిడ్‌ నిర్ధరణకు ప్రత్యామ్నాయంగా ఈ లాలాజల పరీక్షలు నిర్వహించవచ్చని సూచిస్తున్నారు.

అమెరికా ఆమోదం

ఇప్పటికే లాలాజల ఆధారిత నిర్ధరణ పరీక్షకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. కరోనా నిర్ధరణకు అవసరమైన రీఏజెంట్లు, ఇతర ఉపకరణాల కొరతను ఈ పరీక్ష విధానంతో అధిగమించవచ్చని ఎఫ్‌డీఏ పేర్కొంది. ఈ మధ్యే అందుబాటులోకి వచ్చిన ‘సలైవా డైరెక్ట్‌’ విధానంలో.. వ్యాధి లక్షణాలు లేనివారిలో కరోనాను గుర్తించవచ్చని తేల్చారు.

ఇదీ చదవండి-'అయోధ్య తరహాలో మథుర, కాశీకి విముక్తి!'

ABOUT THE AUTHOR

...view details