కరోనా వ్యాక్సిన్‌ను రిజిస్టర్ చేసిన తొలి దేశంగా రష్యా నిలిచింది. అయితే, వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించగానే యావత్ ప్రపంచం ఆ దేశాన్ని ప్రశంసించింది. కానీ వ్యాక్సిన్‌ను తీసుకోవడంలో ప్రజల నుంచి అరకొర స్పందనే వస్తున్నట్లు తాజా నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. వ్యాక్సిన్ ఉచితంగానే ఇస్తున్నప్పటికీ పంపిణీ కేంద్రాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.
అత్యవసర వినియోగానికి అనుమతులు వచ్చిన వెంటనే దానిని అతిపెద్ద విజయంగా ప్రకటించుకున్న రష్యాలో.. ఈ టీకాపై అక్కడి ప్రజల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, తుది దశ ప్రయోగాలు కొనసాగుతున్న దశలోనే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావడం పట్ల వారు తీవ్ర అసంతృప్తి చెందుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
అంతర్జాతీయంగా విమర్శలు..
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తున్నట్లు అధ్యక్ష కార్యాలయం చేసిన అధికారిక ప్రకటనపై కేవలం రష్యాలోనే కాకుండా అంతర్జాతీయంగానూ విమర్శలు ఎదుర్కొంది. వ్యాక్సిన్‌ను వేల మందిపై చేసే తుదిదశ ప్రయోగాలు పూర్తికాకముందే ప్రజలకు అందుబాటులోకి తేవడంలో స్థానిక, అంతర్జాతీయ నిపుణులు హెచ్చరించారు. వీటిని లెక్కచేయని క్రెమ్లిన్, వ్యాక్సిన్‌ను వేల మందికి ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అనుమతులు వచ్చిన కొన్ని వారాల్లోనే కరోనా యోధులు, ఆరోగ్య సిబ్బంది వంటి వైరస్ ముప్పు ఉన్నవారికి వ్యాక్సిన్‌ను ఇవ్వడం ప్రారంభించింది. కేవలం గత వారంలోనే దాదాపు లక్షా 50వేల మంది రష్యన్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు టీకా తయారు చేసిన గమలేయా ఇన్‌స్టిట్యూట్ అధిపతి అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ వెల్లడించారు.
వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ..
ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను తప్పని పరిస్థితుల్లో తీసుకోవలసి వచ్చిందని కరోనా రోగులకు చికిత్స అందిస్తోన్న అక్కడి స్థానిక వైద్యులు అంటున్నారు. వైరస్ బారిన పడటం కంటే వ్యాక్సిన్ తీసుకోవడమే ప్రస్తుతం మా ముందున్న అవకాశమని మాస్కో సమీపంలోని కొవిడ్ ఆసుపత్రి వైద్యుడు డా.జాట్‌సెపిన్ అభిప్రాయపడ్డారు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ వ్యాక్సిన్ సమర్థతపై పూర్తి ఫలితాలు ఇంకా రాలేదని.. అందుకే ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటివరకు వ్యాక్సిన్‌పై కచ్చితమైన నమ్మకం మాత్రం కలుగలేదని ఆయన అభిప్రాయపడ్డారు.