రష్యాలో(Russia covid cases) కరోనా మహమ్మారి (Corona virus in Russia) ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. ఆ దేశంలో ఇప్పటివరకు వైరస్ బారిన పడినవారి సంఖ్య 80 లక్షలు దాటింది. ఇది ఆ దేశ జనాభాలో 5శాతం కంటే ఎక్కువ కావడం గమనార్హం. కొత్త కేసులు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రష్యాలో కొత్తగా 34,325 మందికి కరోనా సోకిందని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 80,27,012కు చేరిందని చెప్పారు. వైరస్ ధాటికి మరో 998 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.
మరోవైపు.. రష్యాలో కొవిడ్ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. లబ్ధిదారులకు లాటరీలు, బోనస్‌లు, ప్రోత్సాహకాలు వంటివి ప్రకటిస్తున్నారు. అయినప్పటికీ.. టీకాలపై ప్రజల్లో ఉన్న అపోహల కారణంగా.. ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. రష్యావ్యాప్తంగా ఇప్పటివరకు 32శాతం మందికి కరోనా పూర్తి టీకా డోసులు పంపిణీ చేసినట్లు అక్కడి అధికారులు సోమవారం తెలిపారు.
జపాన్‌లో తగ్గుముఖం...
మరోవైపు... జపాన్‌లో కరోనా వ్యాప్తి(Japan Corona Cases) అనూహ్యంగా తగ్గముఖం పట్టింది. ఆ దేశ రాజధాని టోక్యోలో ఆగస్టు మధ్యలో రోజువారీ కేసులు దాదాపు 6,000గా నమోదు కాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 100 కంటే తక్కువకు పడిపోయింది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం వల్ల ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం బార్లు, రైళ్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. అయితే.. ఇలా ఆకస్మాత్తుగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడానికి గల కారణాలేంటో అక్కడి అధికారులకు అంతుచిక్కడం లేదు.