కరోనా వ్యాక్సిన్ కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్న తరుణంలో లాన్సెట్ జర్నల్ శుభవార్త తెలిపింది. రష్యా గత నెలలో ప్రకటించిన 'స్పుత్నిక్ వీ' వ్యాక్సిన్ సురక్షితమని వెల్లడించింది. కొద్ది మందిపై జరిపిన వ్యాక్సిన్ ప్రయోగ ప్రాథమిక ఫలితాలను ప్రచురించింది. దీని ప్రకారం.. ఈ ఏడాది జూన్-జులై నెలల్లో రెండు దశల్లో 38 మంది చొప్పున మొత్తం 76 మందికి వ్యాక్సిన్ అందించారు. వారందరిలోనూ నూరు శాతం యాంటీ బాడీలు ఉత్పత్తి అయినట్లు లాన్సెట్ పేర్కొంది. ఎవరీలోనూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని పేర్కొంది. వ్యాక్సిన్‌ను దీర్ఘకాలంలో భద్రంగా, మరింత ప్రభావంతంగా తీర్చిదిద్దేందుకు పెద్దఎత్తున పరీక్షలు, మరింత పర్యవేక్షణ అవసరం అని అభిప్రాయపడింది.
గుడ్‌న్యూస్: రష్యా 'స్పుత్నిక్ వీ' వ్యాక్సిన్ సేఫ్ - రష్యా వ్యాక్సిన్
రష్యా గతనెలలో ప్రకటించిన 'స్పుత్నిక్ వీ' వ్యాక్సిన్ సురక్షితమైనదేనని తేలింది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఫలితాల వివరాలను లాన్సెట్ జర్నల్ ప్రచురించింది. వాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీబాడీలు, టీ కణాలు ఉత్పత్తి అవుతున్నట్లు వెల్లడించింది.
ప్రపంచంలో అందరి కంటే కొవిడ్-19కు వ్యాక్సిన్ కనుగొన్న దేశంగా రష్యా ప్రకటించుకున్నప్పటికీ.. వ్యాక్సిన్‌పై పలు దేశాలు, వైద్య నిపుణులు అనుమానం వ్యక్తం చేశాయి. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ కుమార్తెకు సైతం వ్యాక్సిన్ ఇచ్చినప్పటికీ.. తొలి రెండు దశల క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారమూ పంచుకోకపోవడంతో రష్యా విమర్శలు ఎదుర్కొంది. లాన్సెట్ ప్రచురణతో తమ చేతికి ఆయుధం దొరికిందని రష్యన్ డైరెక్టర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) అధినేత కిరిల్ దిమిత్రియేవ్ అన్నారు. రష్యా వ్యాక్సిన్‌పై ప్రశ్నల వర్షం కురిపించిన వారికి సమాధానం ఇచ్చే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఇతర దేశాల వ్యాక్సిన్ల పనితీరును ఇప్పుడు తాము ప్రశ్నిస్తామని చెప్పారు. మరోవైపు వ్యాక్సిన్‌కు సంబంధించి మలి దశ క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించిన రష్యా.. ఏడాది చివరి నాటికి నెలకు 15 లక్షల నుంచి 20 లక్షల డోసులను సిద్ధం చేయగలమని భావిస్తోంది. క్రమంగా నెలకు దాన్ని 60 లక్షలకు పెంచుకోగలమన్న విశ్వాసం వ్యక్తంచేస్తోంది.