ముగ్గురు వ్యోమగాముల బృందం బుధవారం రికార్డు స్థాయిలో మూడు గంటల మూడు నిమిషాలు ప్రయాణించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. వారిని ఇంత తక్కువ సమయంలో అంతరిక్ష కేంద్రానికి చేర్చిన ఘనత రష్యన్ అంతరిక్ష సంస్థకు దక్కింది. ఈ ఆర్బిటల్ ల్యాబ్‌ను చేరుకునేందుకు చేపట్టిన అత్యంత వేగవంతమైన మానవ సహిత ప్రయాణం ఇదేనని ఆ సంస్థ వెల్లడించింది. రష్యాకు చెందిన అంతరిక్ష కార్యక్రమాలను నిర్వహించే రోస్కాస్మోస్ ఈ విషయాన్ని ధ్రువీకరించగా, 'మూడు గంటల మూడు నిమిషాలు' అని ఆ సంస్థ చీఫ్ దిమిత్రీ రోగోజిన్ ట్వీట్ చేశారు.
రష్యా స్పేస్ ఏజెన్సీకి చెందిన సెర్గే రిజికోవ్, సెర్గే కుద్-వెర్చ్‌కోవ్, నాసాకు చెందిన కేత్ రూబిన్స్లు బుధవారం ఉదయం కజక్‌స్థాన్‌లోని బైకొనుర్ అంతరిక్ష కేంద్రం నుంచి సోయుజ్ ఎంఎస్-17 రాకెట్ ద్వారా ఐఎస్ఎస్కు చేరుకున్నారు. ఆరు నెలల పాటు వారు అక్కడే ఉంటారు. మామూలుగా అయితే అక్కడికి చేరుకుకోవడానికి ఆరు గంటల సమయం పడుతుంది. కాగా, ఇప్పుడు ఆ సమయాన్ని రష్యా మూడు గంటలకు కుదించి రికార్డు సృష్టించింది.