2036 వరకు దేశాధ్యక్ష పీఠంపై ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొనసాగే విధంగా రాజ్యాంగానికి చేసిన సంస్కరణలకు.. రష్యా ప్రజలు భారీ స్థాయిలో మద్దతు పలికారు. దాదాపు 78శాతం మంది ఓటర్లు రాజ్యంగ సంస్కరణలకు అనుకూలంగా ఓట్లు వేశారు.
ప్రజాభిప్రాయ సేకరణకు.. వారం రోజుల పాటు సాగిన ఎన్నికలు బుధవారం ముగిశాయి. మొత్తం 64శాతానికిపైగా రష్యన్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. ఇందులో 77.9శాతం మంది ప్రజలు సంస్కరణలకు అనుకూలంగా, 21.3శాతం వ్యతిరేకంగా ఓట్లు వేశారు.
అయితే పుతిన్‌కు ఈ స్థాయిలో మద్దతు లభించడం ఇదే తొలిసారి. 2018 అధ్యక్ష ఎన్నికల్లో 76.7శాతం, 2012 ఎన్నికల్లో 63.6శాతం ఓట్లు పుతిన్‌కు లభించాయి.
'ఇవన్నీ తప్పుడు లెక్కలు..'
విపక్షాలు మాత్రం.. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు చేశాయి. అధికారులు తప్పుడు లెక్కలు చెబుతున్నారని మండిపడ్డాయి. ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న వేళ.. అధ్యక్షుడికి ఈ స్థాయిలో మద్దతు ఎలా లభిస్తుందని అనుమానం వ్యక్తం చేశాయి. ప్రజల అభిప్రాయాలకు, ఎన్నికల ఫలితాల మధ్య ఎలాంటి పొంతన లేదని విపక్ష నేత ఎలెక్సీ నవల్ని ఫేస్బుక్ వేదికగా ఆరోపించారు.
మే నెలలోనే "లెవడా సెంటర్" అనే స్వతంత్ర సంస్థ.. పుతిన్ ప్రభుత్వంపై ప్రజాభిప్రాయ సేకరణకు ముందస్తు పోలింగ్ నిర్వహించింది. అందులో అధ్యక్షుడికి 59శాతం మంది ప్రజల మద్దతు మాత్రమే లభించడం గమనార్హం. ఇది రెండు దశాబ్దాల్లో అత్యల్పం.
ఒత్తిడి పెంచి...
అయితే కరోనా మహమ్మారి దృష్ట్యా వారం రోజుల పాటు నిర్వహించిన ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగినట్టు దేశ నలుమూలల నుంచి వార్తలు వచ్చాయి. ఓట్లు వేయాలని ప్రభుత్వం, ప్రైవేటు ఉద్యోగులపై ఆయా సంస్థలు తీవ్ర ఒత్తిడి పెంచినట్లు ఆరోపణలు వినిపించాయి. బ్యాలెట్ బాక్సులకు సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదన్న విమర్శలూ వెల్లువెత్తాయి.
ఇదీ చూడండి:-రష్యా అధ్యక్షునిగా కొనసాగేందుకు పుతిన్‌కు లైన్ క్లియర్!