బ్రిటన్ - రష్యా ఘర్షణకు నల్ల సముద్రం వేదికగా మారింది. క్రిమియా సముద్ర జలాల్లోకి వచ్చిన బ్రిటన్ నౌకపై రష్యా హెచ్చరికగా కాల్పులు జరపడంతో పాటు.. యుద్ధవిమానాలతో సమీపంలో బాంబులు కూడా వేసింది. ఈ ఘటన ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. ఇరుదేశాల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన డెస్ట్రాయర్ హెచ్‌ఎంఎస్ డిఫెండర్ ఇటీవల ఉక్రెయిన్‌లోని ఒడిశా పోర్టుకు వెళ్లింది. అక్కడి నుంచి జార్జియాకు వెళ్లే క్రమంలో క్రిమియా జలాల్లోకి ప్రవేశించింది. దీనిని గుర్తించిన తమ నౌకలు హెచ్చరికలు జారీచేస్తూ కాల్పులు జరిపినట్లు రష్యా పేర్కొంది. అంతేకాదు సు-24 యుద్ధ విమానాలతో ఓఎఫ్‌ఏబీ-250 రకం బాంబులను నౌక సమీపంలో పేల్చినట్లు చెప్పుకొచ్చింది. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత నాటో కూటమిలోని ఒక సభ్యదేశ నౌకను అడ్డుకోవడానికి కాల్పులు జరపడం ఇదే తొలిసారి అని రష్యా పేర్కొంది.
కానీ రష్యా వాదనతో బ్రిటన్ విభేదిస్తోంది. తాము ఉక్రెయిన్ జలాల్లోంచే ఇన్నోసెంట్ ప్యాసేజ్ నిర్వహించామని బ్రిటన్ రక్షణ మంత్రి పేర్కొన్నారు. ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రతినిధి మాట్లాడుతూ "మా నౌకపై కాల్పులు జరిపారనడం, మేము రష్యా జలాల్లోకి వెళ్లామనడం తప్పు" అని పేర్కొన్నారు. ఈ యుద్ధనౌకలోని ఒక బ్రిటన్ విలేకరి మాత్రం 20 యుద్ధ విమానాలు వచ్చిన మాట వాస్తవమే కానీ, ఎలాంటి బాంబులు, కాల్పుల ఘటనలు చోటు చేసుకోలేదని వెల్లడించారు. ఈ ఘటనపై బ్రిటన్ ప్రభుత్వం రష్యా రాయబారికి సమన్లు జారీ చేయగా.. మాస్కోలో బ్రిటన్ రాయబారికి రష్యా సమన్లు జారీ చేసింది.
దీనిపై రష్యా డిప్యూటీ రక్షణశాఖ మంత్రి సెర్గీరెబకోవ్ ఓ వార్తా సంస్థతో చెబుతూ "అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి. అవి పని చేయకపోతే మేము బాంబులు వేస్తాం. మరోసారి ఇలాగే జరిగితే మా బాంబులు లక్ష్యాలను తాకుతాయి" అని వ్యాఖ్యానించారు.