రష్యాలో.. జంతువులకు కరోనా టీకా పంపిణీ ప్రారంభమైంది. కార్నివాక్-కోవ్ పేరిట అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ను ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ టీకా ద్వారా ఆరు నెలల వరకు వైరస్ నుంచి రక్షణ లభించనుంది.
కార్నివాక్ వ్యాక్సిన్ను ఇదివరకు కుక్కలు, పిల్లులు, నక్కలపై ప్రయోగించినట్లు రష్యా వెటర్నరీ విభాగం వెల్లడించింది. ఇది జంతువుల్లో ప్రభావవంతంగా పనిచేస్తోందని తెలిపింది.
పెంపుడు జంతువులకు టీకాలను అందించేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారని వెటర్నరీ విభాగం సలహాదారు జూలియా మెలానో తెలిపారు. టీకాల కోసం క్లినిక్లను సంప్రదిస్తున్నారని చెప్పారు.
భారీ స్థాయిలో వీటి ఉత్పత్తిని ప్రారంభించినట్లు రష్యా ఇదివరకు తెలిపింది. రష్యా వెటర్నరీ విభాగం అనుబంధ సంస్థ నుంచి 17 వేల డోసులతో తొలి విడత పంపిణీ ప్రారంభమైంది. ఈ టీకాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని, తొలి బ్యాచ్ టీకాలను దేశంలోనే పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం నెలకు 30 లక్షల డోసులుగా ఉందని, దాన్ని 50 లక్షలకు పెంచుతామని వివరించారు.
ఇదీ చదవండి-జంతువులకూ కరోనా వ్యాక్సిన్!