తెలంగాణ

telangana

ETV Bharat / international

Russia Ukraine War: చెర్నోబిల్‌పై రష్యా మెరుపుదాడి.. అందుకేనా?

Russia Ukraine War: ఉక్రెయిన్​లోని చెర్నోబిల్ అణు విద్యాత్​ కేంద్రాన్ని రష్యా దళాలు ఆక్రమించగానే ప్రపంచం ఉలికిపాటుకు గురైంది. 1986లో పెను విపత్తుకు దారితీసిన ఈ కేంద్రం.. రష్యా దాడి అనంతరం సురక్షిమని చెప్పలేమంది ఉక్రెయిన్. ఇంతకీ చెర్నోబిల్​ను రష్యా ఆక్రమించడం వెనుక కారణమేంటి?

Russia Ukraine Crisis
Chernobyl

By

Published : Feb 26, 2022, 7:52 AM IST

Russia Ukraine War: చెర్నోబిల్‌ అణు విద్యుత్‌ కేంద్రాన్ని రష్యా సేనలు ఆక్రమించగానే ప్రపంచవ్యాప్తంగా ఓ ఉలికిపాటు..! దీనికి కారణం లేకపోలేదు. 1986లో ఆ కేంద్రం నుంచి వెలువడిన రేడియషన్‌.. అటు ఐరోపాను.. ఇటు రష్యాను పెను విషాదంలోకి నెట్టింది. అణు ధార్మికత ప్రభావానికి లోనై వేలల్లో ప్రజలు చనిపోయారు. క్యాన్సర్‌ సోకి అంతర్జాతీయంగా 93 వేల మంది మరణించారని అంచనా. అలాంటి చెర్నోబిల్‌.. రష్యా గుప్పిట్లోకి వెళ్లడం వల్ల సహజంగానే అందరిలోనూ ఒక రకమైన ఆందోళన. మరి నిజంగానే ఈ అణుకేంద్రంతో అంత ముప్పు ఉందా? యుద్ధం ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ఈ అణుకేంద్రాన్ని పుతిన్‌ సేన గుప్పిట్లోకి తీసుకోవడం వెనుక మర్మమేమిటి? అణు సంబంధమైనదా? లేక వ్యూహాత్మక ఆక్రమణా?

కీవ్‌:"రష్యా దాడి తర్వాత అణు విద్యుత్‌ కేంద్రం సురక్షితమని చెప్పడం కష్టం. ఇది ఐరోపాకు పెను ప్రమాదం".. చెర్నోబిల్‌ ఆక్రమణ అనంతరం ఇదీ ఉక్రెయిన్‌ స్పందన. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా.. 1986 విషాదం మరోసారి జరగకుండా చివరి వరకు మా దళాలు ప్రయత్నించాయి. కానీ ఆపలేకపోయాం.. అంటూ ట్వీట్‌ చేశారు. దీంతో అణు ప్రమాదం ఏర్పడుతుందా అన్న సంశయాలు వెల్లువెత్తాయి. సైనిక నిపుణులు మాత్రం.. పుతిన్‌ దళాల ఆక్రమణ వెనుక వేరే కారణం ఉందంటున్నారు.

దగ్గర దారి.. అందుకే..!

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను సాధ్యమైనంత వేగంగా చేజిక్కించుకోవడం పుతిన్‌ సేనల లక్ష్యం. అందులో భాగమే చెర్నోబిల్‌ ఆక్రమణ. బెలారస్‌ సరిహద్దుల నుంచి కీవ్‌కు చేరుకోవడానికి కేవలం 7 గంటల సమయం చాలు.. దూరం 450 కిలోమీటర్ల లోపే. భౌగోళికంగానూ కీలకమైన ప్రదేశంలో ఉంది. అందుకే రష్యా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మెరుపులా కదిలి.. కబ్జా చేసింది. అయితే ఈ చెర్నోబిల్‌ అణువిద్యుత్‌ కేంద్రాన్ని, ఈ మార్గాన్ని కైవసం చేసుకొనేందుకు వారం క్రితమే రష్యా పావులు కదిపింది. భారీ స్థాయిలో బెలారస్‌కు దళాలను పంపింది. విన్యాసాల గడువు ముగిసినా వాటిని వెనక్కి రప్పించలేదు. దీనిపై రష్యా వివరణ కూడా అప్పట్లో ఇచ్చింది. డాన్‌బాస్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో విన్యాసాల గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అలా బెలారస్‌ దక్షిణ సరిహద్దుల్లో నిలిచిపోయిన బలగాలే ఇప్పుడు చెర్నోబిల్‌ను ఆక్రమించాయి. ఇది పుతిన్‌ వ్యూహత్మక ఎత్తుగడ అని సైనిక నిపుణులు చెబుతున్నారు.

నది నీపర్‌ కూడా..!

కీవ్‌ నగరం మీదుగా ప్రవహిస్తున్న కీలక నది నీపర్‌. ఈ జలాల్లోకి ప్రవేశించడానికీ చెర్నోబిల్‌ అనువైన ప్రాంతం. నదీ మార్గంలోనూ యుద్ధాన్ని కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని భావించి కూడా చెర్నోబిల్‌ను హస్తగతం చేసుకొని ఉంటారని ట్రూమన్‌ నేషనల్‌ సెక్యూరిటీ ప్రాజెక్టులో రక్షణ నిపుణులు సమంతా టర్నర్‌ తెలిపారు. ఆ నది ఒడ్డున కీలక నగరాల్లోకి ప్రవేశించేందుకు ఇది ఒక మార్గంగా ఉపయోగపడే అవకాశం ఉందన్నారు.

నింగి నుంచి దిగి..

చెర్నోబిల్‌పై రష్యా మెరుపుదాడి చేసిందనే చెప్పాలి. ఆ దేశ పారాట్రూపర్ల దళం గగనతలం నుంచి నేరుగా అణువిద్యుత్‌ కేంద్ర పరిసరాల్లో దిగిపోయాయి. దీంతో చెర్నోబిల్‌ రక్షణ కోసం అక్కడ ఉన్న పరిమిత ఉక్రెయిన్‌ దళాలు.. ఊహించని రష్యా దాడికి చేతులెత్తేశాయి. ప్రస్తుతం ఈ కేంద్ర భద్రతను తమతో కలిసి ఉక్రెయిన్‌ దళాలు నిర్వహిస్తున్నట్లు రష్యా రక్షణ శాఖ కూడా ప్రకటించింది. అణు విద్యుత్‌ కేంద్రాల నిర్వహణ విషయంలో రష్యాకు అపారమైన అనుభవం ఉంది.

అంత ప్రమాదం లేదు

ఈ విద్యుత్‌ కేంద్రంలో చివరి అణు రియాక్టర్‌ను 2000లో మూసివేశారు. దీంతో పెద్దగా ప్రమాదం లేదనే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు అక్కడ అణువ్యర్థాలు మాత్రమే పేరుకుపోయి ఉన్నాయి. వీటి కోసం 32 కిలోమీటర్ల దూరం వరకు జనావాస ప్రాంతాలు లేకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో ఈ వ్యర్థాల నుంచి వచ్చే రేడియేషన్‌ ప్రభావం కూడా పరిమిత స్థాయిలకు లోబడే ఉందని, అందువలన ప్రజలకు పెద్దగా ముప్పు లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఊహించని ఉక్రెయిన్‌

చెర్నోబిల్‌పై పుతిన్‌ సైన్యం మెరుపుదాడి చేస్తుందని ఉక్రెయిన్‌ అంచనా వేయలేదు. అందుకే సైన్యాన్ని ఎక్కువగా రష్యాతో సరిహద్దుల్లోనే మోహరించింది. తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతంలో కేంద్రీకరించింది. ఇది రష్యాకు కలిసివచ్చింది. విన్యాసాల పేరుతో వచ్చిన రష్యా దళాలు బెలారస్‌ నుంచి విరుచుకుపడ్డాయి. ఈ అణువిద్యుత్‌ కేంద్రం చుట్టు 32 కి.మీ వ్యాసార్థంలో ఉన్న ప్రాంతాన్ని ఎక్స్‌క్లూజివ్‌ జోన్‌గా ప్రకటించారు. అక్కడ సైనిక కార్యకలాపాల కోసం ఉక్రెయిన్‌కు అవకాశం లేదు. ఇది కూడా పుతిన్‌ సేనలకు కలిసొచ్చింది.

ఇవీ చూడండి:

'నాటోలోని ప్రతి అంగుళం భూభాగాన్ని కాపాడుకుంటాం'

'అధికారాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి'.. ఉక్రెయిన్​ సైన్యానికి పుతిన్‌ పిలుపు

రష్యా చేతికి ఉక్రెయిన్​ ఎయిర్​పోర్ట్​- 1000 మంది సైనికులు మృతి

ABOUT THE AUTHOR

...view details