తెలంగాణ

telangana

ETV Bharat / international

యుద్ధం ఎలా ముగిద్దాం?.. రాజీమార్గాలపై పుతిన్‌ మల్లగుల్లాలు! - రష్యా

Russia Ukraine War: ఉక్రెయిన్​లో యుద్ధాన్ని ఏ విధంగా ముగించాలనే అంశమై రష్యా అధ్యక్షుడు పుతిన్ మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. స్వదేశంలో తన రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా యుద్ధం ముగింపునకు రాజీసూత్రాన్ని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.

russia ukraine war
russia ukraine latest news

By

Published : Mar 19, 2022, 5:26 AM IST

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇప్పుడు దాన్ని ఏ రూపంలో ముగించాలనే దానిపై మథనం సాగిస్తున్నారు. యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతుండడం వల్ల.. రష్యా ఆయుధగారాలు నిండుకుంటున్నాయని, సైనికులు అలసిపోతున్నారని వార్తలు వస్తున్న తరుణంలో- స్వదేశంలో తన రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా యుద్ధం ముగింపునకు ఆయన భిన్నమార్గాలను అన్వేషిస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి. అందులో భాగంగా చర్చలపై ఎక్కువగా దృష్టిపెడుతూ.. రాజీసూత్రాన్ని ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌, ఇతర ప్రపంచదేశాలను భయపెట్టడానికి మధ్యమధ్యలో అణుబూచినీ చూపుతున్నారు.

ఉక్రెయిన్‌ను మూడువైపుల నుంచి చుట్టుముట్టి.. ముప్పేట దాడి సాగిస్తున్నప్పటికీ.. కీలక ప్రాంతాలు ఇప్పటికీ రష్యా గుప్పిట్లోకి రాలేదు. రాజధాని కీవ్‌ నగరం చుట్టూ వారం నుంచి రష్యా దళాలు తిష్ఠవేశాయి. అయినా ఉక్రెయిన్‌ సేనలు వారిని ముందడుగు వేయకుండా నిలువరిస్తున్నాయి. సైనిక చర్య సాఫీగానే సాగుతున్నట్లు పుతిన్‌ బయటికి చెబుతున్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో వేగం లోపించడం ఆయనను అసహనానికి గురిచేస్తోందని అంటున్నారు. అందుకే ఏదోలా యుద్ధాన్ని త్వరగా ముగించాలనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు.

.

నాడు స్టాలిన్‌..

1940ల్లో బలప్రయోగం ద్వారా ఫిన్లాండ్‌ను తన ప్రావిన్స్‌గా మార్చుకునేందుకు నాటి సోవియట్‌ యూనియన్‌ నేత జోసెఫ్‌ స్టాలిన్‌ ప్రయత్నం చేశారు. ఫిన్లాండ్‌వాసులు నాడు పెట్రోలు బాంబులు వంటి ఆయుధాలతో సోవియట్‌ సేనను అడ్డుకున్నారు. దీంతో స్టాలిన్‌ బలగాలు వెనుదిరిగాయి. నాటి పరిణామాన్ని.. పుతిన్‌ నేడు సాగిస్తున్న యుద్ధంతో విశ్లేషకులు పోల్చి చూస్తున్నారు.

మారిన జెలెన్‌స్కీ

రష్యా మాజీ గూఢచారి అయిన పుతిన్‌ ముందు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మొదట్లో బలహీన రాజకీయ నాయకుడిగా కనిపించారు. అయితే యుద్ధం మొదలయ్యాక జెలెన్‌స్కీ తన నటన అనుభవాన్ని ఉపయోగించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టడంలో సఫలమయ్యారు. సైనిక సాయం కోసం నాటోకు విజ్ఞప్తులు చేయడంలో గానీ ఆ కూటమి తీరును గర్హించడంలో గానీ ఆయన కరాఖండీగా వ్యవహరిస్తున్నారు. రష్యా శతఘ్ని దాడులు కొనసాగుతున్నప్పటికీ ఆయనతో చర్చలు సాగించడానికి ముగ్గురు ప్రధానులు రైలు ప్రయాణం చేయడం గమనార్హం.

ఉక్రెయిన్‌ చుట్టూ నాటో కంచె

జెలెన్‌స్కీ ప్రయత్నాలతో ఉక్రెయిన్‌ సైనిక దళాలకు నిధులు, మందుగుండు సామగ్రి సమకూరుతున్నాయి. అమెరికా మధ్యవర్తిత్వం ద్వారా పోలండ్‌ తన వద్ద ఉన్న మిగ్‌ యుద్ధవిమానాలను ఇవ్వజూపింది. ఐరోపా తూర్పు భాగంలో నాటో భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. ఐరోపాలోని వేల మంది సైనికులను అప్రమత్తం చేసింది. మరోవైపు ఉక్రెయిన్‌కు 80 కోట్ల డాలర్ల తాజా ఆర్థిక సాయానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సమ్మతి తెలిపారు. ఇప్పటికే లక్ష మందికిపైగా అమెరికా బలగాలు ఐరోపాలో మోహరించి ఉన్నారు. వీరిలో 40 వేల మంది నేరుగా నాటో పరిధిలో పనిచేస్తున్నారు. మొత్తంమీద ఉక్రెయిన్‌కు సాయం అందించడంలో ఈ కూటమి చాలా చురుగ్గా వ్యవహరిస్తోంది.

చైనాపై ఆధారపడితే ముప్పే

ఐరోపా, అమెరికా, జపాన్‌లు రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షల ప్రభావం కనిపించడం మొదలైంది. ఈ నేపథ్యంలో చైనా అంగ, అర్థ బలంపై ఆధారపడాల్సిన పరిస్థితులు రష్యాకు తలెత్తేలా ఉన్నాయి. ఇదే జరిగితే స్వదేశంలో పుతిన్‌ ప్రతిష్ఠ మసకబారడం ఖాయం. ఇప్పటికే రష్యాలో ఆయనకు వ్యతిరేకంగా నిరసన స్వరాలు పెరుగుతున్నాయి.

కిం కర్తవ్యం?

ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం నుంచి గౌరవంగా బయటపడటం పుతిన్‌కు అవసరం. అయితే అది తన రాజకీయ జీవితానికి గొడ్డలిపెట్టు కాకుండా జాగ్రత్త వహిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఆయన రాజీ సూత్రాన్ని తెరపైకి తెచ్చారు. ఇందులో.. నాటో, ఐరోపా సంఘంలో ఉక్రెయిన్‌ సభ్యత్వం ప్రధానాంశంగా ఉంది. 2014లో రష్యా ఆక్రమించిన క్రిమియా, ఇటీవల స్వతంత్ర రిపబ్లిక్‌లుగా పుతిన్‌ గుర్తించిన దొనెట్స్క్‌, లుహాన్స్క్‌లు, తాజాగా ఆక్రమించిన ప్రాంతాల భవిత కూడా చర్చల్లో నలుగుతున్నట్లు తెలుస్తోంది.

ఉక్రెయిన్‌కు నాటో, ఈయూ నో!

ఈయూ, నాటోలో చేరాలని ఉక్రెయిన్‌ ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. కానీ అటువైపు నుంచి ఉక్రెయిన్‌ ఆశించిన ఫలితం రావట్లేదు. ఈయూ, నాటోల్లో ఉక్రెయిన్‌ చేరకూడదన్నదే పుతిన్‌ డిమాండ్‌. ఇప్పుడు ఉక్రెయిన్‌ వాటిలో చేరకపోతే.. పుతిన్‌ యుద్ధాన్ని ఆపేయొచ్చు.

ఆస్ట్రియా తరహాలో తటస్థంగా ఉండే 'నిస్సైనిక ఉక్రెయిన్‌' కోసం తొలుత పట్టుబట్టిన రష్యా.. ఇప్పుడు దీనిపై గట్టిగా ఒత్తిడి చేయడం లేదు. తటస్థంగా ఉండేందుకు ఉక్రెయిన్‌ సిద్ధంగానే ఉందని, అయితే తన జాతీయ సైన్యాన్ని కొనసాగిస్తామని చెబుతున్నట్లు రష్యా పేర్కొంది. అలాగే తమ భద్రతపై చట్టబద్ధమైన పూచీకత్తులు, ఒప్పందాలు ఉండాలని ఉక్రెయిన్‌ పట్టుబడుతున్నట్లు వివరించింది. దీనికి రష్యా సమ్మతించే అవకాశం కనిపిస్తోంది.

యుద్ధం నుంచి వైదొలగాలన్న రష్యా ఉద్దేశాలను కనిపెట్టిన ఉక్రెయిన్‌ బేరసారాలు ఆడుతున్నట్లు కనిపిస్తోంది. తమ దేశం నుంచి వైదొలగాలని రష్యాకు స్పష్టం చేస్తోంది.

ఇదీ చూడండి:ఉక్రెయిన్​పై రష్యా ముప్పేట దాడి.. ఇళ్లు, ఆస్పత్రులపైనా!

ABOUT THE AUTHOR

...view details