ఉక్రెయిన్- రష్యా ఉద్రిక్తతల మధ్య చైనా తన వైఖరిని తెలియజేయాలని శ్వేతసౌథం ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి అన్నారు.
రష్యా ఆర్థికవ్యవస్థను దెబ్బతీసేలా అమెరికా కఠిన ఆంక్షలు - russia ukraine war news
05:07 February 25
05:02 February 25
ఉక్రెయిన్ అంశంలో రష్యాను కట్టడి చేసేందుకు 'స్విఫ్ట్' (సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలి కమ్యూనికేషన్ సిస్టమ్) నుంచి రష్యాను బయటకు పంపాలన్న సూచనలపై అమెరికా స్పందించింది. 'స్విఫ్ట్'పై ఆంక్షలు అనే ఆప్షన్ ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపింది. యూరోప్ అప్పడే దీనిపై నిర్ణయం తీసుకోదని అభిప్రాయపడింది అమెరికా.
'స్విఫ్ట్' నుంచి రష్యాను బయటకు పంపిస్తే.. రష్యా అంతర్జాతీయ వాణిజ్యంలో సమస్యలు తలెత్తి ఆర్థిక వ్యవస్థపై పెనుప్రభావం పడే ప్రమాదం ఉంది.
04:11 February 25
ఉక్రెయన్లోకి సైన్యాన్ని పంపడాన్ని నిరసిస్తూ రష్యాలోని పలు నగరాల్లో నిరసనలు చేపట్టిన దాదాపు 1700 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
02:18 February 25
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మాట్లాడారు. ఉక్రెయిన్‌లోని పరిస్థితులు, వాటి పరిణామాలపై ఇరు దేశాల నేతలు చర్చించారు.
00:34 February 25
పుతిన్ ఆక్రమణదారు.. మరో 4 బ్యాంకులపై ఆంక్షలు..
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య జరపడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పుతిన్‌ను ఆక్రమణదారుగా అభివర్ణించారు బైడెన్. పుతిన్ యుద్ధాన్ని ఎంచుకున్నాడని.. తదుపరి పరిణామాలకు రష్యా బాధ్యత వహించాలని అన్నారు.
పుతిన్.. సోవియేట్ యూనియన్‌ను తిరిగి స్థాపించాలనుకుంటున్నారని బైడెన్ అన్నారు. ఉక్రెయిన్ అంశంపై భారత్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.
" పుతిన్ ఆక్రమణదారుడు. ఆయన చర్చలు యుద్ధాన్ని ఎంచుకున్నారు. అమెరికాపై రష్యా ఏమైనా సైబర్ దాడులు జరిపితే స్పందించేందుకు సిద్ధంగా ఉన్నాం. నాటో దేశాలకు అమెరికా సైన్యాన్ని పంపించనున్నాం. యూరోప్ దేశాలకు ఇదొక ప్రమాదకరమైన చర్య. పుతిన్.. సోవియేట్ యూనియన్‌ను తిరిగి స్థాపించాలనుకుంటున్నారు. అంతర్జాతీయ సమాజానికి పుతిన్ ఆలోచనలు విరుద్ధంగా ఉన్నాయి.
-- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
రష్యాకు చెందిన మరో 4 బ్యాంకులపై అమెరికా ఆంక్షలు విధించినట్లు చెప్పారు బైడెన్. పుతిన్‌తో మాట్లాడాలన్న ఆలోచన లేదని తెలిపారు.
23:36 February 24
పుతిన్‌పై చెరగని ముద్ర..
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టిన క్రమంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక వ్యాఖ్య లు చేశారు. ఉక్రెయిన్‌లో రక్తపాతం పుతిన్‌పై చెరగని ముద్రగా ఉంటుందని అన్నారు. ఈ మేరకు పార్లమెంట్లో జాన్సన్ ప్రసంగించారు.
బ్రిటన్‌లోని ఆర్థిక లావాదేవీలనుంచి రష్యాకు చెందిన బ్యాంకులను తొలగించినట్లు చెప్పారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్దమవుతున్నట్లు పేర్కొన్నారు జాన్సన్.
23:23 February 24
ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ ప్లాంట్ రష్యా అధీనంలోకి..
ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు రియటర్స్ మీడియా పేర్కొంది. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయంలోని ఓ సలహాదారు వెల్లడించినట్లు స్పష్టం చేసింది.
1986లో.. ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన అణు విపత్తు చోటుచేసుకుంది ఇక్కడే.
21:47 February 24
ఉక్రెయిన్ పరిణామాలపై బైడెన్ భేటీ
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టిన క్రమంలో ఇప్పటికే ఆంక్షలు విధించిన అమెరికా.. మరిన్ని చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శ్వేతసౌధంలో జాతీయ భద్రతా మండలి సమావేశం నిర్వహించారు అధ్యక్షుడు జో బైడెన్. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి.
కీవ్‌లో కర్ఫ్యూ..
కీవ్‌లోని గోస్టొమెల్ విమానాశ్రయాన్ని రష్యా దళాలు అధీనంలోకి తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియో వెల్లడించింది. మరోవైపు.. విమానాశ్రయం వద్ద 3 రష్యా హెలికాప్టర్లు కూలిపోయినట్లు ఉక్రెయిన్ తెలిపింది. అలాగే.. కీవ్‌లో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆ నగర మేయర్ ప్రకటించారు.
జీ7 దేశాలు సిద్ధం..
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగిన క్రమంలో గ్యాస్ సహా ఇంధన సరఫరాలపై ప్రభావం పడనుందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే గ్యాస్, చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో.. ఇంధన సరఫరా అంతరాయాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీ7 దేశాలు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాయి.
21:31 February 24
పుతిన్‌తో మాట్లాడనున్న మోదీ.. అధికారిక ప్రకటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మరికాసేపట్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడనున్నట్లు తెలిపారు విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా. ఉక్రెయిన్‌లో తలెత్తుతున్న పరిస్థితులను ఎదుర్కోవడానికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
" మేము ఒక నెల క్రితం ఉక్రెయిన్‌లో భారతీయ పౌరుల రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించాము. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఆధారంగా, 20,000 మంది భారతీయులు అక్కడ ఉన్నారని తెలిసింది. కాసేపట్లో పుతిన్‌తో ప్రధాని మోదీ మాట్లాడతారు. విద్యార్థులు సహా పౌరుల భద్రతే ప్రాధాన్యమని ప్రధాని చెప్పారు. ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులు అందరితో మాట్లాడుతున్నాం. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని కొన్ని వర్సిటీలను కోరాం. ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితి ఉన్నచోట జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల ఉక్రెయిన్ నుంచి 4 వేల మంది తరలి వచ్చారు."
- హర్షవర్ధన్ ష్రింగ్లా, విదేశాంగ శాఖ కార్యదర్శి.
21:27 February 24
చెర్నోబిల్ ప్లాంట్ స్వాధీనం కోసం యత్నం..
చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్‌ను రష్యా బలగాలు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు. 1986లో.. ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన అణు విపత్తు చోటుచేసుకుంది ఇక్కడే.
21:00 February 24
రాత్రి 11 గంటలకు జో బైడెన్ కీలక ప్రకటన..
ఉక్రెయిన్ వ్యవహారంపై రాత్రి 11 గంటలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేయనున్నారు. ఉక్రెయిన్‌పై అకారణంగా యుద్ధం చేస్తోందంటూ ఆయన ఇప్పటికే రష్యాపై మండిపడ్డారు. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కూడా చర్చించిన బైడెన్.. ఆ దేశానికి తమ సహాయ సహకారాలు కొనసాగుతాయంటూ భరోసా కూడా ఇచ్చారు.
20:08 February 24
రష్యా-ఉక్రెయిన్ పరిణామాలపై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష
రష్యా, ఉక్రెయిన్ మధ్య తలెత్తిన పరిణామాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. యుద్ధ పరిణామాలు, భారత్‌పై తక్షణ ప్రభావం, చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
ఈ సమీక్షలో హోంశాఖ, రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖ మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారు సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
19:54 February 24
ఉక్రెయిన్‌లో 70 సైనిక స్థావరాలు ధ్వంసం: రష్యా
ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేపడుతోంది రష్యా సైన్యం. సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేస్తున్నట్లు చెబుతున్న రష్యా.. తాజాగా ఉక్రెయిన్‌లోని 70 సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది రష్యా. ధ్వంసం చేసిన వాటిలో 11 ఎయిర్ ఫీల్డ్స్ కూడా ఉన్నట్లు తెలిపింది.
19:40 February 24
'రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడనున్న మోదీ'
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగి విధ్వంసం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. గురువారం రాత్రి పుతిన్‌తో మోదీ చర్చలు జరిపనున్నారని చెప్పాయి.
18:32 February 24
కీవ్ సమీపంలో కూలిన ఉక్రెయిన్ మిలిటరీ విమానం
ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం దాడులు కొనసాగుతున్నాయి. ఆ దేశ సైనిక స్థావరాలు, సైన్యం లక్యంగా దాడులు చేపడుతోంది రష్యా. ఈ క్రమంలో ఉక్రెయిన్‌కు మిలిటరీకి చెందిన ఓ యుద్ధ విమానం రాజధాని కీవ్‌కు సమీపంలో కూలిపోయింది. అందులో 14 మంది ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
17:36 February 24
భారత పౌరులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు: రాజ్‌నాథ్
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత పౌరులు, విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. భారత్ ఎప్పుడు శాంతిని కోరుకుంటుందని, ఎలాంటి పరిస్థితులు యుద్ధానికి దారితీయకూడదన్నారు.
17:01 February 24
ఉక్రెయిన్ రక్షణ శాఖ కార్యాలయంపై దాడి
ఉక్రెయిన్ రాజధాని కివీలోని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ విభాగంపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. రక్షణ శాఖ భవనం నుంచి దట్టమైన పొగ వెలువడుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి.
16:56 February 24
ఉక్రెయిన్‌లో ఉద్రిక్తంగా పరిస్థితులు: భారత రాయబారి
ఉక్రెయిన్‌లో పరిస్థితిలు అత్యంత ఉద్రిక్తంగా ఉన్నాయని, ఇది చాలా ఆందోళన కలిగిస్తోందన్నారు ఉక్రెయిన్‌లోని భారత రాయబారి. వాయు స్థావరాలు మూసివేశారని, రైల్వేలు నడిచే పరిస్థితులు కనిపించటం లేదని, రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్ నిలిచిపోయినట్లు చెప్పారు. ఉక్రెయిన్‌లోని పౌరులు శాంతియుతంగా ఉండాలని, పరిస్థితులను ధైర్యంతో ఎదుర్కోవాలని సూచించారు. కివీలోని భారత రాయబార కార్యాలయం తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌లోని భారత సంతతి ప్రజలను కలిసి.. భారతీయులకు సాయంగా నిలవాలని కోరినట్లు చెప్పారు రాయబారి.
16:45 February 24
ఉక్రెయిన్, రష్యా సరిహద్దుల్లోకి అదనపు బలగాలు: నాటో
ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించిన క్రమంలో అప్రమత్తమైంది నాటో. ఉక్రెయిన్, రష్యాకు సమీపంలోని తూర్పు ప్రాంతంలోని సరిహద్దుల్లో బలగాలను భారీగా పెంచేందుకు నాటో అంగీకారం తెలిపింది. ఉపరితల, వాయు, సముద్ర ప్రాంతాల్లో బలగాలను పెంచున్నాయి నాటో దేశాలు.
" భాగస్వామ్య దేశాల్లోని తూర్పు ప్రాంతంలో అదనంగా సరిహద్దు భద్రతా దళాలు, వాయుసేనలతో పాటు నౌకాదళాలను మోహరించనున్నాం. ఎలాంటి ఆకస్మిక దాడులు జరిగినా వెంటనే స్పందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం."
- నాటో రాయబారి.
నాటోలోని 30 సభ్య దేశాలు ఇప్పటికే ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు ఇతర సామగ్రిని ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తున్నాయి. అయితే, ఉక్రెయిన్‌కు మద్దతుగా నాటో దళాలు ఎలాంటి మిలిటరీ చర్యలు చేపట్టలేదు. ఉక్రెయిన్‌కు అత్యంత సన్నిహత భాగస్వామి అయినప్పటికీ... యుద్ధంలో పాల్గొనే ఆలోచనలో లేదు నాటో.
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభానికి సమీపంలో దేశాలు ఇస్టోనియా, లాట్వియా, లుథువేనియా, పోలాండ్‌లు ఉన్నాయి. తమ దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు నాటోలోని ఆర్టికల్ 4 ప్రకారం చర్యలు చేపట్టాయి.
శుక్రవారం నాటో నేతల భేటీ
ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దాడులను తీవ్రంగా ఖండించింది నాటో. వెంటనే సైనిక చర్యను ఆపి.. ఉక్రెయిన్ నుంచి బలగాలను వెనక్కి రప్పించాలని రష్యాకు సూచించారు నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెంన్బెర్గ్. నిరంకుశత్వం కంటే ప్రజాస్వామ్యం, అణచివేతపై స్వేచ్ఛ ఎల్లప్పుడూ బలంగా ఉంటుందన్నారు.
" మా గగనతలాన్ని కాపాడేందుకు 100కుపైగా యుద్ధ విమానాలు సిద్ధంగా ఉన్నాయి. ఉత్తర భాగం నుంచి మధ్య సముద్రం వరకు 120 వరకు యుద్ధ నౌకలు పహారా కాస్తున్నాయి. దాడుల నుంచి మా భాగస్వామ్య దేశాలను కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపడతాం. నాటో నాయకులు శుక్రవారం భేటీ కానున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. ఉక్రెయిన్ పట్ల నాటో సానుభూతి తెలుపుతోంది. రష్యాపై నాటో దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఆర్థిక పరమైన ఆంక్షలు విధించేందుకు ఈయూ సహా ఇతర అంతర్జాతీయ భాగస్వామ్యాలతో నాటో చర్చలు జరుపుతోంది. రష్యా చర్యలను కలిసికట్టుగా ఖండిస్తున్నాం. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించటాన్ని మేము ఆమోదించటం లేదనే సందేశాన్ని మా బలగాలు పంపిస్తున్నాయి. "
- నాటో సెక్రెటరీ జనరల్
నాటో భాగస్వామ్య దేశాలు ఉక్రెయిన్‌కు సైనిక పరంగానూ, భౌతికంగానే మద్దతుగా నిలిచి బలంగా తయారయ్యేందుకు సాయపడ్డాయన్నారు సెక్రెటరీ జనరల్. 2014తో పోలిస్తే.. ఇప్పుడు ఉక్రెయిన్ బలంగా ఉందన్నారు.
16:28 February 24
రష్యా-ఉక్రెయిన్ పరిణామాలపై ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష
రష్యా, ఉక్రెయిన్ పరిణామాలపై ఉన్నతస్థాయి సమీక్ష జరపనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్ పర్యటనలో ఉన్న మోదీ.. దిల్లీ చేరిన తర్వాత సమీక్ష జరపనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ సమీక్షలో హోంశాఖ, రక్షణ, ఆర్థిక శాఖ మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారు సహా ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. తాజా పరిస్థితులు, చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం.
15:41 February 24
'దేశాన్ని రక్షించాలనుకుంటున్న వారికి ఆయుధాలు ఇస్తాం'
ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తున్న క్రమంలో ఆ దేశ అధ్యక్షుడు వొలిదిమిర్ జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని రక్షించాలనుకుంటున్న పౌరులు ఎవరికైనా.. ఆయుధాలు ఇస్తామని ప్రకటించారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
15:28 February 24
రష్యాతో దౌత్య సంబంధాలను తెంచుకున్న ఉక్రెయిన్
తమ దేశంపై యుద్ధానికి దిగిన రష్యాపై ప్రతీకార చర్యలు చేపట్టింది ఉక్రెయిన్. రష్యాతో ఉన్న దౌత్య సంబంధాలను తెంచుకుంటున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
15:15 February 24
50 మంది రష్యా ఆక్రమణదారుల హతం: ఉక్రెయిన్ సైన్యం
తమ దేశంపై దాడులకు పాల్పడుతున్న రష్యాను తమదైన తీరులో ప్రతిఘటిస్తోంది ఉక్రెయిన్ సైన్యం. ఇప్పటికే పలు యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ప్రకటించగా.. తాజాగా 50 మంది రష్యా ఆక్రమణదారులను హతమార్చినట్లు తెలిపింది. మరోవైపు.. రష్యా దాడుల్లో 40 మంది ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని, 10మంది పౌరులు మృతి చెందినట్లు, పదుల సంఖ్యలో గాయపడినట్లు ఆ దేశ అధ్యక్షుడి కార్యాలయం సలహాదారు ప్రకటించారు.
15:06 February 24
లుథువేనియాలో ఎమర్జెన్సీ..
ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తున్న క్రమంలో ఆ దేశ సరిహద్దుల్లోనే ఉన్న లుథువేనియా అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు గీతానాస్ నైసిదా ప్రకటించారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
14:43 February 24
భారత్ సంపూర్ణ మద్దతు కోరుతున్నాం: ఉక్రెయిన్
సంక్షోభం సమయంలో భారత్ నుంచి సంపూర్ణ మద్దతు కోరుతున్నామని ఉక్రెయిన్ పేర్కొంది. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు భారత్ మద్దతు ఇవ్వాలన కోరుతున్నట్లు చెప్పారు ఆ దేశ రాయబారి ఇగోర్ పొలిఖా. తక్షణమే యుద్ధం నిలువరించే దిశగా భారత్ చర్యలు తీసుకోవాలి కోరారు. సంక్షోభ పరిష్కారానికి భారత ప్రధాని ముందుకు రావాలన్నారు.
" రష్యా ఏకపక్ష దాడిని ప్రపంచ దేశాలు ఖండించాలి. భారత ప్రధాని తన పలుకుబడితో రష్యా దాడిని నిలువరించాలి. సంక్షోభ వేళ భారత్ అండగా నిలవాలి. జరుగుతున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది. జపాన్ సహా పలు దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటించాయి. పరిస్థితులు క్షీణిస్తున్నందున ఉక్రెయిన్‌కు భారత్ మద్దతు ఇవ్వాలి. రష్యాతో భారత్‌కు సత్సంబంధాలు ఉండవచ్చు.. కానీ, సంక్షోభ సమయంలో ఉక్రెయిన్‌కు భారత్ అండగా నిలవాలి. శక్తిమంత నేతల్లో ఒకరైన మోదీ.. సమస్య పరిష్కారానికి కృషి చేయాలి."
- ఇగోర్ పొలిఖా, భారత్‌లో ఉక్రెయిన్ రాయబారి.
మోదీ పలుకుబడితో పరిస్థితులను చక్కదిద్దేందుకు యత్నించాలని కోరారు ఇగోర్ పొలిఖా. ఉక్రెయిన్ ప్రజలకు భరోసా ఇచ్చేలా మోదీ చొరవ చూపాలన్నారు. అన్ని విషయాలను భారత ప్రభుత్వ పెద్దలతో చర్చించినట్లు చెప్పారు. సంక్షోభ వేళ భారత వ్యవహారశైలి అసంతృప్తి కలిగిస్తోందన్నారు.
14:16 February 24
క్రిమియా నుంచి ప్రవేశించిన దళాలు
రష్యా సైన్యం అన్ని వైపుల నుంచి ఉక్రెయిన్‌పైకి దండెత్తుతోంది. ఇప్పటికే బెలారస్ నుంచి రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోకి ప్రవేశించగా.. తాజాగా క్రిమియా నుంచి దాడి చేశాయి. రష్యా సైనిక వాహనాలు ఉక్రెయిన్‌లోకి ప్రవేశించడం సెక్యూరిటీ కెమెరాల్లో నిక్షిప్తమైంది.
క్రిమియాను 2014లో రష్యా ఆక్రమించుకుంది.
14:08 February 24
రష్యా తమపై దండయాత్ర చేస్తున్న నేపథ్యంలో ఆయుధం పట్టుకోగలవారు ఎవరైనా భూభాగ రక్షణ దళాల్లో చేరవచ్చని ఉక్రెయిన్ రక్షణమంత్రి ప్రకటించారు.
13:35 February 24
RUSSIA UKRAINE WAR: రష్యా దళాల దాడుల్లో కనీసం ఏడుగురు చనిపోయారని ఉక్రెయిన్ ప్రకటించింది. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించింది.
మరోవైపు, లుహాన్స్క్ ప్రాంతంలోని రెండు పట్టణాలు రష్యా మద్దతు ఉన్న వేర్పాటువాదుల చేతుల్లోకి వెళ్లాయి.
12:37 February 24
భారతీయులూ.. జాగ్రత్త..
రష్యా దాడుల నేపథ్యంలో.. ఉక్రెయిన్‌లోని భారతీయులను కేంద్రం అప్రమత్తం చేసింది. ఆ దేశంలో తీవ్ర అనిశ్చితితో కూడిన పరిస్థితులు ఉన్నాయని.. ఉక్రెయిన్‌లో ప్రజలు తాము ఉన్న స్థలాల్లోనే ఉండాలని సూచించింది. ఇళ్లు, వసతిగృహాలు, శిబిరాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం సూచనలు చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు వస్తున్న ప్రజలు వెనక్కి మళ్లాలని పేర్కొంది.
12:12 February 24
గమనిస్తున్నాం: భారత్
రష్యా-ఉక్రెయిన్‌లో జరుగుతున్న పరిణామాలపై భారత్ స్పందించింది. త్వరితగతిన మారిపోతున్న పరిస్థితులను క్షుణ్ణంగా గమనిస్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి.
11:49 February 24
తీవ్రస్థాయికి యుద్ధం..
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రంగా మారింది. ఉక్రెయిన్ ఎయిర్‌బేస్‌లను, గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించింది.
మరోవైపు, రష్యాకు చెందిన ఐదు విమానాలను లుహాన్స్క్ ప్రాంతంలో కూల్చేసినట్లు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. ఓ హెలికాప్టర్‌ను సైతం నేలకూల్చినట్లు వెల్లడించింది.
11:45 February 24
విమానాల కూల్చివేత
రష్యాకు చెందిన ఐదు విమానాలను లుహాన్స్క్ ప్రాంతంలో కూల్చేసినట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. ఓ హెలికాప్టర్‌ను సైతం నేలకూల్చినట్లు తెలిపింది.
11:37 February 24
ఉక్రెయిన్‌లోకి ప్రవేశించిన రష్యా సైన్యం
ఉక్రెయిన్‌లోకి రష్యా సైన్యం చొరబడింది. బెలారస్ నుంచి రష్యా దళాలు దేశంలోకి ప్రవేశించాయని ఉక్రెయిన్ సరిహద్దు రక్షణ ఏజెన్సీ ప్రకటించింది.
11:09 February 24
ప్రపంచ దేశాలు రష్యాను అడ్డుకోవాలి: ఉక్రెయిన్
ఉక్రెయిన్ తనను తాను రక్షించుకొని, విజయం సాధిస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి దిముత్రో కులేబా పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పూర్తి స్థాయి ఆక్రమణ ప్రారంభించారని చెప్పారు. శాంతియుతంగా ఉండే ఉక్రెయిన్ నగరాలు దాడులకు గురవుతున్నాయని అన్నారు.
"ఇది ఆక్రమణ ధోరణితో కూడిన యుద్ధం. రష్యాను ప్రపంచ దేశాలు అడ్డుకోగలవు.. అడ్డుకోవాలి. ఇది పని చేయాల్సిన సమయం. ప్రపంచ దేశాలు సత్వరమే చర్యలు తీసుకోవాలి. తీవ్రమైన, విధ్వంసకరమైన ఆంక్షలు రష్యాపై విధించాలి. అన్ని రకాలుగా రష్యాను ఏకాకిని చేయాలి. ఉక్రెయిన్‌కు ఆర్థిక, సైనిక, మానవతా పరంగా సాయం చేయాలి."
-దిముత్రో కులేబా, ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రి
10:41 February 24
ఉక్రెయిన్‌లో జనావాసాలపై తాము దాడులు చేయడం లేదని రష్యా సైన్యం ప్రకటించింది. ఉక్రెయిన్ ఎయిర్‌బేస్‌లు, సైనిక స్థావరాలు, ఇతర ఆస్తులనే టార్గెట్ చేసినట్లు తెలిపింది.
మరోవైపు, ఉక్రెయిన్ అధ్యక్షుడు దేశంలో మార్షల్ లా విధించారు. పౌరులెవరూ ఆందోళన చెందవద్దని అన్నారు.
10:37 February 24
ఉక్రెయిన్ గగనతలం మూసివేత.. విమాన ప్రయాణాలు బంద్
రష్యా యుద్ధం ప్రారంభించిన నేపథ్యంలో.. దేశంలోని తూర్పున ఉన్న నగరాల్లో ఎయిర్‌పోర్టులను మూసివేసింది ఉక్రెయిన్. పౌర విమాన ప్రయాణాల కోసం గగనతల వినియోగాన్ని నిషేధించింది. తూర్పు ఉక్రెయిన్‌లోని గగనతలాన్ని డేంజర్ జోన్‌గా ప్రకటించింది. రష్యా పలు నగరాలపై దాడులతో విరుచుకుపడుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు, ఉక్రెయిన్‌లోని భారత విద్యార్థులను తీసుకొచ్చేందుకు ఎయిర్ఇండియా విమానం దిల్లీ నుంచి బయల్దేరింది. ఉదయం 7.30 గంటలకు ఇందిరా గాంధీ విమానాశ్రయం నుంచి బయల్దేరి వెళ్లింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని బోరిస్పిల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇది చేరుకోవాల్సి ఉంది.
గగనతలాన్ని మూసేస్తున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించిన నేపథ్యంలో.. విమానాన్ని వెనక్కి పిలవాలా? లేదా ప్రయాణాన్ని కొనసాగించాలా? అని భారత అధికారులు చర్చిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
అదేసమయంలో, కీవ్ నుంచి బయల్దేరిన ఓ విమానం గురువారం ఉదయం 7.45 గంటలకు దిల్లీలో ల్యాండ్ అయింది. 182 మంది భారతీయులు ఈ విమానంలో స్వదేశానికి చేరుకున్నారు. ఇందులో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు.
10:19 February 24
ఉద్రిక్తతలు తగ్గించాలని భారత్ పిలుపు
రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే దిశగా వెంటనే చర్యలు చేపట్టాలని భారత్ పిలుపునిచ్చింది. ఈ పరిస్థితి భారీ విపత్తుగా పరిణమించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఉక్రెయిన్‌పై దాడిని ఖండించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఇది అన్యాయమైన, ప్రేరేపిత దాడి పేర్కొన్నారు. దీనికి రష్యాను బాధ్యులను చేస్తున్నట్లు చెప్పారు. ఈ అంశానికి సంబంధించి జీ7 దేశాధినేతలతో చర్చించిన అనంతరం అమెరికా ప్రజలతో మాట్లాడతానని అన్నారు.
09:50 February 24
పేలుళ్లు..
ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగుతున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన వెంటనే రాజధాని కీవ్‌లో పేలుడు సంభవించింది. తూర్పున ఉన్న పోర్ట్ సిటీ అయిన మారియూపోల్లోనూ శక్తిమంతమైన పేలుళ్లు జరిగాయి.
మరోవైపు, ఉక్రెయిన్ పార్లమెంట్ సహా ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యాంకింగ్ వెబ్సైట్లు సైబర్ దాడులకు గురయ్యాయి. దీంతో సేవలు నిలిచిపోయాయి. గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని సైబర్ సెక్యూరిటీ నిపుణులు తెలిపారు. విధ్వంసకర మాల్వేర్ను వందలాది కంప్యూటర్లలోకి చొప్పించారని వెల్లడించారు.
09:21 February 24
లైవ్ అప్డేట్స్: రష్యా యుద్ధం
Putin declares war on Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఉక్రెయిన్‌లో సైనిక ఆపరేషన్ చేపడుతున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ నుంచి ఎదురవుతున్న ముప్పుకు స్పందనగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌పై యుద్దాన్ని ఆపాలని పుతిన్‌ను కోరారు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్. రష్యా బలగాలను ఉక్రెయిన్ నుంచి వెంటనే వెనక్కు పిలిపించాలని కోరారు.