కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్ స్పుత్నిక్ను అందుబాటులోకి తీసుకొచ్చిన రష్యా.. త్వరలోనే మరో టీకాను విడుదల చేయనుంది. తమ దేశం అతిత్వరలో రెండో టీకాను రిజిస్టర్ చేయనుందని ఆ దేశ ఎగువ సభలో వెల్లడించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.
వైరస్ను ఎదుర్కోవడంలో దేశ సామర్థ్యాన్ని అభినందించారు పుతిన్. కొవిడ్-19ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సిద్ధంగా ఉందని వెల్లడించారు.
"త్వరలోనే కరోనాకు రెండో వ్యాక్సిన్ను రిజిస్టర్ చేయనున్నాం. మహమ్మారి సమయంలో.. ఆరోగ్య కార్యకర్తల వీరోచిత పోరాటం , దేశం, సమాజం కోసం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ పోషించిన కీలక పాత్రను గుర్తించాం. కొద్ది నెలలుగా వారి సామర్థ్యం పెరుగుతూ వస్తోంది. కరోనా మహమ్మారితో పాటు కాలానుగుణ వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనేందురు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సిద్ధంగా ఉంది. "