తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యాపై కరోనా పంజా- రికార్డు స్థాయిలో కొత్త కేసులు

రష్యాలో కరోనా(Russia covid cases) విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా ఆ దేశంలో 34వేల మంది వైరస్​ బారినపడ్డారు. వైరస్ ధాటికి రష్యాలో మరో 999 మంది ప్రాణాలు కోల్పోయారు.

Russia covid cases
రష్యాలో కరోనా కేసులు

By

Published : Oct 17, 2021, 6:58 PM IST

రష్యాలో కరోనా(Russia covid cases) విలయతాండవం కొనసాగుతోంది. రోజువారీ కొత్త కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్నాయి. రష్యాలో కొత్తగా 34,303 మంది వైరస్(Corona virus in Russia) బారిన పడ్డారని అక్కడి అధికారులు ఆదివారం వెల్లడించారు. ఇది సెప్టెంబరు 19న గరిష్ఠంగా నమోదైన 20,174 కేసుల కంటే 70 శాతానికి పైగా అధికం అని చెప్పారు. వైరస్ కారణంగా మరో 999 మంది మరణించారని పేర్కొన్నారు. అంతకుముందురోజు 1,002 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

మందకొడిగా వ్యాక్సినేషన్​..

కొవిడ్ వ్యాక్సినేషన్​ను వేగవంతం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. లబ్ధిదారులకు లాటరీలు, బోనస్​లు, ప్రోత్సాహకాలు వంటివి ప్రకటిస్తున్నారు. అయినప్పటికీ.. టీకాలపై ప్రజల్లో ఉన్న అపోహల కారణంగా.. ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఇప్పటివరకు 29శాతం మందికి పూర్తి స్థాయి టీకా డోసులు(Russia Vaccination Rate) పంపిణీ చేసినట్లు రష్యా ప్రభుత్వం తెలిపింది.

దేశవ్యాప్తంగా మరోసారి కఠిన లాక్‌డౌన్‌ విధించేందుకు రష్యా ప్రభుత్వం ఇటీవల విముఖత వ్యక్తం చేయడం గమనార్హం. లాక్‌డౌన్‌ విధించే అవకాశంపై దేశంలోని ఆయా ప్రాంతాలు అక్కడి పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాయని తెలిపింది. రష్యాలోని 85 ప్రాంతాల్లో జనం గుమిగూడటంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. థియేటర్లు, రెస్టారెంట్లు వంటి ప్రదేశాల్లో పరిమిత సంఖ్యలో ప్రజలకు అనుమతి కల్పిస్తున్నారు. అయితే.. మాస్కో, సెయింట్ పీటర్స్​బర్గ్ వంటి నగరాల్లో ఎలాంటి ఆంక్షలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పటివరకు రష్యావ్యాప్తంగా దాదాపు 79 లక్షలకు మందికిపైగా కరోనా బారినపడగా.. 2,23,312 మంది మరణించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details