Russia latest news: ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో దండయాత్ర చేస్తున్న రష్యాను ప్రపంచ వేదికపై ఒంటరిగా నిలబెట్టేందుకు పశ్చిమ దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆర్థిక ఆంక్షలు విధిస్తున్న అమెరికా సహా పాశ్చాత్య దేశాలు.. 1991 సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభాన్ని రష్యాకు గుర్తు చేయాలని కృషి చేస్తున్నాయి. వీటిపై తాజాగా మరోసారి స్పందించిన రష్యా.. తాము పాశ్చాత్య దేశాలపై ఆధారపడే ఆలోచనను ఎప్పుడో కోల్పోయామని, ఇకపై అటువంటి భ్రమలకు తావులేదని పేర్కొంది. అంతేకాకుండా ప్రపంచంపై అమెరికా ఆధిపత్యాన్ని సహించేది లేదని మరోసారి స్పష్టం చేసింది.
Russia looking for northern Countries
'పశ్చిమ భాగస్వామ్య దేశాలపై ఏదో ఒకరోజు మేం ఆధారపడతామని భావిస్తే.. అటువంటి భ్రమలకు ఇక నుంచి తావులేదు. ఇప్పటికే పశ్చిమ దేశాలపై అమెరికా ఆధిపత్యం ఎక్కువయ్యింది. యూరోపియన్ యూనియన్ ఇప్పటికే చాలావరకు శక్తిహీనంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో రష్యా ఇక తూర్పు వైపు చూస్తుంది' అని రష్యా అధికారిక మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై రష్యాను ఒంటరి చేయాలని పశ్చిమదేశాలు ప్రయత్నాలు చేస్తున్న వేళ ఆయన ఇలా స్పందించారు.