రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2036 వరకు పదవిలో కొనసాగేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణపై ప్రజాభిప్రాయ సేకరణ (ప్లెబిసైట్) కోసం గురువారం పోలింగ్ ప్రారంభమైంది. వారం పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది.
ప్రధాన పోలింగ్ తేదీగా జులై 1ని నిర్ణయించినప్పటికీ రద్దీని నియంత్రించేందుకే వారం ముందుగానే ఓటింగ్ ప్రారంభించారు. ఈ ఏడాది జనవరిలోనే పుతిన్ ఈ సవరణను ప్రతిపాదించారు. ఏప్రిల్ 22న పోలింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా విపత్తు నేపథ్యంలో వాయిదా పడింది.
ప్లెబిసైట్ అజెండా ఇదే..
అధ్యక్షుడి పదవీకాలం పెంపు, పాలనలో అధ్యక్ష పదవికి మరింత ప్రాధాన్యం కల్పించడం, కార్యనిర్వాహక అధికారాల పునర్విభజన, వివాహ చట్టం సవరణలపై ప్రజలు వారి అభిప్రాయాలను ఓట్ల రూపంలో తెలపనున్నారు.