తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉక్రెయిన్​పై ఆగని రష్యా దాడులు.. బైడెన్ ఫైర్ - రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అప్​డేట్​

Russia invasion of Ukraine: ఉక్రెయిన్‌లోని నగరాలపై 14వ రోజూ రష్యా బాంబులతో విరుచుకుపడింది. తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా సేనలు చేసిన దాడిలో 10 మంది పౌరులు చనిపోయారు. సుమీపై జరిపిన వైమానిక దాడిలో ముగ్గురు చిన్నారులు సహా మరో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ దేశాలు వారిస్తున్న వినకుండా దాడి చేస్తున్న రష్యాపై ఐరోపా యూనియన్‌ మరిన్నీ ఆంక్షలకు సిద్ధమైంది. రష్యా ఎగువ సభలోని 146 సభ్యులను ఆంక్షల జాబితాలో చేర్చేందుకు అంగీకారం కుదిరినట్లు ఈయూ వర్గాలు ప్రకటించాయి. అయితే ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూలదోయటం తమ ఉద్దేశ్యం కాదని రష్యా పునరుద్ఘటించింది.

Russia invasion of Ukraine
దాడిలో దెబ్బతిన్న ఫ్లై ఓవర్​ కింద నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్నప్రజలు

By

Published : Mar 9, 2022, 10:36 PM IST

Russia invasion of Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర 14వ రోజూ కొనసాగింది. బుధవారం కూడా రష్యా వైమానిక దళాలు ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై ఫిరంగి దాడులతో విరుచుకుపడ్డాయి. తూర్పు ఉక్రెయిన్‌లోని సవెరోడొనెస్ట్క్‌పై రష్యా సైన్యం చేసిన దాడిలో 10 మంది పౌరులు మరణించారు. అర్ధరాత్రి సుమీ ప్రాంతంపై రష్యా వైమానిక దళం విరుచుకుపడగా ఈ దాడిలో ముగ్గురు చిన్నారులు సహా 22 మంది చనిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మృతుల్లో సాంబో క్రీడ ఛాంపియన్‌ అయిన 16 ఏళ్ల ఆర్టియోమ్‌ ప్రైమెంకో ఉన్నారు. మరోవైపు రష్యా ఇచ్చిన క్షిపణి దాడి హెచ్చరికలతో రాజధాని కీవ్‌తో పాటు మరో రెండు నగరాల్లో ఉక్రెయిన్‌ అధికారులు ఎయిర్‌ అలెర్ట్‌ ప్రకటించారు. ప్రజలెవరూ బంకర్లు వీడి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

రష్యాన్​ దాడుల్లో తీవ్రంగా ధ్వంసం అయిన నగరం
రష్యా బాంబు దాడులతో ప్రజలు నగరాలను వదిలి వలసపోతున్నారు.

కాల్పుల విరమణ..

మరోవైపు పౌరుల సురక్షిత తరలింపు కోసం మానవతా కారిడార్ ఏర్పాటుకు ఇరు దేశాలు అంగీకరించుకున్నాయి. కీవ్‌తోపాటు చెర్నిహివ్, సుమీ, ఖార్కివ్, మరియుపోల్, జపోరిజియా నగరాల్లో కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. 12 గంటల పాటు ఈ కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగడటంతో సుమీ నగరంలోని పౌరులను మానవతా కారిడార్ మీదుగా తరలిస్తున్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.

క్షిపణి దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిని మోసుకొస్తున్న సైనికులు
రష్యా సేనలు చేస్తున్న యుద్ధం నుంచి తప్పించునేందుకు ప్రయత్నిస్తున్న మహిళ

నీరు, ఆహారం దక్కక విలవిల..

రష్యన్‌ మిలటరీ ఖెర్సన్‌ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నట్లు ఉక్రెయిన్‌ సైన్యం వెల్లడించింది. ఆ ప్రాంతంలో ఆందోళన చేస్తున్న 400 ఉక్రెయిన్‌ పౌరులను నిర్బంధించినట్లు తెలిపింది. రష్యా స్వాధీన ప్రాంతాల్లోని శరణార్థుల పైనా రష్యా కఠినంగా వ్యవహరిస్తున్నట్లు మండిపడింది. బంకర్లలోని వారికి ఆహారం, నీరు దక్కకుండా చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేసింది.

బాంబు దాడుల్లో తన నివాసాన్ని కోల్పోయిన వ్యక్తి ఆవేదన

చట్టసభ్యులపై ఆంక్షలకు సిద్ధం..

రష్యా దుందుడుకు వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రపంచ దేశాలు ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నాయి. రష్యా ఎగువ సభలోని 146 సభ్యులను ఆంక్షల జాబితాలో చేర్చేందుకు అంగీకారం కుదిరినట్లు ఈయూ వర్గాలు ప్రకటించాయి.

రష్యా సేనలు చేస్తున్న యుద్ధం నుంచి తప్పించునేందుకు ప్రయత్నిస్తున్న మహిళ
దాడుల్లో మరణించిన వారిని మూట కడుతున్న సైనికులు

మరో 14 మందిపైనా..

రష్యా ప్రభుత్వంతో సత్సంబంధాలున్న మరో 14 మందిపైనా ఆంక్షలు విధించనున్నట్లు పేర్కొన్నాయి. ప్రపంచ దేశాల నుంచి ఆంక్షల ఎదుర్కొంటున్న జాబితాలో రష్యా తొలిస్థానంలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా జరిపిన సర్వేలో తేలింది. ఇరాన్‌, ఉత్తరకొరియా కంటే రష్యాపైనే ఎక్కువ ఆంక్షలు అమలవుతున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ వార్తా సంస్థ వెల్లడించింది.కేవలం 10 రోజుల వ్యవధిలోనే అనేక దేశాలు రష్యాపై 2వేల 700 పైగా ఆంక్షలు విధించినట్లు బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది.

బాంబు దాడుల్లో గాయపడిన వారిని తరలిస్తున్న సిబ్బంది
దాడిలో దెబ్బతిన్న ఫ్లై ఓవర్​ కింద నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్నప్రజలు

ఉక్రెయిన్​ను స్వాధీనం చేసుకోలేరు...

రష్యా స్వాధీనం చేసుకున్న చెర్నోబిల్‌ అణువిద్యుత్‌ కేంద్రానికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయినట్లు అక్కడి ఆపరేటర్‌ తెలిపారు. రష్యా దాడితో ప్లాంట్‌ పనులు పూర్తిగా నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. మరోవైపు స్వాధీనంపై స్పందించిన రష్యా ప్లాంటులో అణుబాంబుల తయారీని నిరోధించేందుకు ఆధీనంలోకి తీసుకున్నట్లు చెప్పింది.

అటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి మండిపడ్డారు. ఈ యుద్ధంలో పుతిన్‌కు ఎన్నటికీ విజయం దక్కదని అన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా సేనలు భయంకరంగా ముందుకు సాగుతుండొచ్చు కానీ ఎప్పటికీ విజయం లభించదని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లోని ఓ నగరాన్ని పుతిన్‌ స్వాధీనం చేసుకోవచ్చు గానీ దేశాన్ని మాత్రం అధీనంలోకి తీసుకోలేరని బైడెన్‌ దుయ్యబట్టారు.

ఇదీ చూడండి:ఎయిర్​ ఇండియా విమానం హైజాకర్ హతం.. పాయింట్​ బ్లాంక్​లో..

ABOUT THE AUTHOR

...view details