Russia nuclear drills: అణ్వాయుధ వ్యవస్థల అప్రమత్తతకు అధ్యక్షుడు పుతిన్ ఆదేశించిన నేపథ్యంలో రష్యా సైన్యం ఆ దిశగా సన్నాహాలను ముమ్మరం చేసింది. ఏ క్షణంలోనైనా అణుదాడికి దిగటానికి అనుకూలంగా సమాయత్తమవుతోంది. దీనిలో భాగంగా విన్యాసాల కోసం అణు జలాంతర్గాములను బేరెంట్స్ సముద్ర జలాల్లోకి తరలించారు. సైబీరియా మంచు అడవుల్లో సంచార క్షిపణి ప్రయోగ వ్యవస్థలను మోహరించారు. సముద్ర జలాల్లో నిర్వహించే విన్యాసాల్లో పలు అణు జలాంతర్గాములు పాల్గొంటాయని రష్యాకు చెందిన నార్తర్న్ ఫ్లీట్ మంగళవారం ప్రకటించడం గమనార్హం.
కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ చక్కగా పనిచేసేలా వీటిని సిద్ధంగా ఉంచడమే విన్యాసాల లక్ష్యమని పేర్కొంది. పలు నౌకా స్థావరాలు ఉన్న కోలా దీవి చుట్టూ యుద్ధ నౌకలను రంగంలోకి దించినట్లు వెల్లడించింది. యుద్ధ నౌకలు కూడా విన్యాసాలు నిర్వహించనున్నాయి. సైబీరియాలోని ఇర్కుత్స్క్ ప్రాంతంలో అడవుల్లోకి ఖండాంతర క్షిపణుల ప్రయోగ వ్యవస్థలను సైనిక బలగాలు తరలించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికా, రష్యాల వద్ద అత్యధిక సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్న విషయం తెలిసిందే. ఒక దేశం అణ్వాయుధాలతో దాడికి సన్నద్ధమవుతుందంటే అనివార్యంగా రెండో దేశం కూడా అప్రమత్తమవుతుంది. ఈ పరిస్థితుల్లో ఉద్రిక్తతలు మరింతగా విస్తరించే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి.
అణు యుద్ధానికి భయపడొద్దు: బైడెన్