తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యాపై అమెరికా, మిత్ర దేశాల స్విఫ్ట్​ అస్త్రం- కీలక బ్యాంకులు తొలగింపు - Russia Cut Off From Swift

Russia Cut Off From Swift: రష్యాను ఆర్థికంగా నిర్వీర్యం చేసే దిశగా అమెరికా దాని మిత్రపక్షాలు చర్యలు చేపట్టాయి. (గ్లోబల్ ఫైనాన్సియల్ సిస్టమ్​) స్విఫ్ట్ నుంచి రష్యాకు చెందిన కీలక బ్యాంకులను దూరం చేయాలని నిర్ణయించాయి. ఉక్రెయిన్​పై దాడి నేపథ్యంలో రష్యా సెంట్రల్ బ్యాంకుపై కూడా ఆంక్షలను కఠినతరం చేశాయి. ఉక్రెయిన్ రక్షణ కోసం తామంతా ఏకతాటిపై నడవనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపాయి.

Ukraine Crisis
రష్యాపై స్విఫ్ట్​ ఆంక్షలు

By

Published : Feb 27, 2022, 11:37 AM IST

Russia Cut Off From Swift: రష్యా దురాక్రమణను అడ్డుకొనేందుకు అమెరికా, పశ్చిమ దేశాలు కీలక చర్యలు చేపట్టాయి. అమెరికా, ఐరోపా సమాఖ్య, కెనడా, బ్రిటన్‌లు.. స్విఫ్ట్‌ (సొసైటీ ఫర్‌ వరల్డ్‌వైడ్‌ ఇంటర్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ టెలికమ్యూనికేషన్స్‌) నుంచి రష్యాకు చెందిన కీలక బ్యాంకులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. దీంతో రష్యా బ్యాంకింగ్‌ రంగం అంతర్జాతీయ లావాదేవీలు నిర్వహించడం చాలా కష్టంగా మారిపోయింది.

"మేము ఉక్రెయిన్‌ ప్రభుత్వం, ప్రజలతో ఉన్నాం. రెండో ప్రపంచ యద్ధం నాటి నుంచి ఉన్న అంతర్జాతీయ నిబంధనలపై రష్యా సైనిక చర్యను దాడిగా భావిస్తున్నాం. వాటిని రక్షించడానికి మేము కట్టుబడి ఉన్నాం. ఈ యుద్ధానికి రష్యానే బాధ్యత వహించేలా చేసి.. వ్యూహాత్మక తప్పిందంగా పుతిన్‌కు తెలిసొచ్చేలా చేస్తాం. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి రష్యాను ఏకాకిని చేశాం. రానున్న రోజుల్లో వీటిని కఠినంగా అమలు చేస్తాం" అని ఆ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. అనంతరం ఈ విషయాన్ని ఐరోపా సమాఖ్య అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డేర్‌ లెయాన్‌ ట్విటర్‌లో ధ్రువీకరించారు.

మరోపక్క ఈ చర్యలను త్వరలోనే అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు స్విఫ్ట్‌ ఇంటర్నేషనల్‌ పేమెంట్‌ వ్యవస్థ వెల్లడించింది. "కొత్త చర్యల పరిధిలోకి వచ్చే సంస్థలను గుర్తించేందుకు ఐరోపా అధికారులతో కలిసి పనిచేస్తున్నాం. ఈ క్రమంలో చట్టబద్ధంగా నిర్వర్తించాల్సిన చర్యలను చేపట్టాం" అని పేర్కొంది.

రష్యా రిజర్వులే లక్ష్యంగా..

Ukraine Crisis: అంక్షల నుంచి తట్టుకొనేలా చేసేందుకు రష్యా పోగు చేసిన 600 బిలియన్‌ డాలర్లు విలువైన రిజర్వులను ఆ దేశ సెంట్రల్‌ బ్యాంక్‌ వినియోగించకుండా చేయాలనే లక్ష్యంతో ఈ బ్యాన్‌ విధించినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. దీనిపై ఐరోపా సమాఖ్య అధికారి ఒకరు మాట్లాడుతూ.. రష్యా సెంట్రల్‌ బ్యాంక్‌ వద్ద ఉన్న విదేశీ ఆస్తులను స్థానిక కరెన్సీ కోసం విక్రయించకుండా ఇది అడ్డుకొంటుందని పేర్కొన్నారు. దీంతోపాటు విదేశాల్లోని రష్యా రిజర్వులు సమర్థంగా స్తంభింపజేస్తుందని వెల్లడించారు. రూబుల్‌ పతనం సమయంలో వీటిని వాడే అవకశాలు తగ్గిపోతాయని చెప్పారు.

ఒలిగార్క్‌ల ఆస్తుల వేట..

రష్యాకు చెందిన ఒలిగార్క్‌లు (శక్తిమంతమైన సంపన్నులు), కంపెనీలకు చెందిన ఆస్తులను వేటాడేందుకు టాస్క్‌ ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు అమెరికా ప్రకటించింది. రష్యన్ల యాట్లు, విలాసవంతమైన కార్లు, భవనాలు, గోల్డెన్‌ పాస్‌పోర్టులు, వారి పిల్లలు పశ్చిమ దేశాల కళాశాలల్లో చదవకుండా అడ్డుకొనేలా ఇది చర్యలు తీసుకొంటుంది. అమెరికా ఆంక్షలు పూర్తిగా, సమర్థంగా అమలయ్యేలా చూస్తుంది.

మాస్కోపై స్విఫ్ట్‌ ప్రభావం ఇలా..

Russia Ukraine Crisis News: స్విఫ్ట్‌ బ్యాన్‌తో రష్యా ఆర్థిక వ్యవస్థ తక్షణమే ప్రభావం అవుతుంది. ఈ ప్రభావం దీర్ఘకాలం ఉంటుంది. రష్యా చమురు, గ్యాస్‌ విక్రయిం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇది గణనీయంగా అడ్డుకొంటోంది. చమురు, గ్యాస్‌ సొమ్ము రష్యా ఆదాయాల్లో 40శాతం వరకు ఉంటుంది. గతంలో 2012లో ఇరాన్‌ను స్విఫ్ట్‌ నుంచి పక్కనపెట్టారు. దీంతో ఇరాన్‌ ఆర్థికంగా బాగా దెబ్బతింది. 50శాతం చమురు ఆదాయం, 30 శాతం విదేశీ వ్యాపారాన్ని కోల్పోయింది.

ఇతర దేశాలపైనా ప్రభావం..

స్విఫ్ట్‌ సేవల నుంచి రష్యా బ్యాంకులను దూరంగా పెట్టినట్లయితే ఆ దేశానికి సరకులను ఎగుమతి చేసే వారు తమకు రావాల్సిన నగదును పొందటానికి కష్టపడాల్సి వస్తుంది. రష్యా ప్రధాన ఎగుమతులైన చమురు, సహజవాయువులను పొందే దేశాలకూ ఇబ్బందులు తప్పవు.

ఏమిటీ స్విఫ్ట్‌..?

ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లావాదేవీల సమాచారాన్ని అత్యంత కచ్చితత్వంతో మార్పిడి చేసుకొవడానికి ఉపయోగించే నెట్‌వర్కింగ్‌ వ్యవస్థ. దీని ప్రధాన కార్యాలయం ఐరోపా సమాఖ్యలోని బెల్జియంలో ఉంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా రెండు వందలకుపై దేశాలకు చెందిన 11,000 వేల బ్యాంకింగ్‌, సెక్యూరిటీ ఆర్గనైజేషన్స్‌ను అనుసంధానిస్తుంది. సభ్యులైన ప్రతి సంస్థకు బ్యాంకింగ్‌ ఐడెంటిఫికేషన్‌ కోడ్‌ (స్విఫ్ట్‌ కోడ్‌)ను కేటాయిస్తారు. ఉదాహరణకు న్యూయార్క్‌లోని ఒక బ్యాంక్‌ నుంచి లండన్‌లోని ఓ బ్యాంక్‌లో ఖాతా తెరిచి వినియోగదారుడు డబ్బులు తేలిగ్గా పంపవచ్చు. న్యూయార్క్‌లోని చెల్లింపుదారుడు తన బ్యాంక్‌కు సొమ్ము చెల్లించి లండన్‌లోని స్వీకర్త బ్యాంక్‌ స్విఫ్ట్‌ నంబర్‌, ఖాతా వివరాలు ఇవ్వాలి. అప్పుడు న్యూయార్క్‌లోని బ్యాంక్‌ నుంచి లండన్‌లోని బ్యాంక్‌కు స్విఫ్ట్‌ సందేశం వెళుతుంది. ఆ తర్వాత లండన్‌లోని బ్యాంక్‌ నుంచి స్వీకర్తకు సొమ్ము అందుతుంది. స్విఫ్ట్‌ మార్గంలో కేవలం సందేశాలను మాత్రమే పంపిస్తుంది. నగదు, ఇతర సెక్యూరిటీలను బదలాయించదు.

స్విఫ్ట్‌ సంస్థ 2021 లెక్కల ప్రకారం రోజుకు 42 మిలియన్ల సందేశాలను పరిశీలిస్తుంది. ఏటా ఈ సంఖ్య 11.4శాతం పెరుగుతోంది. ఐరోపా సమాఖ్య, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలు కలిపి 4.66 బిలియన్ల సందేశాలను పంపుతున్నాయి. ఇక అమెరికా, యూకే 4.42 బిలియన్ల సందేశాలను స్విఫ్ట్‌ద్వారా పంపుతున్నాయి.

ఇదీ చదవండి:'స్విఫ్ట్​' అస్త్రం ప్రయోగిస్తే.. రష్యాకు జరిగే నష్టం ఏంటి?

'నాటోలోని ప్రతి అంగుళం భూభాగాన్ని కాపాడుకుంటాం'

ABOUT THE AUTHOR

...view details