రష్యాలో కొవిడ్(Russia covid cases) విధ్వంసం కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి కరోనా కేసులు(Corona virus in Russia) వెలుగుచూస్తున్నాయి. అక్కడ తాజాగా 1,163 మంది మరణించారు. దీనితో ఐరోపాలోనే అత్యధికంగా 2,36,220 మరణాలు ఇక్కడ నమోదయ్యాయి. మరోవైపు.. రోజువారీ కేసుల సంఖ్య శుక్రవారం స్వల్పంగా తగ్గింది. అక్కడ కొత్తగా 39,849కి కరోనా సోకింది.
కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో.. దేశంలో కొవిడ్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి.. ప్రత్యేక చర్యలు చేపట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. వైరస్ కట్టడిలో భాగంగా.. పాఠశాలలు, రెస్టారెంట్‌లు సహా.. క్రీడలు, వినోదానికి సంబంధించిన ప్రాంతాలను మూసేశారు అధికారులు. కేవలం ఆహారం, మందులు, నిత్యావసర వస్తువుల దుకాణాలు మాత్రమే తెరిచేందుకు అనుమతించారు.
మ్యూజియంలు, థియేటర్లకు పరిమిత సంఖ్యలో వ్యాక్సిన్ వేసుకున్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. క్లబ్‌లు ఇతర వినోద సంబంధిత ప్రదేశాలు మూతపడనున్నాయి. 60 ఏళ్లు పైబడిన వారితో పాటు.. వ్యాక్సిన్ వేసుకోని వారు ఇళ్లకే పరిమితమయ్యేలా చూడాలని అధ్యక్షుడు పుతిన్(vladimir putin latest news) అధికారులను ఆదేశించారు.
మరోవైపు.. మహమ్మారి కట్టడికి ప్రభుత్వం ఇంతచేస్తున్నా.. చాలామంది రష్యన్లు పెయిడ్ హాలిడేను విహార యాత్రలకు వెళ్లేందుకు ఉపయోగించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ రష్యాలోని అన్ని వినోదాత్మక ప్రాంతాలను మూసివేయించారు. ఇదే సమయంలో ఈజిప్ట్, టర్కీకు వెళ్లేవారి సంఖ్య పెరిగినట్లు అధికారులు గుర్తించారు.
గర్వమైన ప్రకటన.. పేలవ ప్రదర్శన..
ప్రపంచంలోనే తొలి కరోనా టీకాకు రష్యా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గర్వంగా ప్రకటించింది. అయినా టీకా వేసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపనందు వల్ల వ్యాక్సినేషన్ నత్త నడకన సాగుతోంది. మొత్తం 14.6కోట్ల మంది జనాభా ఉన్న రష్యాలో.. ఇప్పటి వరకు 5కోట్ల మంది మాత్రమే టీకా రెండు డోసులు పూర్తి చేసుకున్నారు.