అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటి నుంచి వారి పాలన నుంచి తప్పించుకునేందుకు వేల మంది అఫ్గాన్‌లు దేశం విడిచి పారిపోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అనేక మంది ఇప్పటికే విమానాల్లో ఇతర దేశాలకు వలసవెళ్లారు. తమకు కూడా అవకాశం రాకపోతుందా అనే ఆశతో విమానాశ్రయంలోనే చాలామంది నిరీక్షిస్తున్నారు. ఈ పరిణామాలను కొందరు వ్యాపారస్తులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. విమానాశ్రయంలో ఆహారం, నీళ్లు, శీతలపానీయాల ధరలను ఊహించని విధంగా పెంచేశారు. అమాంతంగా పెరిగిపోయిన ధరలతో ఆకలికి అల్లాడుతున్నారని ఓ ప్రముఖ వార్తా సంస్థ కథనం ప్రచురించింది.
'ప్లేట్ భోజనానికి 100 డాలర్లు(సుమారు రూ.7500), లీటర్ మంచినీళ్ల బాటిల్‌కి రూ.3,000, చెల్లించాల్సి వస్తోంది. దుకాణదారులు అఫ్గానీ కరెన్సీకి బదులు డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలను దోపిడీ చేస్తున్నారు. అసమాన ధరల వల్ల ప్రజలు ఆకలితో ఎండలోనే నిలబడాల్సిన దుస్థితి నెలకొంది,' అని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.