ఇరాక్ రాజధాని బగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయమే లక్ష్యంగా ఆదివారం రాకెట్ దాడులు జరిగాయని ఇరుదేశాల భద్రతాదళాల అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే ఈ దాడులకు ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత వహించలేదు.
టైగ్రిస్ నది పశ్చిమతీరంలో వివిధ దేశాలకు చెందిన రాయబార కార్యాలయాలు ఉన్నాయి. వీటికి సమీపంలోనే రాకెట్ దాడులు జరిగాయి. కనీసం 5 రాకెట్లు ప్రయోగించినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడిలో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాల గురించి ఎలాంటి సమాచారం లేదు.
ఉద్రిక్తతలు పెరిగేనా?
ఇరాన్ సైనిక జనరల్ ఖాసీం సులేమానీని అమెరికా హతమార్చిన తరువాత... ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడిచేసింది. ఈ దాడిలో సుమారు 80 మంది వరకు అమెరికా సైనికులు మరణించినట్లు వార్తలొచ్చాయి. అయితే తరువాత ఇరుదేశాల మధ్య కొత్త ఉద్రిక్తతలు తగ్గాయి.
తాజాగా అమెరికా రాయబార కార్యాలయంపై దాడులు జరిగిన నేపథ్యంలో మళ్లీ గల్ఫ్ తీరంలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశముంది.
ఇదీ చూడండి:'ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల్లో విశ్వాసం పోయింది'