జమ్ముకశ్మీర్‌పై పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోమారు చూపించి ట్విట్టర్ వేదికగా నవ్వులపాలైంది. ఆ దేశ అధికారిక రేడియోలో జమ్ముకశ్మీర్ ప్రాంతం వాతావరణ పరిస్థితులను తెలపటం ప్రారంభించింది. అయితే అందులో -4 డిగ్రీల కంటే -1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత తక్కువని చెప్పినందున.. నెటిజన్లు పాక్ రేడియోపై ఘాటుగా స్పందించారు.
పాక్ ఆక్రమిత (పీఓకే) ప్రాంతాలైన గిల్గిత్, బాల్టిస్థాన్, ముజఫరాబాద్ వాతావరణ పరిస్థితులను భారత వాతావరణ శాఖ పరిధిలోకి తీసుకొచ్చిన రెండు రోజుల్లోనే ఈ మేరకు వెల్లడించటం గమనార్హం.
ఇదీ ట్వీట్..
జమ్ముకశ్మీర్‌లోని చాలా ప్రాంతాలు మేఘావృతమై ఉన్నాయి.. వర్షం పడే అవకాశం ఉందని తెలిపిన పాక్ రేడియో.. లద్దాఖ్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత -4 డిగ్రీల సెంటిగ్రేడ్, కనిష్ఠ ఉష్ణోగ్రత -1 డిగ్రీ సెంటిగ్రేడ్‌గా ట్వీట్ చేసింది పాక్ రేడియో.
ట్రోల్స్ వర్షం..
పాక్ రేడియో ట్వీట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు నెటిజన్లు. పాకిస్థాన్ జాతిపిత ముహమ్మద్ అలీ జిన్నా ఫోటోలతో మీమ్స్ చేస్తూ ట్రోల్ చేశారు. '–' (మైనస్) విలువ తెలియదని ఎద్దేవా చేస్తూ.. పాక్‌కు బుద్ధి చెప్పారు.
ఓ ట్విట్టర్ వినియోగదారుడు రేడియో పాక్‌ను తప్పుపడుతూ.. -1 అనేది గరిష్ఠం, -4 అనేది కనిష్ఠం అనేది తెలుసుకోవాలి అంటూ విమర్శలు చేశాడు. మరో వ్యక్తి రేడియో పాక్ ట్వీట్ చదివాక.. పాక్ గరిష్ఠ స్థితి, కనిష్ఠ ఐక్యూ తెలుస్తోందని విమర్శించాడు.
మరో నెటిజన్ ఘాటుగా స్పందించాడు. పాకిస్థాన్ కామన్ సెన్స్‌కు రిప్ ప్రకటిస్తూ ట్వీట్ చేశాడు. -4 గరిష్ఠం, -1 కనిష్ఠం ఏంటి? అని ప్రశ్నించాడు.
ప్రత్యేక కవరేజీ..
రేడియో పాకిస్థాన్ కశ్మీర్‌పై ప్రత్యేక కవరేజీ ఇస్తోంది. దాని వెబ్ పేజీలో జమ్ముకశ్మీర్ వార్తల కోసం ప్రత్యేక స్థానం కల్పించింది. ప్రభుత్వ టెలివిజన్‌లోనూ కశ్మీర్‌పై వార్తలు ప్రసారం చేయటం సహా ప్రత్యేక బులిటెన్ ఇస్తోంది. పీఓకేలోని గిల్గిత్, ముజఫరాబాద్, మిర్పుర్ ప్రాంతాల వాతారవరణ పరిస్థితులను భారత ఐఎండీ పరిధిలోకి తీసుకురావటాన్ని తోసిపుచ్చింది. ఈ ప్రాంత పరిస్థితులను మార్చే ప్రక్రియ చట్టబద్ధం కాదని పేర్కొంది.